‘రైతు భరోసా’ ఎవరికి?
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:06 AM
రాష్ట్రంలో పట్టా భూములు కలిగిన రైతులు/భూస్వాములలో అరవై శాతానికి పైగా వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయంపై ఆధారపడిన వారు పట్టా భూములు గల రైతులు/భూస్వాముల వద్ద...

రాష్ట్రంలో పట్టా భూములు కలిగిన రైతులు/భూస్వాములలో అరవై శాతానికి పైగా వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయంపై ఆధారపడిన వారు పట్టా భూములు గల రైతులు/భూస్వాముల వద్ద కౌలు పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం పెట్టుబడిలో రైతులు సగం, కౌలుదార్లు సగం భరించి పంటలను చెరి సగం పంపిణీ చేసుకునే పద్ధతి లోగడ అమలులో ఉండేది. కాలక్రమేణా ఈ పద్ధతి మారి వ్యవసాయ యోగ్యమైన భూమిని ఎకరానికి కొంత మొత్తం ఇచ్చే విధంగా కౌలుదార్లయిన రైతులకు ఒప్పందంతో అప్పగిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కౌలుదార్లయిన రైతులే పెట్టుబడి పెట్టాలి. ప్రకృతి వైపరీత్యాలతో భూస్వామికి సంబంధం లేదు. కౌలుదార్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు, కారణం వారు పట్టాదారులైన రైతులు కాదు గనుక.
2018–19 నుంచి గత ప్రభుత్వం రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూమిని అంచనా వేయకుండా ఎకరానికి ఇంత అని రెండు పంటలకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు/ భూస్వాముల బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేసింది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదెకరాల లోపు పట్టాలున్న రైతులకు/భూస్వాములకు వారి బ్యాంకు ఖాతాల్లోకి రెండు పంటలకూ నగదు బదిలీ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద జూన్ 2019 నుంచి రైతుకు రూ. ఆరువేలు సహాయం అందజేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల చూపిన ‘ఉచితాల’ వల్ల కౌలురైతులు ఎలాంటి లబ్ధీ పొందలేదు. రైతుబంధుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో తొందరపాటు చర్య– పంటలు పండించని భూములకు, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈ పథకం అందించడం.
కౌలుదార్లు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంటలు పండించినా వారికి గిట్టుబాటు ధర ఓ సమస్య. అది లభించక కౌలురైతులు నష్టపోయి కూలీనాలి పనుల కోసం దగ్గర్లోని పట్టణాలకు పోతున్నారు. కౌలుదార్లు వ్యవసాయం మానేస్తే పంటలు పండించేదెవరు? పట్టాభూములున్న రైతులకు మాత్రమే రైతుబంధు వర్తింపజేయడంలో గత ప్రభుత్వ ఉద్దేశమేమిటి? రైతులను ఆదుకుంటున్నదనే భావన కలగటానికా? వాస్తవంగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? పడావు భూములా? కౌలుదార్లు వ్యవసాయం చేస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని, వ్యవసాయ శాఖ ద్వారా సమాచారం తెప్పించుకుని ‘రైతుబంధు’ను అమలు చేసి ఉండాల్సింది. కష్టపడేదొకరు? లాభపడేదొకరు అన్న చందంగా భూస్వాములకు ప్రయోజనం చేకూరగా, కౌలురైతులకు ప్రయోజనం దక్కలేదు.
ప్రస్తుత ప్రభుత్వమైనా ‘రైతు భరోసా’ పథకాన్ని సమగ్ర సమాచార సేకరణ అనంతరం చేపట్టాలి. గత ప్రభుత్వం చేపట్టిన పథకంలో లోటుపాట్లను సరిచేసి, కౌలుదార్లకు సైతం పెట్టుబడి ద్వారానో, ఎరువులు–విత్తనాల ద్వారానో సహాయం అందించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది.
ఎం. నిజాముద్దీన్