Share News

ఇంతటి యువశక్తి కలిగిన రాష్ట్రంలో ఇదా పాలన!?

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:44 AM

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీ సొంత మీడియా ద్వారా కొట్టుకొంటున్న సొంత డబ్బా శ్రుతి మించి వికటించే స్థాయికి చేరుకున్నది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ...

ఇంతటి యువశక్తి కలిగిన రాష్ట్రంలో ఇదా పాలన!?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీ సొంత మీడియా ద్వారా కొట్టుకొంటున్న సొంత డబ్బా శ్రుతి మించి వికటించే స్థాయికి చేరుకున్నది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. అధికార పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కాబోలు సొంత ఛానెల్‌లో ఓ కార్యక్రమం మొదలు పెట్టారు. సూటు బూటు ధరించిన ఇద్దరు యాంకర్లు, వారికెదురుగా ప్రభుత్వ పథకాలు అందుకున్న కొందరు లబ్ధిదారులు ఉంటారు. యాంకర్లు తామే వారికి సగం జవాబులు అందిస్తూ ప్రశ్నలు వేస్తుంటారు. ‘చెప్పండి సుబ్బారావు గారూ.. ఈ ఐదేళ్లల్లో జగన్‌ గారి వల్ల మీరు ఏ విధంగా లబ్ధిపొందారు. మీ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో వివరిస్తారా?’ సీనియర్‌ యాంకర్‌ ప్రశ్న. సదరు సుబ్బారావు గారు, ‘నాకిద్దరు కొడుకులండి.. పెద్దవాడు బీకాం కంప్యూటర్స్‌, ఐదేళ్లుగా గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రెండోవాడు ఎంబీఏ చేసి రెండేళ్లయింది. జగన్‌గారి పుణ్యమా అని రెండోవాడు కూడా వాలంటీర్‌గా జాయిన్‌ అయ్యాడండీ.. ఇప్పుడు మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మా కుటుంబం హాయిగా బ్రతుకుతోందండి’ అంటూ అతను తన్మయత్వంతో చెబుతుంటే, జూనియర్‌ యాంకర్‌ మెడలోని ‘టై’ని సరిచేసుకొంటూ ‘ఈ సంగతి ఆ ప్రతిపక్షం వాళ్లకు వినబడేట్టు గట్టిగా చెప్పండి.. తెల్లారి లేస్తే జగన్‌ గారి మీద పడి ఏడుస్తుంటారు’ అని ముక్తాయింపు ఇస్తాడు.

ఇదొక్క ఉదాహరణ చాలు– గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని చదువుకొన్న యువత భవితవ్యం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి. లక్షల్లో యువతకు ఉద్యోగాలు కల్పించామని అధికార పార్టీ వేసుకొంటున్న దండోరా వెనుకనున్న అసలు నిజం ఇది. కంప్యూటర్‌ పట్టభద్రులు, ఉన్నత చదువులు చదువుకొన్న యువతకు రాష్ట్రంలో వాలంటీర్‌ను మించిన ఉద్యోగాలు లభించడం లేదన్నది ఓ చేదు వాస్తవం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనప్పుడు యువత మాత్రం ఏం చేస్తుంది? నెలకు నాలుగైదు వేల రూపాయల జీతంతో ఉద్యోగాల్లో చేరిన యువత భవిష్యత్‌ ఏమిటి? చిరుద్యోగం కంటే తక్కువ ఉద్యోగాలు చేపట్టిన యువతకు చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి, లభిస్తున్న జీతానికి ఎక్కడా పొంతన లేదు? ఈ లెక్కన వారు జీవితంలో ఎప్పటికి స్థిరపడగలరు?

సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఇవై) నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్‌ నాటికి నాలుగు శాతంగా ఉన్న నిరుద్యోగిత 2023 డిసెంబర్‌ నాటికి 6.6శాతానికి పెరిగింది. ఇదే నివేదిక ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు 35.14శాతంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్‌ నిరుద్యోగ రేటులో దేశంలో తెలంగాణది 9వ స్థానం కాగా, ఆంధ్రప్రదేశ్‌ది తొలిస్థానం. అంటే వెనుకబడిన రాష్ట్రాలుగా పేరు పొందిన బిహార్‌, ఒడిశా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో కంటే ఏపీలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు.

అధికారంలోకి రాగానే వెంటనే 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు నమ్మకంగా చెప్పారు. ఇదే హామీని మేనిఫెస్టోలో చేర్చారు. సోషల్‌ మీడియాలో దీనిపై చాలా రోజులుగా ‘జగన్‌ జనవరి 1న నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వడం లేదు గానీ సాక్షి క్యాలెండర్‌ ఇస్తున్నారు’ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

నిజానికి దేశంలో అద్భుతమైన సహజ వనరులు, చురుకైన మానవ వనరులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు పేరుంది. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా ర్యాంకులు పొందే యువత సంఖ్య గణనీయంగా ఉంది. ముఖ్యంగా ఐటీ– బీపీవో రంగం ఇప్పటికీ యువతకు పెద్దపీట వేస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌ చేయడానికి ప్రయత్నించారు. ఐదేళ్లలో నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలతోపాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలను రాష్ట్రానికి తేవడానికి కృషి చేశారు. ప్రతియేటా దావోస్‌కు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నూతనంగా ‘డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు’ విధానం తెచ్చి రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు పలు రాయితీలు అందించారు. ఆయా కంపెనీలు అందించే ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా తగిన ఇన్సెంటివ్‌లు వాటికి కల్పించారు. ఈ చర్యల వల్ల విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ కుదురుకోవటం మొదలైంది. హైదరాబాద్‌కు సమాంతరంగా విశాఖపట్నం ఐటీ రంగంలో ఎదుగుతోందని అనుకొంటున్న సమయంలోనే 2019లో జగన్ అధికారంలోకి రావడంతో ఈ పరిస్థితి మొత్తం తలకిందులయ్యింది. కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందనే దుగ్ధతో డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ విధానాన్ని రద్దు చేసి పడేశాడు. దాంతో, దాదాపు 100 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు కార్యకలాపాల్ని విరమించుకొని పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. జగన్‌ హస్వదృష్టి, అకారణ ద్వేషాన్ని చూసి ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ వంటివి కూడా గుడ్‌ బై చెప్పి నిష్క్రమించాయి.

కొత్త కంపెనీలు ఏర్పాటయితే వాటివల్ల ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా యవతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది ఒక్క జగన్‌కి మాత్రమే తెలిసి ఉండకపోవచ్చు! ఐటీ– బీపీవో కంపెనీలు కొత్తగా వచ్చాకనే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌, రవాణా, హోటల్‌, హాస్పిటాలిటీ తదితర రంగాలు అభివృద్ధి చెంది తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇక, చంద్రబాబు నాయుడు మీద బురద జల్లడానికి సీమెన్స్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నెపంతో ఆ సంస్థ అనుబంధ నైపుణ్య కేంద్రాలను మూత వేయించారు. ప్రతియేటా 70వేల మందికి హైఎండ్‌ నైపుణ్యాలు అందించే కేంద్రాలు మూతపడటంతో యువతకు లభించాల్సిన ఉద్యోగాలు దక్కకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఒంటెత్తు పోకడలు యువతకు శాపంగా మారగా, పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం నెత్తిన పాలు పోసినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన అనుకూల విధానాలతో అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగుల సంఖ్య 9లక్షలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే, గణాంకాలు వెల్లడించే వారే లేరు.

ఇక రాష్ట్రంలో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2014–19 మధ్య ఖాళీగా ఉన్న 18వేల మంది టీచర్‌ పోస్టులను భర్తీ చేయగా, ప్రతియేటా మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్‌ చివరి ఏడాదిలో మాత్రమే 6వేల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగార్థులను మోసం చేశారు. ఇక, నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి గానీ, ప్రభుత్వ పనుల్లో, కాంట్రాక్టులలో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పిస్తామనే మాటలు గానీ నీటి మూటలుగా మిగిలిపోయాయి. పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సర్వీస్‌ కమీషన్‌ను ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి, తగిన అర్హతలు లేని వారిని సభ్యులుగా చేసి దాని ప్రతిష్టను దిగజార్చారు. సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, ఉద్యోగాలు, ఉపాధి లేని యువత నైరాశ్యంలో మునిగిపోయి పెడమార్గం పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2020–2023 మధ్య మూడేళ్ల కాలంలో 21,575 మంది యువత ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలకు పాల్పడినట్లు సాక్షాత్తు కేంద్ర కార్మిక మంత్రి రామేశ్వర్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు. అదేవిధంగా ఈ ఐదేళ్లల్లో గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచినట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. ఇంకోపక్క రాష్ట్రంలో నాసిరకం మద్యం యువత పాలిట స్లోపాయిజన్‌గా పనిచేస్తూ వారి ఆరోగ్యాల్ని దెబ్బతీస్తోంది.

ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా యువత సంఖ్య అధికంగా ఉంటే దానిని ‘డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌’గా చెప్పుకొంటారు. అంటే, యువత సంఖ్య ఎక్కువగా ఉండటం ఏ రాష్ట్రానికైనా అనుకూల అంశం. కానీ, జగన్‌ అధికారంలో ఉండటం రాష్ట్ర యువతకు ప్రతికూల అంశంగా పరిణమించింది. ఈ భయానకమైన వర్తమానాన్ని వీడి ఇకపై అందమైన భవిష్యత్తును పునర్‌ నిర్మించుకోవాలంటే రాష్ట్రంలోని యువత తమ పాలిట యమకింకరుడిగా మారిన పాలకుణ్ణి వదిలించుకోవాల్సిందే!

సి. రామచంద్రయ్య

శాసనమండలి మాజీ సభ్యులు

Updated Date - Apr 03 , 2024 | 02:44 AM