Share News

కమ్యూనిస్టు పార్టీలకు ఇది మంచి తరుణం!

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:28 AM

మన దేశంలో కాంగ్రెస్, భాజపా, ప్రాంతీయ పార్టీలు – అన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నవే. జాతీయరంగంలోని పరిశ్రమలు దిగజారటానికి కాంగ్రెసు దోహదం చేసింది. కొన్ని ప్రైవేటుపరం...

కమ్యూనిస్టు పార్టీలకు ఇది మంచి తరుణం!

మన దేశంలో కాంగ్రెస్, భాజపా, ప్రాంతీయ పార్టీలు – అన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా ఉన్నవే. జాతీయరంగంలోని పరిశ్రమలు దిగజారటానికి కాంగ్రెసు దోహదం చేసింది. కొన్ని ప్రైవేటుపరం చేసింది, కొన్నిటిని మూసివేసింది. భాజపా మరో ముందడుగు వేసి, ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంది. ఉత్పత్తిరంగమంతా బడా వ్యాపారుల చేతుల్లోకి వెడుతోంది. వీళ్ళలో చాలామంది ఈ పార్టీల నాయకులకి బినామీలే. దీంతో శ్రామికవర్గాలు, సన్నకారు, కౌలు రైతులు, చిరువర్తకులేగాక, మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందులకి గురవుతున్నారు. దేశంలో వ్యవసాయం దెబ్బతిన్నది, నిరుద్యోగం పెరుగుతున్నది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్ని ప్రోత్సహించి నిరుద్యోగాన్ని తగ్గించడం, ఉత్పత్తుల్ని పెంచడం, ధరల నియంత్రణకి కృషి చేయవలసిన ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టున్నాయి. విద్యావ్యవస్థ కూడా దిగజారుతున్నది. ప్రభుత్వరంగ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా నాణ్యత కొరవడింది. నూతన విద్యావిధానం విద్యా ర్థులు చదువు మానివేసినా సర్టిఫికెట్లు, డిప్లమాలు ఇస్తామంటూ మానివేయడాన్ని ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరు. మన ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి రోజురోజుకి దిగజారుతుందేగాని మెరుగుపడటం లేదు. ఏ వైద్యశాల చూసినా వైద్యులు గాని, సహాయ సిబ్బంది గాని ఉండవలసిన దానికన్నా సగం కూడా లేరు.

పౌరహక్కుల పరిస్థితి ఎలావుందో తెలిసిందే. ప్రజలు తమ సమస్యలకై ఉద్యమించినా పోలీసులు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అరాచకశక్తులు విజృంభిస్తున్నా పట్టించుకోని పోలీసులు, చట్టాల్ని ఉల్లంఘించి మరీ ఈ దాడుల్ని కొనసాగిస్తున్నారు. సమాజంలో మహిళలపై, ప్రత్యేకించి పేద, దళిత వర్గాల మహిళలపై లైంగికదాడులు, హత్యలు పెరిగాయి.

మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రముఖ పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్ద మార్పేమీ ఉండదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు పలుకుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దిగజార్చి రాష్ట్ర అధికారాల్ని లాగేసుకుంటున్నా ప్రాంతీయ పార్టీలు నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రజలకి వేరే అవకాశం లేక వాటిలో ఏదో ఒక దానిని గెలిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీపార్టీ కనిపిస్తే గెలిపించారు. మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీలే. సమస్యలపై అవగాహన కలిగి, ఉద్యమాలు చేసిన పార్టీలు. కమ్యూనిస్టు పార్టీలు కొద్ది సీట్లకి పోటీచేసినా, అధికారంలోకి రారు కాబట్టి పెద్దగా ఓట్లుపడే అవకాశం ఉండదు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీలతో సహా అన్నీ కలిసి అన్ని స్థానాలకు పోటీ చేస్తే, అధికారంలోకి రాగలిగే బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి కనుక గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికీ ప్రజలలో కమ్యూనిస్టు పార్టీలే మేలు చేస్తాయనే భావన, వారి పట్ల అభిమానం ఉంది. కలిసి అన్ని సీట్లకు పోటీ చేస్తే తప్పకుండా పరిస్థితులు మారతాయి. ముందుగా మీమీ భేషజాలని పక్కనబెట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే పోటీచేయాలని ప్రతి పార్టీ స్థిర నిర్ణయం తీసుకుంటే అది అసాధ్యమేమీకాదు. సమస్య వచ్చినప్పుడు చర్చించుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరిస్తే పరిష్కారం దొరుకుతుంది. తద్వారా సీట్ల సర్దుబాటు కూడా సాధ్యమవుతుంది. మార్పు మొదలు కావాలి. అది ఇప్పుడే ఎందుకు కాకూడదు? కమ్యూనిస్టులకి ఉద్యోగులు, కార్మికులు, రైతులు, రైతుకూలీలు, యువత, విద్యార్థులు, మహిళలందరిలో ఎంతోకొంత పలుకుబడి ఉంది, సభ్యులున్నారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిస్తే ఆ సంఖ్య బాగానే ఉంటుంది. నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీచేస్తున్నా, అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉమ్మడి ప్రచార కమిటీని ఏర్పాటు చేసి పనిచేయవచ్చు. కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావటానికి ఇదే మంచి అవకాశం. ముందు షరతులు లేకుండా, స్వేచ్ఛగా చర్చలు జరిపి, ఒక కూటమిగా ఈ ఎన్నికలలో పోటీచేసి పోరాడితే, తప్పక విజయవంతమౌతారు. ప్రజలకి మేలైన పాలనని అందించగలుగుతారు.

కారుమంచి విజయకుమార్

రిటైర్డ్ ఐఐటి ప్రొఫెసర్

Updated Date - Feb 02 , 2024 | 01:28 AM