Share News

అక్కడా, ఇక్కడా అనైతిక రాజకీయం

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:57 AM

ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ రాజకీయాల్లో యువత ఆసక్తిపై సర్వే నిర్వహిస్తే, 80 శాతం మంది రాజకీయాలంటే ఏహ్యభావం ఉన్నట్లు తెలిపారు. రాజకీయాలంటే పదవులు, ఫిరాయింపులే...

అక్కడా, ఇక్కడా అనైతిక రాజకీయం

ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ రాజకీయాల్లో యువత ఆసక్తిపై సర్వే నిర్వహిస్తే, 80 శాతం మంది రాజకీయాలంటే ఏహ్యభావం ఉన్నట్లు తెలిపారు. రాజకీయాలంటే పదవులు, ఫిరాయింపులే కదా అని చాలామంది అభిప్రాయపడ్డారు. భావిభారత పౌరులకు రాజకీయాలపై ఇలాంటి విరక్తి ఉండడం ప్రమాదకరం. దేశంలోని రాజకీయ పరిణామాలు, ఎన్నికల సమయంలో పార్టీల వైఖరులు ప్రజాస్వామ్యానికి కళంకం తెచ్చేవిగా ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారాస ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ రెండు అరెస్టులు రాజకీయ ప్రమేయంతోనేననేది సుస్పష్టం. ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. అమెరికా తదితర దేశాల్లో అధికార పార్టీ అయినా, విపక్షమైనా నేరం చేస్తే ఏ మాత్రం వివక్ష లేకుండా అరెస్టులుంటాయి. మన దేశంలో విపక్ష పార్టీలకు చెందినవారి మీదనే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన ఒక్క నేతపైనా కేసు నమోదు కాలేదు, అరెస్టు జరగలేదు. రాజకీయ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించి దెబ్బతీయడం, భయపెట్టి తమ దారికి తెచ్చుకోవడం, ప్రత్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కేసులు, జైళ్ల వ్యూహం పన్నుతున్నారనేది జగద్విదితం. ఆ పార్టీకి అనుకూలంగా లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులపైనా కేసులు పెడుతున్నారు. మనీలాండరింగ్ లాంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నారు. అదాని వంటి సన్నిహితులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇలాంటి చట్టాలేమీ ఉపయోగించకుండా రక్షణ కల్పించడం పాలకుల పక్షపాతనైజాన్ని చాటుతోంది. కేంద్రం మనీలాండరింగ్ వాడుతున్న తీరుతో ఆ చట్టం మూలస్వరూపమే మారిపోయి, రాజకీయం కోసమేనని తేలిపోయింది.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష భారాసపై ప్రయోగిస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సంస్థలపై దాడులు, కేసులు, భవనాల కూల్చివేతలు భారీఎత్తున జరుగుతున్నాయి. ఆస్తులు కోల్పోతారనే భయం భారాసలో కలిగిస్తే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారనే నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ప్రబలంగా ఉన్నట్లు అవగతమవుతోంది. ప్రతీ అంశంలోనూ అవినీతి ఉందని, దానిని తమ రాజకీయానికి ఆయుధంగా వాడుకోవాలనే తపన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో పోటీకి అభ్యర్థులకు సొంత పార్టీ వారిని ఎంచుకోలేక దయనీయస్థితిని చాటుకున్నాయి. కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. కాంగ్రెస్ తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. తమదే తిరుగులేని ఆధిపత్యం అని చెప్పుకునే ఈ రెండు పార్టీలు 17 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు ఆపసోపాలు పడ్డాయి. బీఆర్‌ఎస్‌ నుంచి ఈ రెండు పార్టీలు పోటీపడి ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీలను చేర్చుకొని టికెట్లు ఇస్తూ తమ రాజకీయ డొల్లతనాన్ని చాటుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడి ఫిరాయింపులను ప్రోత్సహించాయి. ఈ పరిణామాలు లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎక్కడికి దారితీస్తాయోనన్న అంచనాలు మొదలయ్యాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సీఎం అయినట్లుగా తెలంగాణలో కూడా అలాంటి పరిణామాలు వస్తాయనే ప్రచారం మొదలైంది. ప్రస్తుత ఫిరాయింపుల జోరు చూస్తే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం అటూ ఇటూ మారిపోతారనే భావం అప్పుడే ఏర్పడింది. ఒక పార్టీ తరపున అయిదేళ్ల పాటు పనిచేసేందుకు ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే సదరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవుల కోసం, ఆస్తులను కాపాడుకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నైతిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. తెలంగాణాలో పోలింగ్‌ ఫలితం వచ్చిన రోజే ఓటేసిన ప్రజల వేళ్ల మీది సిరా మరక పోకముందే ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీనేతను కలిసి అందులో చేరతానని చెప్పడం ఫిరాయిపుల పతనావస్థకు పరాకాష్ఠగా నిలిచింది. లోక్‌సభ ఎన్నికల బరిలో ఎక్కువ మంది ఫిరాయింపుదారులే పోటీ చేస్తున్నారు. తమను గెలిపిస్తే చాలు ఆ తర్వాత తమ దారి తాము చూసుకుంటాం తప్ప, ప్రజల గురించి ఆలోచించాలనే తపన వారికి ఏ మాత్రం లేకపోవడం శోచనీయం. ఇలాంటి వారిని ప్రజలు ముందే గుర్తించి వారికి ఇప్పుడే కీలెరిగి వాతపెట్టాలి.

జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా కక్ష సాధింపులు, దాడులు, కేసులు, ఫిరాయింపుల వంటి పంథాలతో రాజకీయాలను అపవిత్రం చేయరాదు. విపక్షాలు ఖాళీ కావాలనే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడేందుకు బలమైన ప్రతిపక్షాలు ఉండాల్సిందే. వాటిని అధికారబలంతో దెబ్బతీసి, ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం కొనసాగాలనుకోవడం సహేతుకం కాదు. దీనివల్ల ప్రజల్లో రాజకీయాలంటేనే విముఖత ఏర్పడే ప్రమాదం ఉంది. అటల్ బిహారీ వాజపేయి లాంటి వ్యక్తి రాజకీయ విలువల కోసం ప్రధాని పదవిని త్యజించారు. ప్రజలు ఇచ్చిన తీర్పునే శిరోధార్యంగా భావించిన ఎందరో ప్రముఖులు విపక్షాల్లోనే సుదీర్ఘంగా కొనసాగారు తప్ప, పదవుల కోసం అర్రులు చాచలేదు. అలాంటి మహానీయుల ప్రతిరూపాలు మళ్లీ రావాలన్నదే ప్రజల ఆకాంక్ష.

డాక్టర్ బీఎన్ రావు

చైర్మన్–బీఎన్ రావు ఫౌండేషన్

Updated Date - Apr 05 , 2024 | 02:57 AM