Share News

మాకు యుద్ధ పరిహారం కావాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:22 AM

ప్రకాశం, నెల్లూరు జిల్లాల షెడ్యూల్ కులాల ప్రజల గురించి రాయడమంటే ‘మా’ గురించి, అందులో ‘నా’ గురించీ, మా బతుకు పోరాటాల గురించీ రాయడమే. నేను ఒంగోలు పట్టణంలో పుట్టకపోయినా, అక్కడ ఇల్లు–ఆస్తులు లేకపోయినా...

మాకు యుద్ధ పరిహారం కావాలి

ప్రకాశం, నెల్లూరు జిల్లాల షెడ్యూల్ కులాల ప్రజల గురించి రాయడమంటే ‘మా’ గురించి, అందులో ‘నా’ గురించీ, మా బతుకు పోరాటాల గురించీ రాయడమే. నేను ఒంగోలు పట్టణంలో పుట్టకపోయినా, అక్కడ ఇల్లు–ఆస్తులు లేకపోయినా, నేను ఒంగోలియన్‌ని అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తాను. ఈ ప్రాంతపు మట్టి, గాలి, నీరు పర్యావరణంతో, ఇక్కడి మనుషులతో నాకున్న ప్రాకృతిక అనుబంధాలు, బాల్యస్మృతులు అందుకు కారణం. అవి నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేస్తాయి. 1840లో క్రైస్తవ మిషనరీ అయిన శామ్యూల్ డే ఆధ్వర్యంలో నెల్లూరు గడ్డపై అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీల సేవలు ప్రారంభమయ్యాయి. 1860లో క్రైస్తవ మిషనరీలుగా ఒంగోల్లో అడుగు పెట్టిన క్లౌ దంపతులు, తమకు పుట్టిన పాపకి ఒంగోలియా అని పేరు పెట్టారని తెలుసుకొని, వారు ఒంగోలు ప్రాంతాన్ని సొంతం చేసుకున్న తీరుకి ఎంతో సంభ్రమాశ్చర్యాలు, భావోద్వేగానికి లోనయ్యాను.

2011 జనాభా గణాంకాల ప్రకారం విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో మాదిగ అనుబంధ కులాల వారి జనాభా 35 లక్షలు. కాగా, మాల అనుబంధ కులాల వారి జనాభా 38 లక్షలు. (ఈ లెక్కల్లో మాదిగ జనాభాని సంఖ్య తక్కువ చేసి చూపించారనే అభిప్రాయం ఈ వ్యాస రచయితకుంది.) అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎస్సీ కులాల జనాభాలో మాదిగ వారి జనాభా, మాలవారి కంటే అధికం. కాగా, మిగిలిన ఏడు జిల్లాల్లో మాలవారి జనాభా మాదిగవారి కంటే అధికం. ఈ జనాభా లెక్కల ప్రకారం పాత ప్రకాశం, నెల్లూరు – రెండు జిల్లాల మొత్తం ఎస్సీ జనాభా 14,54,449 మంది. నెల్లూరు జిల్లా మొత్తం ఎస్సీ జనాభా 6,66,588 మంది. ఇందులో మాదిగ వారి జనాభా 2,27,684 మంది. కాగా, మాల వారి జనాభా 4,14,654 మంది. ఇతర ఎస్సీ కులాల జనాభా 24,250 మంది. ఇక ప్రకాశం జిల్లా మొత్తం ఎస్సీ జనాభా 7,87,861 మంది. ఇందులో మాదిగ జనాభా 4,15,095 మంది. కాగా, మాల జనాభా 3,47,274 మంది. ఇతర ఎస్సీ కులాల జనాభా 25,492 మంది.

భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వచ్చేనాటికి, జంబూ ద్వీపంలోని వందలాది స్వదేశీ సంస్థానాలన్నింటా వున్న ఎస్సీలు... ఆస్తులు, ఆయుధాలు, తిండి, బట్ట, నివాసం, చదువులు, శుభ్రత, గౌరవం, హోదా నిరాకరించబడినవారు. సాంఘిక బానిసలుగా, సాంఘిక ఖైదీలుగానే నాడు జీవించారు, ఇప్పటి ఎస్సీ కులాల వారి పూర్వీకులు. మాదిగ వారు, మాల వారు, ఇతర షెడ్యూల్డ్ కులాల వారు బ్రిటీష్ ఇండియాలో ఆదిమ జాతులుగా జీవించారు. ఇప్పటి కొన్ని ఎస్సీ కులాలు, ఎస్టీ జాతులు నాడు నేరస్థ తెగలుగా పరిగణించబడినాయి. ఇది చరిత్ర.

ఎస్సీ కులాల ప్రజలు స్వాభావికంగా ఉన్నది ఉన్నట్టు చూసే హేతువాద దృక్పథం కలవారు. వీరు ప్రకృతివాదులు. కొందరు స్థానిక అమ్మదేవర్లను కొలుస్తారు. కొందరు లౌకిక భక్తి, లౌకిక మతావలంబకులు. ఎస్సీ కులాల వారు దీర్ఘకాలికంగా తమపై కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వివక్షల యుద్ధాలకు విరుగుడుగా ఎన్నో రకాల తాత్విక, ఆధ్యాత్మిక యుద్ధాలు చేశారు. శాంతిదారుల్లో పయనించారు. వీరి అశక్తతను చూసి ప్రతి కాలంలో పాలకులు ఏ మతస్తులయితే, వారి పాలితులుగా ఉన్న ఎస్సీ సమూహాలను కూడా తమ మతాలను అనుసరించేటట్టు చర్యలు తీసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల దాకా వ్యాపించి ఉన్న నిజాం రాజ్యంలో ఇస్లాం మతాన్ని; ఇండియాలో బ్రిటిష్ వలస పాలనలో క్రైస్తవ మతాన్ని పుచ్చుకునేటట్టు పాలకులు కొందరు ఎస్సీలను ప్రేరేపించారు. ఇక 1947 తర్వాత ఎస్సీ కులాల వారందరినీ హిందూ మతం లెక్కల్లో వేశారు. తామెట్ల హిందువులయ్యారో ఆశ్చర్యపోయే ఎస్సీలను మనం ఇప్పటికీ తరచుగా చూడగలం.

మద్రాస్ రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే చర్మకార మాదిగల గురించి క్రైస్తవ మిషనరీ అయిన డాక్టర్ ఎమ్మా రొషాంబు క్లౌ తను రాసిన While sewing sandals గ్రంథంలో ‘‘మాదిగల్లో ఆదిమ జాతి లక్షణాలన్నీ ఉన్నాయని, మాదిగలు ఆదిమ జాతేనని, త్రిపురాంతకం కేంద్రంగా ఉన్న నాసరయ్య మతాన్ని మొదట మాదిగలు అనుసరించారని, ఆ తర్వాత 1910లో గుండ్లకమ్మ నది వద్ద పదివేల మంది బాప్తిస్మం తీసుకున్నా’’రనీ రాశారు. మరొక పుస్తకం ‘‘ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మిషనరీల సేవ’’ (తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణ) ప్రకారం, వందేళ్ళ క్రితం క్రైస్తవ మతం తీసుకున్న మొదటి తెలుగు వ్యక్తి కనిగిరి ఏరియా వాస్తవ్యుడు ఎర్రగుంట్ల పేరయ్య అనే మాదిగ వ్యక్తి అని చరిత్ర నమోదు చేసింది.

బ్రిటిష్ పాలకుల నుంచి హిందూ ఆధిపత్య కులాల పాలకులు దాకా– అభివృద్ధి, స్వాతంత్ర్యం, సంస్కరణల ఫలాల పేరుతో ఎస్సీ కులాల ప్రజల కోసం వచ్చిన కొద్దిపాటి, పరిమిత విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాలు, ప్రాతినిధ్యాలన్నింటినీ మాల కులం వారు, వారి కులం జనాభా దామాషాకంటే అదనంగా తీసేసుకుంటున్నారు. ఎస్సీలలో ఈ అవకాశాలు పొందిన కులమే, పొందిన కుటుంబాలే, మళ్లీమళ్లీ అవకాశాలు పొందే అపసవ్య పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఉదాహరణకు ఇప్పటి వరకూ నెల్లూరు ఎస్సీ పార్లమెంటు సీటుకు 15 సార్లు ఎంపికైన వారిలో కేవలం ఇద్దరే మాదిగలు. మిగిలిన 13 మందీ మాలవారే. అంతేకాదు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గూడూరు, సూళ్లూరుపేట, సంతనూతలపాడు, కొండపి, ఎర్రగొండపాలెం – ఈ ఐదు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే స్థానాల నుంచి ఇప్పటి వరకూ పదిమంది లోపే మాదిగలు ఎమ్మెల్యేలు అయ్యారు. కాగా, ఈ నియోజకవర్గాల్లో 50 మందికి పైగా మాలవారు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఇది కేవలం రాజకీయ రంగంలో కొనసాగుతున్న ఒక వ్యత్యాసం, ఒక అసమానత, ఒక వివక్ష.

కారంచేడు మాదిగ ఉద్యమం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం, టంగుటూరు ఇందిర మహిళా ఉద్యమం, దళిత మహాసభ ఉద్యమం, అంబేడ్కర్ భావజాల ఉద్యమం, వామపక్ష విద్యార్థి, యువజన, రైతుకూలీ ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యతా ఉద్యమం– ఇలా ఎన్నో ఉద్యమాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచే ప్రారంభమయ్యాయి. ఒకవైపు చైతన్యం పెరుగుతున్నా, మరోవైపు వ్యతిరేక చైతన్యమూ కమ్ముకుంటున్నది. ఇప్పటికీ ఈ రెండు జిల్లాల్లోని మాదిగల్లో ఎక్కువగా, మాల వారిలో కొంత తక్కువగా నిరుద్యోగం, నిరక్షరాస్యత తాండవిస్తోంది. అంటరానితనం, అత్యాచారాలు, దాడులు, రూపాలు మార్చుకుంటూ ఈ రెండు కులాల ప్రజలపై, ఆ మాటకొస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం షెడ్యూల్ కులాల ప్రజలపై ఆధిపత్య కులాల వివక్షల యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

పాలక కులాలు మాదిగ వారిని – మాల వారిని ప్రత్యర్థి శిబిరాలుగా విడదీసి, సాపేక్షికంగా ఎక్కువ జీవనోపాధి, అధికార అవకాశాలు, ప్రాతినిధ్యాలు మాల వారికి కల్పిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం పంపిణీ న్యాయం అడుగుతున్న మాదిగ వారిని కొందరు మాల వారు హీన భావంతో చూస్తున్నారు. ద్వేషిస్తున్నారు. ఆధిపత్య కులాల వ్యవస్థల ముందు, కేవలం సమాన అవకాశాలు, సహోదరత్వం మాత్రమే మా డిమాండ్లు కావు. అంతకు మించినవి ఉన్నాయి. మాదిగవారు, మాలవారు, ఇతర ఎస్సీ కులాల వారిపై వివిధ రూపాల్లో జరుగుతున్న ఆధిపత్య కులాల వారి నిరంతర వివక్షల యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలి. ఆధిపత్య కులాల ప్రభుత్వాలు మాకు యుద్ధ పరిహారం చెల్లించాలి. మాల వారి నుంచి మాదిగలకు కలిసి పోరాడే అంత నమ్మకమైన సమానత, సహోదరత లభించాలి.

కృపాకర్‌ మాదిగ

Updated Date - Mar 01 , 2024 | 05:22 AM