Share News

నిరుద్యోగం ఓ నిప్పుల కొలిమి...!

ABN , Publish Date - May 08 , 2024 | 12:25 AM

ఇండియాలో ఉద్యోగం తెల్ల రాళ్ళ రాశిలోని బియ్యపు గింజ వంటిది. నీడ పట్టు పనులు బహుతక్కువ. మామూలుగానే నిరుద్యోగం భారీ ఎత్తున తాండవిస్తుంటుంది. అందుచేత జనసామాన్యం ఉద్యోగాల కోసం కలగనరు...

నిరుద్యోగం ఓ నిప్పుల కొలిమి...!

ఇండియాలో ఉద్యోగం తెల్ల రాళ్ళ రాశిలోని బియ్యపు గింజ వంటిది. నీడ పట్టు పనులు బహుతక్కువ. మామూలుగానే నిరుద్యోగం భారీ ఎత్తున తాండవిస్తుంటుంది. అందుచేత జనసామాన్యం ఉద్యోగాల కోసం కలగనరు. కాయకష్టం చేసి కడుపు నింపుకునేవారే ఎక్కువ. దేశ కార్మిక శక్తిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఆధునిక సాంకేతికత ప్రజల నిత్యజీవితాల్లో ఉనికిని పెంచుకున్న కొద్దీ సంప్రదాయ వృత్తులు నాశనమైపోవడం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటుకాక దాని అనుబంధ వృత్తులు కూడా చతికిలబడి పల్లెల నుంచి పట్టణాలకు నగరాలకు వలసలు ముమ్మరించి చాలాకాలమయింది.

పదేళ్ల పాలనలో పాతిక కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని, తమను మళ్ళీ గెలిపిస్తే వచ్చే ఐదేళ్ల నాటికి దేశాన్ని ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా చేస్తామని బీజేపీ ఘనంగా చెప్పుకొంటున్నది. ప్రధాని మోదీ అంచనా వేస్తున్నట్టు 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించినప్పటికీ పేద దేశంగానే కొనసాగుతుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈ మధ్యనే తెలియజేశారు. తలసరి ఆదాయంలో మనం ప్రపంచంలో 139వ స్థానంలో ఉన్నామని, అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమాఖ్య వ్యవస్థ వర్ధిల్లి, రాష్ట్రాలు బలంగా ఉండాలని, చట్టబద్ధ పాలన నెలకొనాలని, స్వతంత్ర వ్యవస్థలుండాలని సుబ్బారావు గుర్తుచేస్తున్నారు.


లోక్‌నీతి సిఎస్‍డి‍ఎస్ ప్రస్తుత (2024) లోక్‍సభ ఎన్నికల కోసం జరిపిన విస్తృత సర్వేలో 62శాతం మంది ఉద్యోగాలు దొరకడం లేదని వాపోయారు. సర్వే చేసినవారిలో ఎక్కువగా ముస్లింలు (67శాతం) ఉద్యోగావకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి మాదిరిగానే హిందువులలోని ఎస్సీలు, బీసీలు (63 శాతం) ఎస్టీలు (57శాతం) నిరుద్యోగంలో మగ్గుతున్నారని సర్వే వివరించింది. అగ్రవర్ణాల్లో 57 శాతం మంది ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్నట్టు చెప్పారు. అదే సమయంలో వారిలోని 12 శాతం మంది సులభంగానే దొరుకుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ఉద్యోగం మరింత కష్టంగా ఉంటోంది. ఏటా కోటి ఏభై లక్షల మంది ఉద్యోగార్థులు అదనంగా వచ్చి చేరుతున్న దేశంలో నిరుద్యోగాన్ని అంతమొందించడం ఆషామాషీ చర్యలతో సాధ్యమయ్యేది కాదు. పేద, మధ్యతరగతి యువతకు నాణ్యమైన విద్య నేర్పించి ఆధునిక ఉపాధి వ్యాపకాలకు అవసరమయిన ప్రత్యేక నిపుణతలు చేకూర్చవలసి ఉంది. అందుకే విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం బాగా పెరగాలని ఆర్థికవేత్తలు పదేపదే చెబుతున్నారు. ప్రైవేటు స్పర్శతో పులకించిపోతున్న పాలకులకు ఇది రుచించడం లేదు.

నిరుద్యోగం పెరుగుదల రేటు 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017–18లో 6.1శాతానికి ఎగబాకింది. కోవిడ్ ముమ్మరించిన 2020 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.8 శాతానికి చేరుకొని విలయ నాట్యమాడింది. ఆ కాలంలో పట్టణాల నుంచి పల్లెలకు ఎదురు వలసలు విజృంభించాయి. ఆ విపత్కాలంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విశేషంగా తోడ్పడింది. ఎంతగా అంటే 2019లో ఈ పథకం ద్వారా 260 కోట్ల వ్యక్తి దినాల ఉపాధి పని కల్పించగా 2021లో అది 390 కోట్ల వ్యక్తి దినాలకు పెరిగింది. భూమిలేని నిరుపేద గ్రామీణ వ్యవసాయ కార్మికులకు పని హక్కును కల్పించడానికి యూపీఏ ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ పథకాన్ని బలహీనపరచేందుకు కేంద్రంలోని అధికారపక్షం శతవిధాలా ప్రయత్నించింది. ఈ పథకానికి ఆధార్ అనుసంధానమనే గుదిబండను వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. దీనికి బడ్జెట్‍లో కేటాయింపుల కోత వంటి చర్యలకూ ప్రభుత్వం పాల్పడింది.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పెద్ద నోట్ల రద్దు పథకం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిరుద్యోగాన్ని, నిర్వ్యాపారాన్ని పెంచాయి. కింది స్థాయి కార్మికుల పనులను హరించివేశాయి. అనాలోచితంగా ప్రకటించిన ఆకస్మిక లాక్‌ డౌన్ అసంఘటిత రంగ కార్మిక లోకాన్ని కష్టాల కొలిమిలో తోసివేసింది. నిరుద్యోగాన్ని తగ్గించడానికి శాస్ట్రీయమైన దారులు అనుసరించని మోదీ ప్రభుత్వం దానిని అంచనా వేయడానికి అంతవరకు గల పద్ధతులను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం చేపట్టే వార్షిక ఉద్యోగ నిరుద్యోగ సర్వేకి 2017లో స్వస్తి చెప్పింది. కార్మిక విభాగం (లేబర్ బ్యూరో) మూడు మాసాలకు ఒకసారి నిర్వహించే వ్యాపార సంస్థల సర్వేని కూడా మాన్పించింది. ఆచరణలో నిరుద్యోగం లోతులు తెలుసుకోడానికి ఏర్పాటు చేసిన శాస్త్రీయ పద్ధతులకు నిలువ నీడ లేకుండా చేస్తూ నిరుద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిస్సహాయత ప్రకటించడం విడ్డూరంగా లేదూ?

ఉద్యోగాలు ఎప్పటికీ దొరక్కపోవడంతో విసిగిపోయిన కోట్లాది నిరుద్యోగులు దుర్భరమైన ఆర్థిక బాధలను తట్టుకోడానికి స్వయం ఉపాధులను ఆశ్రయిస్తున్నారని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా–2023 నివేదిక నిగ్గుదేల్చింది. కార్మికులకు విశేషంగా పనులు కల్పించగల తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాలను ప్రారంభించింది. ఇవి వచ్చిన తర్వాత 2016–2021 మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు సగానికి పడిపోయాయి. కోవిడ్‌కి ముందే దేశ తయారీ రంగం కునకడం మొదలుపెట్టింది. ఉద్యోగం ముఖం చాటు చేసినప్పుడు మెజారిటీ కార్మికులు నిర్మాణ రంగాన్ని ఆశ్రయిస్తారు. కోట్లాదిమంది దీనిపైనే ఆధారపడి బతుకుతున్నారు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు బ్రిటిష్ పాలనలో కంటే గత పదేళ్ళలోనే ఎక్కువని ప్రపంచ అసమానతల లాబ్ తరపున ఇటీవల అధ్యయనం జరిపిన నలుగురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నిర్ధారించారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందనేది ఇండియాలో రుజువు కావడం లేదని, ఉన్నత చదువులు చదివే కొద్దీ కొలువు దూరమవుతున్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని వీరిలో 65 శాతం మంది చదువుకున్నవారేనని ఈ నివేదిక వెల్లడించింది. నిరుద్యోగుల్లో విద్యావంతులు 2000లో 18 శాతం కాగా 2022లో 35 శాతానికి పెరిగారు.


కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయని భావిస్తున్న 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రధానికి చేతులు ఎందుకు రావడం లేదు? కంటి తుడుపుగా 60, 70 వేల నియామక పత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం బలపడకూడదు, ప్రైవేటు బలహీనపడకూడదు అనే సిద్ధాంతంతో ఎంతకాలం ఇలా ఈ దేశాన్ని పీడిస్తారు? కార్పొరేట్ యజమానులకు ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల మేరకు రాయితీలు కల్పించినట్టు ప్రతిపక్షం లెక్క చెబుతున్నది. ఆ సొమ్ముతో నిరుద్యోగ నిర్మూలనకు, గరిష్ఠ స్థాయిలో యువశక్తి సద్వినియోగానికి పటిష్ఠ వ్యూహ రచన చేయలేరా? 2014–15కు 2022–23కు మధ్య దేశంలోని పైస్థాయిలో ఒక్క శాతం మంది ఆదాయ వాటా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యధికమని తేలింది. ఈ నేపథ్యంలో అతి సంపన్నులపై సంపద పన్ను విధించాలని నిపుణుల నుంచి వస్తున్న విజ్ఞతాయుతమైన సూచన పాలకులకు వినిపించదా?

జి. శ్రీరామమూర్తి

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - May 08 , 2024 | 12:26 AM