మహిళపై ప్రతిచోటా పడగ విప్పుతున్న హింస
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:10 AM
‘ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ మరణించే పరిస్థితి ఉండటం క్షమార్హం కాదు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఏకం కండి’ అనే నినాదంతో ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘మహిళలపై హింస నిర్మూలన’ లక్ష్యంగా...

‘ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ మరణించే పరిస్థితి ఉండటం క్షమార్హం కాదు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఏకం కండి’ అనే నినాదంతో ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘మహిళలపై హింస నిర్మూలన’ లక్ష్యంగా పదహారు రోజుల కార్యాచరణకు పిలుపునిచ్చింది (నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు).
మహిళలపై అనేక రూపాలలో జరిగే హింసలో అంతగా చర్చకు రానిది– మాతృత్వ హింస. భారతదేశంలో అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళనకర స్థాయికి పెరిగాయి. దీనివల్ల గౌరవప్రదమైన మాతృత్వ హక్కు ప్రమాదంలో పడుతున్నది. మద్రాసు ఐఐటీ జరిపిన ఒక పరిశోధన ప్రకారం 2016–-2021 మధ్య కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ ప్రసవాలు 6.5శాతం పెరిగాయి (40.9శాతం నుంచి 47.4 శాతానికి). జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–-21 ప్రకారం అసోం, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఇవి 70శాతాన్ని మించిపోయాయి.
సిజేరియన్ ప్రాణ రక్షక చికిత్స. కానీ అనవసరపు సిజేరియన్ వల్ల తల్లీబిడ్డలకు పలు సమస్యలు ఎదురవుతాయి: రక్తం కోల్పోవడం, ఇన్‌ఫెక్షన్, కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టడం, బిడ్డలకు పాలివ్వడంలో ఆలస్యం, తరువాతి గర్భదారణలో సమస్యలు... వంటివి. ప్రతి వైద్యశాలలో గత సంవత్సరం సిజేరియన్ ప్రసవాల శాతాన్ని నోటీసు బోర్డుపై ప్రదర్శించాలన్న నిబంధన విధిస్తే ఈ అంశంపై గర్భవతి విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకొనే అవకాశం కలుగుతుంది.
మహిళలు హింసను ఎదుర్కొంటున్న మరో చోటు– సోషల్ మీడియా. కృత్రిమ మేధస్సు (ఏఐ)ను కూడా మహిళలను వేధించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. ఇందుకు ‘డీప్‌ఫేక్’ ట్రెండ్ ఒక ఉదాహరణ. నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్) ఎక్కువ కావటం వల్ల మహిళలు, ముఖ్యంగా బాలికలు, ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. భారతదేశంలోని ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ఆర్థిక నేరాలతో పాటు నగ్న చిత్ర వేధింపులపై కూడా మరింత దృష్టి పెట్టాలి.
సోషల్ మీడియాను ఒక సాధనంగా వాడుకుంటూ మహిళలను రాజకీయాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అజ్ఞాతంగా కామెంట్ చేయగలిగే అవకాశం ఉండటంతో, ట్రోలర్లు– ధైర్యంగా ఎలాపడితే అలా రాస్తున్నారు. మహిళల గురించి రాసేప్పుడు ఈ ధైర్యం ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తున్నారు. తరతరాలుగా ముదిరిపోయిన పురుషాధిక్యతా ధోరణే ఇందుకు కారణం. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మహిళలు ప్రజాక్షేత్రంలోకి, పరిపాలనా రంగంలోకి రావడానికి వెనుకాడతారు.
పశ్చిమ బెంగాల్ వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలోనే గాక, ఇలాంటి అనేక సందర్భాలలో హంతకులు పొర్నోగ్రఫీ వ్యసనపరులని వార్తలొచ్చాయి. కొంతకాలమైనా పొర్నోగ్రఫీపై నిషేధం విధించి ప్రభావాన్ని గమనించాలి. చైనా, యూఏఈ వంటి దేశాలు పొర్నోగ్రఫీపై పకడ్బందీగా నిషేధాన్ని అమలు చేసున్నాయి. ఈ రెండు దేశాలూ బాలలకు, మహిళలకు భద్రమైన దేశాలని పేరున్నది. జీవితంలోని అన్ని అంశాలలో మహిళలకు భద్రతను, గౌరవాన్ని హామీ ఇవ్వడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.
శ్రీనివాస్ మాధవ్
సమాచార హక్కు పరిశోధకులు