Share News

వొడ్లరాశి కింద

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:38 AM

ఇంకా ఆ గుట్టల కింద చేలలో మోపులు కట్టి ఎత్తుతున్నట్టే ఉంది కోత కోసిన ఆ చేల నడుమ తిరిగే మిణుగురులు గుర్తొచ్చినప్పుడు గుండెగుమ్మి నిండా చీకట్లు కమ్ముకుంటున్నయి....

వొడ్లరాశి కింద

ఇంకా ఆ గుట్టల కింద చేలలో

మోపులు కట్టి ఎత్తుతున్నట్టే ఉంది

కోత కోసిన ఆ చేల నడుమ తిరిగే

మిణుగురులు గుర్తొచ్చినప్పుడు

గుండెగుమ్మి నిండా

చీకట్లు కమ్ముకుంటున్నయి.

తూర్పాల వట్టి, వొడ్లు కుప్పనూకినంక

చుట్టూ పొత్తి వోస్తుంటే

వొడ్లరాశి మీద కొడవలి లెక్క కూర్చునే

ఆ వెన్నెలపిట్ట ఏ మబ్బుల్లో దాసుకుందో!

కుట్టిన వొడ్లబస్తాలకు ఆనుకొని

కల్లుధార కోసం మర్రాకు పట్టుకునే

కూలీతల్లులందరు ఇప్పుడెక్కడ ఉన్నరో!

గడ్డివాము సందుల్లో

సాట, పొరక దాచిపెట్టిన

ఆ గుర్తులెక్కడున్నవో ఇప్పుడు?

రెక్కలు దాసుకోకుండా

నిండార కూలిజేసి ఇంటికొచ్చి

కంటినిండా నిద్రపోయిన రోజులేవి?

ఎడ్లకు గడ్డేసి, బర్లకు కుడితివెట్టి

పాలు పిండుకొని వచ్చె మా ఎంకన్న

ఎప్పుడైనా ఎదురైయ్యిండా?

ఏ మెట్రోస్తంభాల కింద

వరికంకుల బొమ్మ గీస్తుండో.

ఇట్లా మీ మధ్య

ఆరడుగుల నీడలాగ తిరుగుతున్న గానీ

పరిగె గింజలాగ

నా ఆత్మను ఆ చేలలోనే వొదిలేసి వచ్చిన

ఏ అర్ధరాత్రి పూటైనా మెలకువ వస్తే

రెక్కలుగట్టుకొని వరికల్లంలోకి వాలిపోత

కల్లం చేసుడంటే మాటలా?

బండెడు పెండ తెచ్చి అలుకుపెట్టాలె

తెల్లారక ముందే బంతులు గట్టాలె

ఎండగాక ముందే మెద దులుపాలె

కొలిచేటప్పుడు కుండ కుండకు

ఆరున్నొక్క రాగం ఎత్తుకోవాలె

మార్కెట్‌ ముందట

రైతు ఇప్పుడు ధర పలుకుతలేడు గానీ

ఒకప్పుడు పనివాటొళ్ళందరూ

‘కట్టడి’కి వరుసగట్టెటోళ్ళు

పక్షులకింతా, ప్రకృతికింతా

కూలిచేసినోళ్ళకింత పంచిపెట్టినంక

మిగిలినదానితోటి తిన్న నాడే

రైతు పచ్చని నారుమడి లాగ బతికిండు

ఇయ్యాల ఎడ్లకు

ఏ రాజ్యపు దిష్టి తగిలిందో

ఒంటి మీద ఎక్కడ చూసినా

నల్లగా వాతలు పెట్టిన

అచ్చులు మిగిలినవి

పుట్లకొద్ది ధాన్యం పండె పొలంలో

ఇనుపకంచెలు మొలుస్తున్నవి

పొలాలను దాటి, ఎంతో దూరం వచ్చేసి

నాగరికత అంటున్నం గానీ

ఆ నాగరికతకు మూలాలు

ఇంకా ఆ వడ్లరాశి కిందనే ఉన్నయి.

తగుళ్ళ గోపాల్‌

83098 37260

Updated Date - Apr 22 , 2024 | 03:38 AM