Share News

విద్యామంత్రి అంటే తెలుగు మంత్రి!

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:09 AM

విద్యాప్రదాత జ్ఞాన వృద్ధుడైతే విద్యార్థి పరిణతి పొందుతాడు. విద్యామంత్రి జ్ఞానవంతుడైన యువకుడైతే విద్యావ్యవస్థని వేగంగా పటిష్ఠంగా, శక్తిమంతం చేయగలుగుతాడు. ఇప్పుడీ అవకాశం....

విద్యామంత్రి అంటే తెలుగు మంత్రి!

విద్యాప్రదాత జ్ఞాన వృద్ధుడైతే విద్యార్థి పరిణతి పొందుతాడు. విద్యామంత్రి జ్ఞానవంతుడైన యువకుడైతే విద్యావ్యవస్థని వేగంగా పటిష్ఠంగా, శక్తిమంతం చేయగలుగుతాడు. ఇప్పుడీ అవకాశం ‘ఆంధ్రప్రదేశ్’కి కలిగింది. భాషా సంస్కృతుల పట్ల అభిమానంతో నారా లోకేష్ విద్యాశాఖను చేపట్టటాన్ని భాషాభిమానులు స్వాగతిస్తున్నారు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన తెలుగు భాషా విధాన ప్రకటన మాతృభాష విషయంలో ఒక ‘మాగ్న కార్టా’ లాంటిది. తాతగారి ఆశయాన్ని మనవడు నెరవేర్చగలగాలి!

తెలుగు భాష అనేది తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాన్ని తగ్గించాలనుకోవటం మనల్ని మనం తక్కువ చేసుకోవటమే అవుతుంది. ఇంగ్లీషులో మాట్లాడితేనే గౌరవం అనీ, తెలుగు ఎత్తేయటం సంక్షేమ కార్యక్రమం అనీ, ప్రజలే తెలుగు వద్దంటున్నారనీ ప్రచారం చేయటం, దానికి కులాల రంగు పులమటం ధర్మం కాదు. ఏ కులంవాడికైనా మాతృభాష రావాలి!

ఉమ్మడి రాష్ట్రంలో నాటి విద్యామంత్రి పీవీ నరసింహారావు 1966 మే 14న అధికారభాషా చట్టాన్ని తెచ్చారు. కానీ, అది అమలు కాలేదు. 1974లో విద్యామంత్రి మండలి వెంకటకృష్ణారావు మొదటగా తాలూకా స్థాయిలో తెలుగును ప్రవేశపెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘాన్ని నియమించారు. 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లా స్థాయిలో అధికార భాష అమలు ప్రకటించారు. ఎన్‌టిఆర్ అధికారంలోకి వచ్చాకే తెలుగు పూర్తిస్థాయిలో అధికారభాష అయ్యింది. కేంద్రానికి పంపే ఫైళ్ళను కూడా తెలుగులో రాసి, అనుబంధంగా ఇంగ్లీషు అనువాదాన్ని పంపించాల్సిందిగా ఆదేశించిన ఘనత రామారావుదే!


2018లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార భాషాసంఘం స్థానే అన్ని అధికారాలతో కూడిన ‘తెలుగు భాషా ప్రాధికార సంస్థ’ని ఏర్పరచి గవర్నర్ ఆమోదం పొందింది. ఏడు విభాగాలతో శక్తివంతమైన ఈ సంస్థని ఏర్పరచి పాలనాధికారిని నియమించారు. భాషను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారాలున్న ఈ సంస్థ ఆచరణలోకి వచ్చి ఉన్నట్టైతే దేశంలోనే రాష్ట్ర భాషకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచి ఉండేది.

2024 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందేశంలో యునెస్కో సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40శాతం పిల్లలు తమ మాతృభాషలో ప్రాథమిక విద్య పొందలేకపోతున్నారని, కొన్ని దేశాల్లో ఈ సంఖ్య 90శాతం దాకా ఉందని పేర్కొంది. నూతన విద్యావిధానాన్ని రూపొందించే ముందు ఈ అంతర్జాతీయ నిపుణుల సూచనల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లీషు రావాలంటే తెలుగు రాకూడదనటం అన్యాయం.

భాషాప్రాతిపదికపై రాష్ట్రాలను విభజించినా భాషా ప్రాతిపదికగా పాలనా వ్యవస్థలు పనిచేయకపోవటం గురించి విద్యామంత్రి ఆలోచన చేయాలి. ప్రతీ పథకానికి ముందు తెలుగు అనే పదాన్ని జోడించిన యన్‌టి రామారావు స్ఫూర్తి కావాలి. తెలుగు భాషోద్యమం ఇంగ్లీషు భాషకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషు కోసం తెలుగును అశ్రద్ధ చేయవద్దని మాత్రమే కోరుతోంది. భారత రాజ్యాంగం చదువుకునే హక్కు చట్టం 5వ అధ్యాయం 29ఎఫ్ సెక్షన్ 350(ఎ) ప్రకారం మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలి. 2020లో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యావిధానమూ ఇదే పేర్కొంది. 1–2 తరగతులకే తెలుగు చదవడం, రాయడం నేర్పిస్తే పై తరగతులకు ఈ నైపుణ్యం తోడ్పడుతుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని అంచెలంచెలుగా తొలగించాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని 2020 ఏప్రిల్ 15న హైకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందా లేదా అన్నదాని పైనే చర్చ జరిగింది. పిల్లల మనోపరిపక్వత దెబ్బతినకూడదనేది మరుగునపడింది.


ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి. ప్రైమరీలో ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా, హైస్కూలు స్థాయిలో ఇంగ్లీషు– తెలుగు మిశ్రమంగా, కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం కొనసాగినా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలి. రాబోయే రోజుల్లో సాంకేతిక ఉపకరణాలన్నీ తెలుగులో పనిచేయబోతున్నాయి. తెలుగు చదువుకున్న అభ్యర్థులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

తెలుగులో చదివితే ఉద్యోగాలు రావనే అపోహను తొలగిస్తూ, ఇంటర్మీడియెట్ వరకూ తెలుగులో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం కల్పించింది. అది మళ్ళీ జరగాలి. గ్రామాలతో సంబంధాలుండే రెవెన్యూ, జిల్లాపరిషత్, విద్య, వైద్యం లాంటి శాఖల్లో 15శాతం ఉద్యోగాలకు తెలుగులో చదివినవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు మీడియం కొనసాగిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకూ ప్రోత్సాహకాలివ్వాలి. వైద్యం, ఇంజనీరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విద్యల్లో కూడా తెలుగును ఒక బోధనాంశం చేయాలి.

కళాశాలల్లో 4 సెమిస్టర్ల తెలుగుని 2 సెమిస్టర్లకు కుదించారు. తెలుగు చదవకపోయినా మార్కులొస్తాయనే లోకువ ఏర్పడింది. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ 9వ తరగతికి వెళ్లి పిల్లల్ని తమ పేరు తెలుగులో రాయమని కోరితే... అందరూ తప్పులే రాసిన సంగతి విద్యాశాఖామాత్యులు మనసులో పెట్టుకుని అందరికీ తెలుగు చక్కగా నేర్పించాలి! ప్రాథమిక విద్యలోనే పిల్లల్ని మాతృభాషకు దూరం చేస్తే, డిగ్రీ చదివినా బస్సుల మీద ఊళ్ళ పేర్లు చదవలేక ‘ఈ బస్సు ఏ ఊరు వెడ్తుంది?’ అని అడగాల్సొస్తుంది. చదువుకున్న నిరక్షరాస్యుల్ని తయారుచేయటం ప్రభుత్వ లక్ష్యం కాకూడదు.

గోండి, కొండ, కోయ, చెంచు, యెరుకుల లాంటి అనేక ఆదిమ తెగలు తెలుగు నేలపైన జీవిస్తున్నారు. వారికి వారి భాషలో చదువు చెప్తూ రాష్ట్ర భాష తెలుగును, అంతర్జాతీయ భాష ఇంగ్లీషును కూడా అందరికీ చాలినంత నేర్పించాలి.

కేంద్ర విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ పద్ధతిలోనే, రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా తెలుగు చారిత్రక పరిశోధనా మండలిని స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేసి తెలుగు భాషా సంస్కృతుల చరిత్రపై సమగ్ర అధ్యయనం జరిపించాలి. విశ్వవిద్యాలయాలు విస్మరించిన మన సాంస్కృతిక వికాస చరిత్ర, సాంఘిక చరిత్ర, ఆహార చరిత్ర లాంటి మానవీయ అంశాల్ని దాని పరిధిలోకి తెచ్చి తెలుగు జాతి మూలాల సమగ్ర అన్వేషణ జరిపించాలి.


‘సవాళ్లంటే నాకిష్టం! అందుకే విద్యాశాఖను తీసుకున్నా’నని విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ అనటం గొప్ప విషయం. తెలుగు భాషకు శాశ్వత రక్షణ కల్పించే సవాలును నెరవేర్చవలసిందిగా భాషోద్యమం ఆయన్ని కోరుతోంది. విద్యామంత్రి అంటే తెలుగు మంత్రి అని ఆయనే నిరూపించుకోవాలి.

డా. జి.వి.పూర్ణచందు

ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి

Updated Date - Jul 17 , 2024 | 05:09 AM