Share News

వికసిత్ ఆంధ్రను సాకారం చేసే మేనిఫెస్టో!

ABN , Publish Date - May 09 , 2024 | 05:59 AM

మద్రాసు నుంచి తరిమి వేయబడ్డ ఆంధ్రులు, కర్నూలులో గుడారాలలో కొన్నాళ్ళ పాలన సాగిన తర్వాత, హైదరాబాదుకు మూటాముల్లె సర్దుకుని వెళ్లారు, తెలంగాణ నుంచి మరోమారు తరిమివేయబడ్డారు. 2014 నుంచి 2019 ఆంధ్ర పునర్నిర్మాణానికి కేంద్రం...

వికసిత్ ఆంధ్రను సాకారం చేసే మేనిఫెస్టో!

మద్రాసు నుంచి తరిమి వేయబడ్డ ఆంధ్రులు, కర్నూలులో గుడారాలలో కొన్నాళ్ళ పాలన సాగిన తర్వాత, హైదరాబాదుకు మూటాముల్లె సర్దుకుని వెళ్లారు, తెలంగాణ నుంచి మరోమారు తరిమివేయబడ్డారు. 2014 నుంచి 2019 ఆంధ్ర పునర్నిర్మాణానికి కేంద్రం సహకారంతో పునాదులు పడి అవి సౌదాలుగా మారాయి. కానీ ఈ సౌదాలకు తుదిమెరుగులు దిద్దే సమయానికి 2019లో ప్రజలు మార్పు కోరుకున్నారు. అక్కడ తప్పటడుగు పడింది. వినాశకర పాలన ఫలితంగా రాష్ట్రానికి 10లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిలాయి.

తాగు సాగు నీటి ప్రాజెక్టులు, కొత్త రోడ్లు, పాత రోడ్ల మరమ్మత్తులు, కొత్త కాలువలు, పాత కాలువల పూడికతీతలు... ఇవేవీ లేవు. ఉపాధి ఊసు లేదు. వలస కూలీలకు వెసులుబాటు లేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఇసుక, మట్టి తవ్వకాలు, సారాయి, గంజాయి అమ్మకాలు ప్రభుత్వ ఆదాయ మార్గాలయ్యాయి. ఇసుక, మట్టి దందాలతో నిర్మాణరంగం స్తంభించింది. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆదాయం కోసం భూమి విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల చార్జీలు, ఇంటి పన్నులు, ఇంటి అద్దెలు, నీటి పన్ను, చెత్త పన్ను, కరెంటు బిల్లులు తారాస్థాయికి చేరాయి. వ్యవసాయం దెబ్బతినడంతో నిత్యవసరాల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచితాలతో బడుగులు బతకాల్సిన పరిస్థితి. ప్రజల ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైసీపీ పాలన వల్ల దిగజారిన దీనహీన స్థితి నుంచి తెలుగుజాతి బయటపడే అవకాశం 2024 ఎన్నికల రూపంలో తలుపు తట్టింది.


వైసీపీ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా సాగనంపడానికి, నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి సాధించడానికి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన జతకట్టాయి. ప్రస్తుతం ప్రజలు ఆర్థికంగా అధమ స్థాయిలో ఉన్నారు. వారు జవసత్వాలు పుంజుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కూటమి తయారు చేసిన ఐదేళ్ల ఆర్థిక ప్రణాళిక – మేనిఫెస్టో.

మేనిఫెస్టోలో పేర్కొన్న చర్యలన్నీ అప్పుల భారంతో కుంగిపోయిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు, అసమర్థ పాలనతో ఎన్నో విధాలుగా నష్టపోయిన ప్రజలకు ఆసరాగా నిలబడేందుకు ఉద్దేశించబడినవి. బియ్యం, కూరగాయలు, పప్పు ధాన్యాలు వంటి నిత్యావసరాల ధరలు తగ్గటానికి తక్షణ కర్తవ్యంగా కేంద్ర గోడౌన్లలో ఉన్న నిత్యావసరాల నిల్వలను కేంద్రం సహకారంతో, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో సరసమైన ధరలకు సరఫరా చేస్తారు. రైతులకు ఆర్థిక వెసులుబాటుగా ప్రతి ఏడాది రూ.20వేల పెట్టుబడి సాయం చేస్తారు. తాగు, సాగునీటి ఎద్దడి లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడతారు. అలాగే కాలువలలో పూడిక తీసే కార్యక్రమాలతో కూలీలకు ఉపాధి కల్పిస్తారు. కౌలు రైతులకు కార్డులు ఇస్తారు. తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, సబ్సిడీ ధరలపై విత్తనాలు, ఎరువులు, రైతులకు, పంటలకు బీమా, వెంటనే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉద్యాన పంటలకు, సేంద్రీయ పద్ధతులకు ప్రోత్సాహం... ఇవ్వన్నీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం శీతల గిడ్డంగులలో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయం, సముద్ర తీరం ఎక్కువగా ఉన్నందున చేపల వేటే వృత్తిగా గల మత్స్యకారులకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అమలు అమలయ్యేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాలంటీర్ల వ్యవస్థలోని వారికి ఉద్యోగ భద్రత కల్పించడమే గాక వారు గౌరవంగా, సంతృప్తికరంగా బతకడానికి వారి వేతనాలను ఐదువేల నుంచి పదివేల వరకు పెంచుతారు.


23 సంస్థలకు చెందిన దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి సర్వీస్, వేతనాలు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారు గౌరవంగా వారి ఉద్యోగం చేసుకునే పరిస్థితి మళ్లీ తీసుకువస్తారు. ప్రతినెలా ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు అందజేస్తారు. సిపిఎస్ లేదా జిపిఎస్ విధానాన్ని పునసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకువస్తారు. తక్కువ జీతాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు బేషరతుగా వర్తింపజేస్తారు.

రాష్ట్ర జనాభాలో దాదాపుగా కాపు, బలిజలు, ఉత్తరాంధ్ర కాపులు 70 లక్షల మంది. యాదవులు 26 లక్షలు, గౌడలు 20 లక్షలు, వడ్డెరలు 6 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చేతి వృత్తులు, కార్మికులు, కూలీలు ఉన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎదగడానికి వీలుగా వారి ఉత్పత్తులకు జీఎస్టీ చెల్లిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి వారికి ఉచితంగా తర్ఫీదు ఇస్తూ పనిముట్లు, పెట్టుబడులు, పరిమితులకు లోబడి ఉచిత విద్యుత్తు, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పునరుద్ధరణ, గౌరవ వేతనాలను ఏర్పాటు చేస్తారు. గీత కార్మికులకు మద్యం దుకాణాలలో 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు క్వారీలలో 15శాతం రిజర్వేషన్లు–రాయల్టీ/ సీనరేజ్ చార్జీల మినహాయింపు కల్పిస్తారు.


రాష్ట్రంలో 24 లక్షల జనాభా ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు సామాజికంగా, ఆర్థికంగా విద్యా, వృత్తి, వ్యాపార రంగాలలో పరిపూర్ణ సహకారం అందిస్తారు. 50 ఏళ్లకే పింఛను, ఇమామ్లకు ప్రతినెలా పదివేలు, మౌజములకు గౌరవ వేతనం, మసీదు నిర్వాహకులకు నెలకు రూ.5వేలు, హజ్ యాత్రికులకు లక్ష ఆర్థిక సహకారం కల్పిస్తారు.

ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మహిళకు వారి సామర్థ్యానికి తగినట్లుగా విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాల అమలు చేస్తారు. మారుమూల గ్రామం నుంచి తెలుగు మహిళ ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసే స్థాయికి వేదిక కల్పిస్తారు.

నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి స్కిల్ డెవలప్‌మెంట్‌‌లో శిక్షణ ఇస్తారు. తెలుగు బిడ్డలు ఉద్యోగులుగా కాక ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే ప్రభుత్వం లక్ష్యం.

రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే దీక్షా దక్షతతో అందరూ భాగస్వాములు కావాలి. ఆర్థికంగా నష్టపోయినవారికి సంక్షేమ పథకాలు అవశ్యం. సంక్షేమ పథకాల - పాలన ఖర్చులకు సారాయి, గంజాయి అమ్మకం, ఇసుక, మట్టి దందాలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు బిల్లుల పెంపు ఆదాయ మార్గాలు కానే కాదు. తెలంగాణకు ఐటీ కారిడార్ అనే పాడి ఆవుని ఇచ్చింది చంద్రబాబే. మొన్న గుజరాత్ ముఖ్యమంత్రిగా, నేడు భారత ప్రధానిగా భారత్‌ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు మోదీ. తనను తాను తగ్గించుకొని రాష్ట్రాభివృద్ధికి తహతహలాడుతున్నారు పవన్ కళ్యాణ్. నేడు ఈ ముగ్గురు విజనరీ లెజెండ్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖచిత్రంగా నిలబడ్డారు. ఈ ముగ్గురి కలయికలో కూటమి రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ తెచ్చేందుకు శ్రమిస్తున్నది. ఈ కూటమి మేనిఫెస్టో వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్!

పాతూరి నాగభూషణం

బీజేపీ మీడియా ఇన్‍ఛార్జ్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్

Updated Date - May 09 , 2024 | 05:59 AM