Share News

చేతగాని పాలనలో మోయలేని రుణభారం

ABN , Publish Date - May 10 , 2024 | 01:04 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరగని రీతిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నిర్దిష్ట ప్రణాళిక అనేది లేకుండా ఆర్థిక అరాచకత్వంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన ఈ ప్రభుత్వానికి దాన్నించి ఎలా గట్టెక్కగలమా...

చేతగాని పాలనలో మోయలేని రుణభారం

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరగని రీతిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నిర్దిష్ట ప్రణాళిక అనేది లేకుండా ఆర్థిక అరాచకత్వంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన ఈ ప్రభుత్వానికి దాన్నించి ఎలా గట్టెక్కగలమా అనే భయం, బెదురూ ఏకోశానా లేవు. వైసీపీ ప్రభుత్వం అధికారికంగానే కాకుండా అనధికారికంగా కూడ కుప్పలుతెప్పలుగా అప్పులు చేసింది. సాధారణంగా రాష్ట్రప్రభుత్వం చేసే అప్పులు పారదర్శకంగానే ఉంటాయి. ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలలో, ప్రభుత్వ వెబ్‌సైట్లలో అన్ని గణాంకాలు అందుబాటులోనే ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు శ్వేతపత్రాలు ప్రచురించడం కద్దు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పాటించే విధానాలు, సంప్రదాయాలు. కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆశ్చర్యకరంగా వాటి ఆనవాళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. అప్పులు తేవడం కోసం ఆయన ప్రభుత్వం అనుసరించిన సృజనాత్మక పద్ధతుల్ని గమనిస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఉదాహరణకు మద్యం రాబడిని గ్యారంటీగా చూపించి దానిపై అప్పు తెచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్‌లోన్ పేరిట రూ. 1,400 కోట్లు అప్పు చేసిన జగన్ సర్కార్, ‘లిక్కర్ బాండ్లు’ పేరిట మరో 8,305 కోట్లు తీసుకుంది.


‘అప్పు చేయడం తప్పుకాదు.. అమెరికా వంటి అగ్రరాజ్యం చేసిన అప్పులు ట్రిలియన్ల డాలర్లు దాటిపోయాయి. అంతెందుకు.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ పదేళ్లలో చేసిన అప్పు కోటి కోట్లు దాటిపోయింది’.. అంటూ జగన్‌తో సహా కొందరు అధికార పార్టీ నేతలు గడుసుగా అప్పుల్ని సమర్థించుకోవడాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2002లో నాటి వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన ఎఫ్ఆర్‌బిఎం (ఫిస్కల్ మేనేజ్‌మెంట్‌ అండ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ) చట్టం ప్రకారం, రెవెన్యూ రాబడిని మించి ఖర్చు ఎక్కువైనప్పుడు ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3శాతం మించకుండా అప్పు తీసుకుని, అందులో అత్యధికభాగాన్ని మూలధన వ్యయం కోసం వినియోగించాలి. అంటే, తెచ్చిన సదరు అప్పు ద్వారా ఆస్తులను సృష్టించి ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేయాలి. ఆస్తుల కల్పనకు ఉపయోగపడే రంగాలలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర మౌలికసదుపాయాలు ప్రధానంగా ఉండాలి. కానీ, జగన్ ‍సర్కార్ ఈ ఐదేళ్లలో తెచ్చిన అప్పుల్లో దాదాపు 28 శాతాన్ని మాత్రమే ఆస్థులను సృష్టించడానికి కేటాయించి మిగతా 72 శాతాన్ని రెవెన్యూవ్యయంగా మళ్లించేసింది. ఇక, అనధికార అప్పులన్నిటినీ నూటికినూరుశాతం రెవెన్యూ వ్యయంగా వాడేశారు. దీనివల్ల అప్పు చెల్లించాలన్నా, వడ్డీ కట్టాలన్నా మళ్లీ అప్పు తెచ్చుకోవాల్సిందే. ఈ అప్పులన్నీ భవిష్యత్‌తరాల వారి మెడలకు గుదిబండలుగా మారడం ఖాయం.


జగన్ ప్రభుత్వం చేస్తున్న అనధికార అప్పులకు అసలు లెక్కలే లేవు. అవన్నీ రహస్యంగానే ఉంటున్నాయి. చివరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సమర్పించే లెక్కల్లో సైతం పారదర్శకత లేదు. అప్పు అధికారికమైనా, అనధికారికమైనా ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వాల్సిందే. కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న ఈ అప్పులకు ప్రభుత్వం ఏ ఆస్తులను గ్యారంటీలుగా చూపిస్తోందో వివరాలు అందించమని ‘కాగ్’ పదేపదే అడిగినా రాష్ట్రప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అనధికారిక అప్పులను బహిర్గత పరచకపోవడానికి గల కారణాలలో మొదటిది – ఇంత భారీ మొత్తంలో అప్పుచేస్తున్నారా అని ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం. రెండోది – మొత్తం అప్పులో మూలధన వ్యయం (ఆస్తుల కల్పన)కు కేటాయిస్తున్నది కేవలం 10–12 శాతం మించడం లేదన్న వాస్తవం బహిర్గతం కాకుండా జాగ్రత్తపడడం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అంశాలలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల భవిష్యత్తును పరాధీనంలోకి నెట్టడాన్ని ఆర్థికఉగ్రవాదంగానే భావించాలి. మితిమీరి అప్పు చేయడం ఎంత ప్రమాదకరమో ఆయనకు అవగాహన లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తేటతెల్లం చేయాలని, అందుకు అసెంబ్లీ సహా పలు వేదికల్ని ఉపయోగించుకోవాలన్న ఇంగితం కూడ ఆయనలో లోపించింది. రాష్ట్రానికి అప్పులు పెరిగేకొద్దీ ప్రజలపై పన్నులభారం పెరుగుతుంది. ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వం చివరకు చెత్తమీద కూడా పన్ను విధించడంతో ప్రజలు ఈసడించుకుంటున్నారు. మరొక దారుణమేమిటంటే, అధిక మొత్తంలో అప్పు తెచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను ఇష్టానుసారంగా పెంచుతూ పోవడం. ఆర్థికసంవత్సరం ఆరంభంలో ప్రభుత్వాలు బడ్జెట్ అంచనాలను చూపుతాయి. ఓ ఆర్నెల్ల తర్వాత సదరు అంచనాలను రాబడి ఆధారంగా సవరిస్తాయి. ఏడాది చివరలో వాస్తవిక బడ్జెట్ స‍్వరూపాన్ని.. అంటే, ఆదాయవ్యయాల వివరాలను పూర్తిగా అందిస్తాయి. ఇదంతా ఓ క్రమపద్ధతి ప్రకారం జరిగిపోయే ప్రక్రియ. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక ఈ సత్సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. నిజానికి, బడ్జెట్ వివరాలన్నీ ‘బడ్జెట్ ఇన్ బ్రీఫ్’ పుస్తకం ద్వారా, లేదా ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా అందించాలి. కానీ, గోప్యతకు మారుపేరైన జగన్ ప్రభుత్వంలో ఆర్థికరంగ నిపుణులు ఎంతో కష్టపడి వాస్తవాల్ని వెలికితీస్తే తప్ప రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం గోచరం కాదు.


దీనంతటికి బాధ్యత వహించవలసిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏనాడూ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వివరణ ఇవ్వరు. ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రప్రభుత్వం ఎంత గొప్పగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందో సుద్దులు చెబుతుంటారు. ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సిన అమాత్యులు ముఖం చాటేయడం ఏమిటి? ఉద్యోగులతో మీడియా సమావేశాలు ఏర్పాటుచేయించి ప్రతిపక్షాలను తిట్టించడం ఏమిటి? విపక్షంలో ఉండగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పబ్లిక్ ఎక్కౌంట్స్ చైర్మన్ (పీఏసీ)గా నాటి ప్రభుత్వ ఆర్థికనిర్వహణ గురించి అసెంబ్లీలో ఎన్నో విమర్శలు, సూచనలు, సలహాలు చేశారు. ఉన్నత సంప్రదాయాల గురించి సెలవిచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టినా తనకెటువంటి సంబంధం లేనట్టు ముఖం చాటేస్తున్నారు.

ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? నిజానికి, ఈ లెక్కలు తేల్చడం తలకుమించిన భారమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,66,401 కోట్లు. 2024 నాటికి రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు కలిసి రూ. 10.21లక్షల కోట్ల మేరకు చేరాయి. ఇవికాక, గత మార్చి చివరినాటికి మరో రూ. 18వేల కోట్లు కావాలని జనవరిలోనే రిజర్వ్ బ్యాంకుకు అర్జీ పెట్టారు. జూన్ నాటికి ఇంకో రూ. 25వేల కోట్ల అప్పు జమ అయ్యే అవకాశం ఉందని ఆర్థికశాఖ సమాచారం. అంటే, అధికారికంగా తెచ్చిన ఈ అప్పులతో.. రాష్ట్రప్రభుత్వం అప్పు మొత్తం రూ. 10.65లక్షలకోట్లకు చేరుతోంది. వీటితోపాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా పొందిన రుణాలు, బాండ్ల ద్వారా సేకరించిన అప్పులు కలిపి రాష్ట్ర స్థూల రుణం రూ. 14 లక్షల కోట్లని అంచనా వేస్తున్నారు.


‘అప్పులు తెచ్చినా పేదల సంక్షేమానికేగా ఖర్చు చేస్తున్నది’ అంటూ అధికార పార్టీ నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కానీ, ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు ప్రజలకు రూ. 10లు ఇచ్చి రూ. 100 లాగుతున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మితిమీరిన అప్పులు చేయడం వల్ల ఈ ఐదేళ్లలో నానారకాల శిస్తులు, సుంకాలు, పన్నులు, చార్జీల బాదుడుతో ప్రజలపై రూ. 2లక్షల కోట్ల భారాన్ని మోపారు. ఇందులో కరెంట్‌చార్జీల పెంపు, పెట్రోల్ డీజిల్‌పై అదనపు భారం, ఆస్తిపన్ను పెంపుదల, హరితపన్ను, చెత్తపన్ను, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుదల, ఓటీఎస్ రూపంలో ఇండ్ల లబ్ధిదారుల నుంచి పిండిన మొత్తం, రేషన్ సరుకుల ధరల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు తదితరమైనవి ఎన్నో ఉన్నాయి.


అభివృద్ధి కుంటుపడితే రాష్ట్రానికి జరిగే అనర్థం ఏమిటో ప్రజలు గ్రహించాలి. ఇతోధికంగా ప్రగతిపథంలో సాగితేనే రాష్ట్రప్రభుత్వ ఆదాయం, ప్రజల వ్యక్తిగత ఆదాయం పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బడిముబ్బడిగా సాగితేనే రాష్ట్రం కళకళలాడుతుంది. అన్నివర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తుంది. సమృద్ధిగా రాబడి ఉంటుంది. అప్పుచేసి తినే పప్పుకూడు మనిషిని జీవచ్ఛవాన్ని చేసినట్టే రాష్ట్రాన్ని కూడా అలాగే తయారుచేస్తుంది. ప్రజలు ఈ వాస్తవాల్ని గ్రహించాలి. ఆర్థిక ఉగ్రవాదాన్ని వదిలించుకోవాలి. రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నవారెవరో గ్రహించాలి. వారికే పట్టం కట్టాలి.

సి. రామచంద్రయ్య

మాజీ శాసనమండలి సభ్యులు

Updated Date - May 10 , 2024 | 01:05 AM