కులమతాలకు అతీతంగా ఓటు
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:32 AM
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, రాయలసీమ సమస్తం కూటమికి పెద్ద ఎత్తున విజయాన్ని కట్టబెట్టింది. ఇది కుల మతాలకు, ధనానికి అతీతంగా వరించిన...

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, రాయలసీమ సమస్తం కూటమికి పెద్ద ఎత్తున విజయాన్ని కట్టబెట్టింది. ఇది కుల మతాలకు, ధనానికి అతీతంగా వరించిన విజయం. సహజంగా రాయలసీమలో రెడ్లు ఉంటారు కాబట్టి అది జగన్మోహన్‌రెడ్డికి కంచుకోట అంటారు. గుంటూరు, కృష్ణా కమ్మవారు ఎక్కువ ఉంటారు కాబట్టి అది బాబు ఆస్థానం అంటారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల హవా ఎక్కువ అంటారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమికి భారీ మెజారిటీతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. చివరికి జగన్‌కి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. కొందరు రాజకీయ నాయకులలో, కొందరు కుహనా మేధావులలో, టీవీలు–యూట్యూబ్‌లలో రాజకీయ చర్చలు చేసే కొందరిలో కుల మత వర్గ భావజాలం, ధన భావజాలం ఉంది. వారి భావజాలాన్ని ప్రజల మీద రుద్దాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే వారి సర్వేలన్నీ తప్పులతడికలవుతుంటాయి.
చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలిచిన కుప్పంలో ఎంతమంది కమ్మవారున్నారని ఆయన గెలిచారు? లోకేష్ పోటీ చేసి గెలిచిన మంగళగిరిలో కమ్మవారు ఎంతమంది ఉన్నారని ఆయన గెలిచారు? ప్రజలు ఓటు వేసే క్షణంలో కుల మతాలను చూడరు. గత పరిపాలకుల వల్ల తాము నష్టపోయిందేమిటి, ఇబ్బంది పడింది ఏమిటన్నది చూస్తారు. రోజుకు రెండు వందలే సంపాదన ఉన్నవారు అన్న క్యాంటీన్‌లో భోజనం చేసి, భార్యకి, బిడ్డకు భోజనం తీసుకువెళ్ళేవారు. అలాంటి వారికి అన్న క్యాంటీన్లు దూరమైనప్పుడు వారు ఎవరికి ఓటు వెయ్యాలి? వ్యక్తిగత కక్షల వల్ల అర్హులైనవారికి కూడా వృద్ధాప్యపు ఫించన్లు, అమ్మ ఒడి వంటివాటిని దూరం చేసినప్పుడు వారు ఎవరికి ఓటు వెయ్యాలి? ఇక్కడ జనం కుల మతాలను చూడరు. కులమతాలను భూతద్దంలో చూపించి, మేం అన్ని కులాల వారికి సహాయం చేస్తున్నామని పదిమందికి సహాయం చేసి, పదివేల లెక్క రాసుకుని, ఇదే ఓట్ల రాజకీయం అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. జనం ఆకలితో ఉన్న ఏ కులస్తుడినైనా ఆదుకోవడానికి, తమకు చేతనైనంత సహాయం చేస్తారు.
కొందరు రాజకీయ నాయకులు తన పక్కన వాడు ఆకలితో అల్లాడుతున్నా, వాడు మా కులం వాడు కాదు... మా పార్టీ వాడు కాదు అంటున్నారు. ఇలాంటి వారి దగ్గరే కుల మత వైషమ్యాలు ఉన్నాయి కానీ ప్రజల దగ్గర లేవు. ఈ సత్యాన్ని గ్రహించకుండా ఓటు కొంటామని అహంకరిస్తే ఎలక్షన్ల ఫలితాలు ఎవరి సర్వేలకు అందకుండానే ఉంటాయి.
వి.యల్. రాఘవరావు,
విశాఖపట్నం