Share News

కాపులకు ఇదే మంచి తరుణం!

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:21 AM

గత పది సంవత్సరాలుగా, అంటే 2014 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆంధ్రలో కాపులకు రాజకీయంగా మంచి కాలం మొదలైనట్టుగా....

కాపులకు ఇదే మంచి తరుణం!

గత పది సంవత్సరాలుగా, అంటే 2014 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆంధ్రలో కాపులకు రాజకీయంగా మంచి కాలం మొదలైనట్టుగా కనబడుతున్నది. సంఖ్యాపరంగా ఏ ఒక్క కులం కంటే కూడా కాపు (కాపు, తెలగ, బలిజ, ఒంటరి) కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారనే భావం సమాజంలో ఉండడంతో రాష్ట్ర రాజకీయాల చూపు కాపు కులం పైకి మళ్ళింది.

కాపులలో దాదాపు 75శాతానికి పైబడి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. గ్రామాల్లో అయితే చిన్నపాటి రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న జీవనోపాధి వృత్తులు; పట్టణాల్లో అయితే చిన్న చిన్న రోజువారీ వృత్తులు, ఆటో ఇతర వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా, హెల్పర్లుగా, రోడ్ల పక్కన చిన్న చిన్న రోజువారీ వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకునే వారిగా కాపులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. విద్య, ఉపాధి వ్యవహారాలలో వారికి ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సిన అవసరాన్ని 2014 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావించారు. నిజానికి, కాపుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని అంత బలంగా, స్పష్టంగా, సూటిగా ప్రస్తావించిన ఆ స్థాయి నాయకుడు చంద్రబాబు కంటే ముందు ఎవరూ లేరు.

2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి కాపుల సమస్యను ప్రస్తావించినప్పటికీ ఆ ప్రస్తావనలో ‘ఫోర్స్’ లేదు, కమిట్‌మెంట్ కనపడలేదు. అందుకే 2009 ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజశేఖర రెడ్డి ఆ ప్రస్తావన తీసుకురాలేదు.

కాపులకు రిజర్వేషన్ అంశంపై, చంద్రబాబు నాయుడు మాటల్లో వ్యక్తమైన సీరియస్‌నెస్ రాష్ట్రంలోని కాపుల ఇంటింటికీ చేరింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే తమ చిరకాల స్వప్నం అనుభవంలోకి వస్తుందని కాపులు ఆశించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక, కాపులకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద కాపులకు విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపుల అభ్యున్నతికి సంబంధించి, ప్రభుత్వపరంగా ఇది పెద్ద ముందడుగు.

రిజర్వేషన్లకు సంబంధించి బీసీలలో తలెత్తిన అపోహల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే స్థానిక సంస్థల పాలక వర్గాలలో ప్రస్తుతం బీసీలకు గల రిజర్వేషన్లు కాపులకూ వర్తిస్తాయని బీసీలలో ఆందోళన వ్యక్తం అయింది. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి బీసీ వర్గంలో తలెత్తిన ఈ ఆందోళనను ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి కూడా ఒక పట్టాన అర్థం కాలేదు. కాపులకు రిజర్వేషన్ కోసం అప్పటి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామమే కార్యక్షేత్రంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఒక పక్క, ఇటు బీసీలలో ఎగసిపడుతున్న ఆందోళనలు రెండో పక్క... మధ్యలో చంద్రబాబు నాయుడు నలిగిపోయారు.

నిజానికి కాపుల విద్య ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లకు బీసీలు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కాపులు సంఖ్యాపరంగా బాగా ఎక్కువగా ఉన్నందున స్థానిక సంస్థల పాలక వర్గాలలో తమకు ఉండే రిజర్వేషన్లలో అధిక భాగం వారికి వెళ్ళిపోతాయేమో అని మాత్రమే బీసీలు ఆందోళనకు లోనయ్యారు. విషయం చాలా సున్నితంగా తయారైంది.

అగ్రవర్ణాలుగా గుర్తింపు పొందుతున్న బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, వెలమ మొదలైన కులాల సరసనే కాపు కులం కూడా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఒక పెద్ద కులంగా ఉన్న కాపుల ఆర్థిక వెనుకబాటును దృష్టిలో పెట్టుకుని, విద్య ఉపాధిలో రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అభ్యంతరం ఉండదని, కాపులకూ అభ్యంతరం ఉండదని కాకినాడకు చెందిన గోకేడ రాంబాబు అప్పటి హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు కూడా పూర్తిగా కన్విన్స్ అయ్యారు. అప్పటి దాకా ఆయనకు ఈ ఐడియా తట్టలేదు. ‘ఒక మొండి సమస్యకు పరిష్కారం చూపెట్టారు, థాంక్స్ రాజప్పా...’ అంటూ వారిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

విద్య, ప్రభుత్వ ఉపాధి రంగాలలో కాపులకు 5శాతం రిజర్వేషన్ వర్తింపచేయడానికి చంద్రబాబు సన్నద్ధం అయ్యే నాటికి, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10శాతం వర్తింప చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసింది. ఆ పది శాతంలో ఐదుశాతం కాపులకు వర్తింప చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క నిముషంలో నిర్ణయం తీసుకుంది. కాపుల కల దాదాపుగా నెరవేరింది. కానీ అది అమలులోకి రాకుండానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ విధంగా కాపు బిడ్డలకు విద్య, ఉపాధి అవకాశాలలో చంద్రబాబు పెట్టిన రిజర్వేషన్ ముద్ద వారి నోటికి అందకుండాపోయింది.

కాలగమనంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబుపై అప్పుడు వరద గోదారిలా విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జనసేన పార్టీ పట్ల సానుకూల భావనతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాపు కమ్యూనిటీకి సంబంధించినంత వరకు ఇదొక సానుకూల పరిణామం. కాపుల ఆర్థిక, సామాజిక వెనుకబాటును దృష్టిలో పెట్టుకుని సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం తదితర నేతలు గుర్తించాలి. ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాధినేతతో సానుకూలంగా, సౌమ్యంగా వ్యవహరించడం ద్వారా కాపు సమస్యకు పరిష్కారం సాధించాలి. ‘కాపులకు రాజ్యాధికారం’ అంటే ఏదో ఎక్కడో లేదు. వారి పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉపాధి మార్గాల మెరుగుదలలో ఉంది. రాజకీయాలు పక్కన బెట్టి వీరి వెనుక ఏపీలోని కాపులు సంఘటితం కావడంలో విజ్ఞత ఉంది. కాపు కుల అభ్యున్నతి ఉంది. అందుకు, ఇదే తగిన సమయం. రాజకీయాలు ఎందుకు? రోటీ, కపడా, ఔర్ మకాన్ కావాలి గానీ!

భోగాది వేంకట్రాయుడు

Updated Date - Feb 01 , 2024 | 03:21 AM