వాలంటీర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:31 AM
ఒక రెవెన్యూ ఉద్యోగిని ఎక్కడ పోస్టుచేసినా భారీగా లంచాలు పడుతున్నాడని గుర్తించిన జిల్లా కలెక్టరు క్రమశిక్షణా చర్యగా లంచాలకు అవకాశం లేని ఒక పోస్టులో నియమించాడు...

ఒక రెవెన్యూ ఉద్యోగిని ఎక్కడ పోస్టుచేసినా భారీగా లంచాలు పడుతున్నాడని గుర్తించిన జిల్లా కలెక్టరు క్రమశిక్షణా చర్యగా లంచాలకు అవకాశం లేని ఒక పోస్టులో నియమించాడు. అతడి డ్యూటీ సముద్రం ఒడ్డున కుర్చీ వేసుకుని కెరటాలను లెక్కించి రికార్డు చేయడం, సాయంత్రానికి ఆ సంఖ్యను కలెక్టరుకు రిపోర్డు చేయడం. అయితే బాగా అక్రమార్జనకు అలవాటుపడ్డ ఆ ఉద్యోగి తన వద్దకు వచ్చిన మత్స్యకారులతో ప్రతి రోజూ ఈ ఒడ్డుకు చేరే కెరటాల సంఖ్యను బట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారిపై కెరటాల పన్ను విధించనున్నదని చెప్పాడు. అందుకే తాను ఒక నెల రోజుల్లో తీరానికి చేరే అలల సంఖ్యను లెక్కించి, రికార్డు చేస్తున్నానని వాళ్లను నమ్మించాడు. దాంతో వాళ్లు ఆయనను కెరటాల సంఖ్యను సగానికి తగ్గించి రిపోర్టు చేయమని, తమకు మిగిలే పన్ను సొమ్ములో సగం ఆ రెవెన్యూ ఉద్యోగికి చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని, ముడుపులు చెల్లించారు. ఈ విషయం తెలిసిన కలెక్టరుకు మతి పోయింది.
ఇదేవిధంగా వైసీపీ కార్యకర్తలుగా చలామణి అవుతున్న వాలంటీర్లను రాబోయే ఎన్నికలలో ఎలక్షన్ విధులకు కేటాయించరాదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, పోలింగ్ డ్యూటీలో ఓటర్లుకు వేలి మీద ఇంకు మార్కు వేసేందుకు వారిని వాడుకోవచ్చని మినహాయింపు నిచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. వేలిమీద ఇంకు మార్కు వేయడంలో కూడా అనేక విధాలుగా అక్రమాలకు పాల్పడవచ్చనే ఆలోచన మన కేంద్ర ఎన్నికల సంఘానికి రాకపోవడం ఆశ్చర్యకరం. వేలి మీద గుర్తు వేస్తూ ఒక పార్టీ గుర్తు మీదనే ఓటు వేయాలని ప్రభావితం చేయటం, అధికారిక సిరాతో కాక సులువుగా చెరిగిపోయే ఇంకును వాడటం, ఉద్దేశపూర్వకంగా ఇంకుసీసాను పగలగొట్టి కృత్రిమంగా ఇంకు కొరతను సృష్టించడం వంటి అనేక కుటిల చర్యలకు వాలంటీర్లు పాల్పడే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల ఓటర్ల లిస్టు తయారీలో వాలంటీర్లు పాల్పడ్డ అనేక అక్రమాలను పరిగణనలోకి తీసుకొని వీరిని, గృహసారథులను, గ్రామ సచివాలయ ఔట్‌సోర్స్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా, పోలింగ్ ఆవరణ వెలుపల మాత్రమే ఉంచాలి. లేకపోతే భారీ స్థాయిలో పోలింగ్ అక్రమాలు జరిగే ప్రమాదం ఉంది. అంతేకాక గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మితిమీరిన పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. పాలకులు కూడా కీలక ప్రాంతాలలో తమకు అనుకూలురైన పోలీసులను నియమించుకున్నట్లు వార్తాకథనాలు వస్తున్నాయి.
కాబట్టి వాలంటీర్లతో పాటు గృహ సారథులను, ఔట్‌సోర్స్ ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల ఆవరణలోకి అనుమతించరాదు. ఈ విషయమై స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమించాలి.
డా. యం.వి.జి అహోబలరావు