Share News

‘‘మానవ ఉద్వేగాల మాటున అంతఃసూత్రాన్ని ఒడిసిపట్టాలని...’’

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:39 AM

రాయడానికి అంటూ రచయిత పూనుకున్నాక అది ఖాళీ కాగితంపై కుట్ర పన్నుతున్నట్టే లెక్క. కానీ ఆ రాత వెనక ఉండే వైవిధ్యమైన మానవ ఉద్వేగాలకి, ఆలోచనలకి ఉండే స్వతంత్రతని, విశృంఖలత్వాన్ని ఒప్పుకుంటూ వాటన్నిటి మాటున కదులుతున్న...

‘‘మానవ ఉద్వేగాల మాటున అంతఃసూత్రాన్ని ఒడిసిపట్టాలని...’’

ధీరజ్‌ కశ్యప్‌ వేముగంటి : పలకరింపు

కవిత్వమూ, కథలూ కూడా రాసిన రచయితలు ఉన్నారు కానీ, రెండింటినీ కలిపి ఒకే ప్రచురణగా తెచ్చినవారు తెలుగులో అరుదు. మీ ‘క్షణికాలు’ పుస్తకంలో ఇలా నాలుగు విభాగాల కూర్పు గురించి చెప్పండి?

రాయడానికి అంటూ రచయిత పూనుకున్నాక అది ఖాళీ కాగితంపై కుట్ర పన్నుతున్నట్టే లెక్క. కానీ ఆ రాత వెనక ఉండే వైవిధ్యమైన మానవ ఉద్వేగాలకి, ఆలోచనలకి ఉండే స్వతంత్రతని, విశృంఖలత్వాన్ని ఒప్పుకుంటూ వాటన్నిటి మాటున కదులుతున్న అంతఃసూత్రం ఉండే ఉంటుందని, దాన్ని ఒడిసిపట్టాలనేదే ఈ పుస్తకం వెనక ఉన్న దృష్టి కావొచ్చు. దీని కోసం నేను చూపిన ప్రత్యేక మైన శ్రద్ధ ఏంటి అంటే వేచి చూడడం. ప్రశ్నల నుంచి శూన్యాల వరకు సాహిత్యం కాగల ప్రతీ అనుభవం కోసం ఎదురు చూడడమే నేను చేసింది.

నూటముప్పై పేజీల ఈ పుస్తకంలో నాలుగు భాగాలున్నాయి. వచనం వైపున రెండు భాగాలు: 1. కొన్ని కథలు 2. కాసిన్ని క్షణాలు. కవిత్వ రూపంలో రెండు భాగాలు: 1. కొన్ని తారలు 2. కాసింత శూన్యం.

కథ, కవిత్వం- ఈ రెండు ప్రక్రియల్లోనూ దేని వైపు మీకు మొగ్గు ఉంది? ఎందుకు?

రచన పరంగా నాలో నేను ఇంకా స్పష్టత సాధన చేస్తున్న రచయితననే చెప్పుకోవాలి. ఇక మనస్సుపై అనుభవాల స్పర్శ కదిలిన ప్రతి క్షణం కవిత్వంలానే తోస్తుంది నాకు. నాలో ఉండే ప్రశ్నల వేదనలకి భరించగలిగే రూపివ్వడంలో కవిత్వము; ఆ ప్రశ్నలని దాటి జీవితాన్ని జీవితంలా ఒప్పుకోవడంలో, ఆ క్షణాలని వాక్యాల్లోకి తర్జుమా చేసుకుంటున్న ప్రతీసారి నాకు వచనం ఊపిరందించగలదు అని ఈ మధ్య అనిపిస్తుంది.

సాహిత్య రచన వైపు మరలేందుకు మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు లేదా రచయితల గురించి చెప్పండి.

సమూలంగా ఈ రచయితని చదివానని, వీళ్లంటే బాగా ఇష్టమని చెప్పలేను. విశ్వంభర దీర్ఘ కవితలో మొదటి నాలుగు మాటలు ఇప్పటికీ వెంటాడుతాయి. శేషేంద్రశర్మ కవిత్వం ఒంటరి సమయాల్లో ఆలంబనై నిలిచింది. పాలిష్‌ కవయిత్రి Wislawa Szymborska కవితలు కొన్ని నా రచనా ప్రయాణంలో ఒక విడుదలలాంటి స్వేచ్ఛనిచ్చాయి. ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే ‘ఏ క్లీన్‌ వెల్‌ లైటెడ్‌ ప్లేస్‌’ అనే కథలోని మానవ జీవితాల పార్శ్యాలు, అలా కదిలే కథలని వెతుక్కుంటాను. ‘‘జీవితాన్ని ఇంత స్వతంత్రంగా, ఇంత స్పష్టంగా చిత్రించొచ్చా’’ అనే ఆశ్చర్యం ఇచ్చే రచనలంటే ఇష్టం.

‘‘పూర్తి స్పృహతో చేసే పనికి శోకభారం ఉండదు’’ అన్న రమణుల మాటల ప్రభావం అర్థమయేలా, మీ రచనల్లో దుఃఖభరిత సందర్భాలు ఉన్నా, అక్కడి వ్యక్తులు ఆ దుఃఖంలో లీనమవడం కనపడదు. వాస్తవం ఎలా ఉన్నా జ్ఞాపకాలే బాటసారి గొంతు తడిపేవి అన్న మీ మాటల వెనుక ఆలోచనలేమిటి?

మాటల వెనక ఉన్న భావం -acceptance. పూర్తి ఒప్పుకోలు. మెటాఫిజికల్‌ టోన్లో సాగే ‘కాసింత శూన్యం’ కవితలని కాస్త ఎత్తు నుంచి చూస్తే ‘ఈర్ష్య’, ‘నొప్పి’, ‘మోహం’ లాంటి పదాలు కనపడతాయి. అది ప్రయత్నంతో చేసిందని అనుకోను. దాని వెనక ఉద్దేశం- నాలో నేను వాటితో కుదుర్చుకోవాలనుకునే సంధి లాంటిదేమో. నేను నుంచి అనంతం వరకు పరుచుకున్న ఈ విశ్వానుభవమంతా నాతోనే ముడి వేయబడ్డదనే స్పృహ, అది మోపే బరువు, దాన్ని నాలోకి కలుపుకునే ప్రయాణంలోని మాటలేమో ఇవి.

ఎందుకు రాస్తున్నాను అనే ప్రశ్న కుతూహలంగా నైనా, కలవరంగా అయినా మిమ్మల్ని తాకిన సందర్భాలేవైనా ఉన్నాయా?

మానవ స్పృహ మోయక తప్పని శిలువ అని ఒక మాట రాసాను ఈ పుస్తకంలో. న్యూయార్క్‌ నగరంలోని వంతెనపై వర్షపు జల్లులో ఓ జంట నడుస్తున్న దృశ్యం నిండైన మోహన రాగమై వినిపించిందని కూడా రాసాను. ఒక వైపు మనల్ని శాసించే మానవావస్థలు (హ్యూమన్‌ కండిషన్‌), మరో వైపు అకస్మాత్తుగా దాడి చేసే అందమైన అనుభవాలు ఏకకాలంలో ఉండే జిందగీ తత్వాన్ని గమనించడంలోంచి ఈ పుస్తకం పుట్టిందేమో. అలా అని ఆనందాల్ని వెంబడిస్తూ, వాటి కోసమే వెంపర్లాడుతూ, గొప్ప క్షణాలని మాత్రమే కంటూ వెళ్లడంపై నాకు చాలా అనుమానాలున్నాయి. నాకే కాదు వేల ఏళ్లుగా మానవ జాతి తత్వ చింతన మూలాలన్ని అక్కడివే అనిపిస్తుంది.

పుస్తకంలో ఎన్నో చోట్ల, ఎన్నో రకాలుగా హైదరాబాద్‌ నగరపు ఉనికి కనపడుతుంది. ఇది ఒట్టి వివరంలా వ్యక్తమైనది కాదని, మీ మొదటి పుట, ‘To Hyderaabaad’ చెబుతుంది. నగరం మీద ఎందుకంత ప్రేమ?

హైదరాబాద్‌ గురించి రాయాలని, ఈ నగరానికి నా పుస్తకంలో చోటివ్వాలని ప్రయత్నించకపోవడంలోనే నేను నోస్టాల్జియాని దాటానని అనుకుంటాను. ఈ పుస్తకంలో హైదరాబాద్‌ కొన్ని క్షణాలై వెలిగి బతుకుతుంది. ఎందుకంటే హైదరాబాద్‌ అంటే నాకు యవ్వనం. యవ్వనం అంటే నా లెక్కలో beautifully wasted glory (కాలాన్ని అందంగా తగలెట్టగలిగిన గొప్ప అదృష్టం.) వేల మైళ్ళ దూరాలు దాటినా హైదరాబాద్‌ నాలో ప్రవహించే నిజం. అందుకే అకస్మాత్తుగా, తన ఇష్టానుసారంగా కథల్లో, కవితల్లో మెరుస్తుంది తప్ప నాకంటూ స్థూలంగా అంత చోటివ్వమని అడగలేదు. అందుకే నేను దానికి మొదటి పేజీని తీసుకోమన్నానేమో.

ఇంటర్వ్యూ : మానస చామర్తి

Updated Date - Apr 08 , 2024 | 12:39 AM