Share News

వయనాడ్‌ విలయానికి కారకులు ఎవరు?

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:57 AM

ఆ బాధ్యత నా జీవితంలో మహా కఠినమైన పని. పశ్చిమ కనుమలపై మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ సిఫారసులను సమీక్షించేందుకు గత ప్రభుత్వం నియమించిన కె. కస్తూరి రంగన్‌ కమిటీలో ఒక సభ్యురాలుగా...

వయనాడ్‌ విలయానికి కారకులు ఎవరు?

ఆ బాధ్యత నా జీవితంలో మహా కఠినమైన పని. పశ్చిమ కనుమలపై మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ సిఫారసులను సమీక్షించేందుకు గత ప్రభుత్వం నియమించిన కె. కస్తూరి రంగన్‌ కమిటీలో ఒక సభ్యురాలుగా ఉండడం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. పశ్చిమ కనుమలను విధ్వంసం నుంచి పరిరక్షించే చర్యల పట్ల ఎందుకు అంత తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందో మనం చర్చించాల్సిన అవసరమున్నది. ఇటీవల 400మందిని బలిగొన్న వయనాడ్‌ విపత్తు లాంటి ఉపద్రవాలను చవిచూస్తున్నా పశ్చిమ కనుమల ప్రాంతాల ప్రజలు తమ ప్రాంత పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడంపై మెరుగైన అవగాహనతో కూడిన శ్రద్ధాసక్తులను ఎందుకు చూపించడం లేదనేది నన్ను బాగా కలవరపెడుతోంది.


సరే, కస్తూరి రంగన్‌ కమిటీ సభ్యురాలుగా నేను ఎదుర్కొన్న సందిగ్ధావస్థ గురించి తొలుత వివరిస్తాను. కస్తూరి రంగన్‌ కమిటీ, పౌర సమాజం వాగ్వ్యవహారంలో చెప్పాలంటే, మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ కీలక సిఫారసులను అస్పష్టం చేసి బలహీనపరిచేందుకు ఏర్పాటు చేసిన కమిటీ. కమిటీ మొదటి సమావేశం జరగకముందే ఏదో తప్పు చేశామనే భావన మాకు కలిగింది. ఆరు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతం (ఎకొలాజికల్లీ సెన్సిటివ్‌ ఏరియా)గా ప్రకటించాలని మాధవ్‌ గాడ్గిల్‌ నివేదిక స్పష్టంగా సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసు ఆ ఆరు రాష్ట్రాలలో ఏ ఒక్కదానికీ ఆమోదయోగ్యం కాలేదు. గాడ్గిల్‌ నివేదికను తిరస్కరించాయి. కనుక కస్తూరి రంగన్ కమిటీ సభ్యురాలుగా నా విధి నిర్వహణ చాలా జటిలమైనదని నాకు బాగా తెలుసు. పశ్చిమ కనుమలను శీఘ్రగతిన పరిరక్షించేందుకు దోహదం చేసే పరిష్కారాన్ని కనుగొనడం ఎలా?

పశ్చిమ కనుమలలో 1,37,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (80 శాతం)ను సున్నిత పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని మాధవ్‌ గాడ్గిల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ రక్షిత సున్నిత పర్యావరణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రతి ప్రాంతంలోను అనుమతించదగిన కార్యకలాపాల వివరాలను విపులంగా సమకూర్చింది. ఇదిగో ఈ సిఫారసే తోటల ప్రాంతాలు, వ్యవసాయ భూములు ప్రభుత్వ నియంత్రణకు లోనవుతాయేమోననే భయాలు, సంకోచాలను సృష్టించడానికి దారి తీసింది. అయితే ఆ సిఫారసు చేయడంలో మాధవ్‌ గాడ్గిల్‌ ఉద్దేశం అది కాదని నేను ఘంటాపథంగా చెప్పుతున్నాను. గాడ్గిల్‌ నాకు బాగా తెలుసు. పర్యావరణ, ప్రజల జీవనోపాధుల రక్షణకు అంకితభావంతో కృషి చేసిన పర్యావరణవేత్త. సామాజిక సమూహల హక్కులను సంరక్షించాలని ఆయన సదా వాదించేవారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు సంపూర్ణ భాగస్వాములు కావాలనేది ఆయన ఆకాంక్ష. గాడ్గిల్‌ నివేదికకు ఆయన ఆకాంక్షకు విరుద్ధమైన భాష్యాలు చెప్పడం చాలా విచారకరమైన విషయం. ఎందుకలా జరిగింది? పశ్చిమ కనుమల ప్రాంతాలలో విధ్వంసకరమైన ‘అభివృద్ధి’ కార్యకలాపాలకు కారకులు, రాజకీయ ప్రాబల్యమున్న శక్తిమంతమైన స్వార్థపరశక్తులే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఆరు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు, ఇతరులతో చర్చలు జరిపిన అనంతరం కస్తూరి రంగన్ కమిటీ తన సిఫారసులు రూపొందించింది. 2013లో పర్యావరణ పరిరక్షణ చట్టంలోని 5వ సెక్షన్‌ కింద వాటిని జారీ చేశారు. నోటిఫై అయిన సిఫారసులు మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ నివేదికకు రెండు మార్పులు చేశాయి. మొదటిది– పశ్చిమ కనుమలలోని సున్నిత పర్యావరణ ప్రాంతాన్ని 59,940 చదరపు కిలోమీటర్లకు కుదించింది. ఉపగ్రహాల ద్వారా తీసిన ఫోటోల ఆధారంగా పశ్చిమ కనుమలలో 60 శాతం తోటలు, వ్యవసాయ భూములు, మానవ ఆవాస ప్రదేశాలుగా ఉన్నాయని నిర్ధారించారు. వీటిని సాంస్కృతిక భూ దృశ్యం (కల్చరల్‌ ల్యాండ్‌ స్కేప్‌ – ప్రకృతి, మానవ చర్యలు రెండిటితో తీర్చిదిద్దబడిన ప్రాంతం)గా వర్గీకరించారు. సదరు భూములను ఉపయోగించుకుంటున్న తీరుతెన్నులను వెనక్కి అంటే పూర్వపు పరిస్థితికి మళ్లించలేము. కనుక మిగిలిన సహజ భూ దృశ్యం (నేచురల్ ల్యాండ్‌ స్కేప్‌)ను పరిరక్షించుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ సహజావరణంలో 20 శాతానికి పైగా పరిరక్షిత అడవులు, గ్రామాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం ఆ పరిరక్షిత గ్రామాల జాబితాను కూడా పేర్కొంది.

పశ్చిమ కనుమలలో అనుమతిస్తున్న, అనుమంతించని కార్యకలాపాల సమగ్ర జాబితాను జారీ చేయకుండా విధ్వంసకర కార్యకలాపాలను చాలవరకు నిషేధించాలని కస్తూరి రంగన్‌ కమిటీ సిఫారసు చేసింది. దీని ప్రకారం ఇసుక తవ్వకాలతో సహా సకల మైనింగ్ కార్యకలాపాలు నిషిద్ధమయ్యాయి. అలాగే ధర్మల్ విద్యుత్కేంద్రాలతో సహా సకల కాలుష్యకారక పరిశ్రమలు, భారీ స్థాయిలో భవన నిర్మాణ, ప్రాజెక్టులు, కొత్త టౌన్‌షిప్‌ ప్రాజెక్టులు మొదలైనవన్నీ నిషిద్ధమయ్యాయి. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులపై 2013లో జారీ అయిన నోటిఫికేషన్‌ ఇప్పటికీ అమలులో ఉన్నది. దానికింద పరిరక్షిత పశ్చిమ కనుమలలో నిషిద్ధ కార్యకలాపాలకు పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదు. అయితే ఈ విషయంలో ఒక కీలకమార్పు చోటుచేసుకున్నది. అది కేరళ రాష్ట్ర సంబంధితమైనది.


కస్తూరి రంగన్‌ సిఫారసుల నోటిఫికేషన్‌పై కేరళ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. రక్షిత ప్రాంతాలలో మార్పులు చేయాలని కోరింది. కస్తూరి రంగన్‌ కమిటీ పేర్కొన్న నేచరల్‌ ల్యాండ్‌ స్కేప్‌లోని గ్రామాలను మొత్తంగా పరిరక్షిత ప్రదేశాలుగా వర్గీకరించకూడదని కేరళ ప్రభుత్వం వాదించింది. అందుకు బదులుగా గ్రామ సరిహద్దుల పరిధిలో ఒక ప్రాంతాన్ని పరిరక్షితమైనదిగా, మరొక ప్రాంతాన్ని పరిరక్షితం కానిదిగా పరిగణించాలని కేరళ సూచించింది. ఈ విధంగా కస్తూరి రంగన్‌ కమిటీ జాబితాలో ఉన్న గ్రామాలలో సున్నిత పర్యావరణ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను అనుమతించాలి. కేరళ ప్రభుత్వ సూచనను ఆమోదిస్తూ 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కేంద్రప్రభుత్వం 2018లో ఒక సవరణ చేసింది. కేరళ డిమాండ్‌ చేసిన విధంగా పరిరక్షిత పశ్చిమ కనుమలలోని 3,115 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆ నోటిఫికేషన్‌ నుంచి మినహాయించింది.


ఈ నేపథ్యంలో మనం రెండు ప్రధాన విషయాల గురించి మరింత విస్తృతంగా చర్చించవలసి ఉన్నది. ఒకటి– కస్తూరి రంగన్‌ కమిటీ సిపారసులలో కేరళ కోరిన సవరణే వయనాడ్‌ విషాదానికి దారితీసిందా? రెండు– వాతావరణ మార్పు తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న ఈ కాలంలో ఏ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ నమూనాకు ప్రజల మద్దతు ఖాయంగా లభిస్తుంది? మరింత స్పష్టంగా చెప్పాలంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలలో అభివృద్ధి నమూనాను ఎలా రూపొందించుకోవాలి?

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Aug 16 , 2024 | 01:57 AM