Share News

ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ఓటు వేయాలి!

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:37 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో దగాపడుతున్న ఉత్తరాంధ్రులకు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనే అస్త్రం తర్వలో జరగబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల ద్వారా లభిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల...

ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ఓటు వేయాలి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో దగాపడుతున్న ఉత్తరాంధ్రులకు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనే అస్త్రం తర్వలో జరగబోయే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల ద్వారా లభిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌ ఈ ప్రాంత జనవాణిగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో చేర్చేలా ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత ప్రజలు త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విలువైన ఓటుతో సమాధానం చెప్పాలి.

సహజ వనరులు ఉండి కూడా ఉత్తరాంధ్ర ఎందుకు నానాటికీ వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నదో తెలుసుకోవలసిన కీలక తరుణమిది. ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రధాన కారణం స్థానికేతర రాజకీయ నేతలు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై, పెత్తనం చెలాయిస్తూ ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేవలం మాటల్లో కాకుండా చిత్తశుద్ధితో కృషిచేయాలని ఇక్కడి పౌర సమాజం బలంగా కోరుకుంటోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వచ్చి ఉంటే నేడు ఉత్తరాంధ్ర పరిస్థితి భిన్నంగా ఉండేది. ఈ ప్రాంతం పట్ల సాగుతున్న నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివృద్ధి రాహిత్యం ముప్పేట దాడిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర బిడ్డలుగా అందరిపై ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ఫలాలలో మన ప్రాంత ప్రజల న్యాయమైన వాటా సాధించుకునే సమయమిది.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేంద్రం నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారు. విభజన జరిగి 10 సంవత్సరాలు కావొస్తున్నా ఇది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి కూలంకషంగా చర్చించి, ప్రజాకాంక్షలను సవివరంగా ముందుకు తీసుకొచ్చి, అవి నెరవేరే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, రైలు, జాతీయ రోడ్లు, ఓడరేవు, విమానాశ్రయం, అన్నింటికీ మించి పుష్కలంగా మానవ వనరులున్న ప్రాంతం ఉత్తరాంధ్ర. కానీ బిడ్డకు దక్కని తల్లి స్తన్యంలా ఇతర ప్రాంతాల వారు, వలసవాదులు ఈ ప్రాంతం వనరులను కొల్లగొట్టుకుపోతున్నా అడిగే నాధుడు లేడు. ‘మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని గొంతెత్తే వారినే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష, కల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం. ఈ ప్రాజెక్టు నిర్మాణమయితే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కరువు కాటకాలను పారద్రోలవచ్చు, వలసల్ని అరికట్టవచ్చు. ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయడమే. ఈ ప్రాజెక్టు పూర్తైతే విశాఖపట్నంలో 3.21లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు... మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 టీఎంసీలు వ్యవసాయం కోసం, 4.46 టీఎంసీలు తాగునీటి కోసం, 5.34 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలాగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఇంత ప్రాధాన్యత కలిగి, ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాధుడే లేకుండాపోయారు.

ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి 2012లో ‘అరకు డిక్లరేషన్‌’ సూచించిన అభివృద్ధి పథకాలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఈ డిక్లరేషన్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడమే కాకుండా, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా వాటిని అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చాయి. ఉత్తరాంధ్రలో మరొక పెద్ద ప్రజాసమూహం సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు. ఉత్తరాంధ్రకు 340 కి.మీల సముద్రతీరం ఉన్నందున మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. ఫిష్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను, కోల్డ్‌ స్టోరేజీలను స్థాపించాలి.

విద్యారంగంలో కూడా ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఇక్కడి మూడు జిల్లాలు రాష్ట్ర సగటు కన్న తక్కువ అక్షరాస్యతతో ఉన్నాయి. 19వ శతాబ్ది చివరికే విద్యా నగరంగా పేరుగాంచిన విజయనగరం 21వ శతాబ్దిలో అక్షరాస్యతలో చివరికి చేరడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రాథమిక ఆరోగ్యం, పర్యాటక రంగం, విద్యుచ్ఛక్తి, రవాణా, ప్రభుత్వరంగ పరిశ్రమలు, వలసలు, పాలన, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పారిశుధ్యం, పర్యావరణం వంటి ఏ రంగాలను పరిశీలించినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలు, జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. దీంతో అనేకమంది రోడ్డున పడ్డారు. వీటిని తెరిపించేందుకు కృషి చేయాలి. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ పేరిట ఉద్యమించి, తమ భూములను ఇచ్చి, అనేక మంది ప్రాణత్యాగం చేసి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ స్టీల్‌ ప్లాంట్‌ను నిలబెట్టుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014, సెక్షన్‌ 46(3)లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఉత్తరాంధ్రకు ప్రకటించాలి. ఇది ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌లో కనీసం 15 శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నుంచి 20 శాతం (జనాభాను బట్టి) ఉండాలి. ఉత్తరాంధ్రలోని 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు సదుపాయం కల్పించాలి. గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు న్యాయమైన నీటి వాటాను కేటాయించాలి. గోదావరితో ఉత్తరాంధ్రలోని నదులను అనుసంధానం చేయాలి, ఉత్తరాంధ్రలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలి. ఈ ప్రాంతం మరో భోపాల్‌గా మారకుండా పర్యావరణాన్ని రక్షించాలి, వలసలను అరికట్టాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ఆకాంక్షల పట్ల శ్రద్ధ చూపలేదు. జనజీవితాల్లో ఆశించిన మార్పు తీసుకువచ్చే చొరవ తీసుకోకపోగా, ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రజలను మభ్యపెడుతూ, ఈ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టడానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఉత్తరాంధ్రను ‘ఉత్తి ఆంధ్ర’గా మార్చివేసింది.

ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ‘ప్రతీ చేతికీ పని – ప్రతీ చేనుకు నీరు’ అందించే వారికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికావాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా, ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి మండలి, ఆర్థిక ప్యాకేజీ సాధించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఈ ప్రాంతం నుంచి చట్టసభల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజానీకంపై ఉంది.

రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మేధావులు, కవులు, రచయితలు, యువత, కార్మికులు, ఉద్యోగస్తులు, రైతులు, కళాకారులు, ఆలోచనాపరులు, సకల జనులు ఉత్తరాంధ్ర అభివృద్ధే ఎజెండాగా ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు వచ్చే విధంగా ఒత్తిడి చేయాలి. ఇందుకు విబేధాలను విడనాడి, జెండాలను పక్కనపెట్టాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

కొణతాల రామకృష్ణ

కన్వీనర్‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక

Updated Date - Feb 07 , 2024 | 03:37 AM