Share News

లాభంలేని మూడో టీఎంసీ కోసం ముప్పైవేలకోట్లా...!?

ABN , Publish Date - May 03 , 2024 | 05:06 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలను లోపభూయిష్టంగా ప్లాన్ చేసి దిగువ బ్యారేజీ నుంచి ఎగువ బ్యారేజీలకు నీటిని ఎత్తిపోస్తూ నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఎలా ప్లాన్ చేశారో మనం ఇంతకు ముందు భాగంలో చర్చించాం....

లాభంలేని మూడో టీఎంసీ కోసం ముప్పైవేలకోట్లా...!?

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలను లోపభూయిష్టంగా ప్లాన్ చేసి దిగువ బ్యారేజీ నుంచి ఎగువ బ్యారేజీలకు నీటిని ఎత్తిపోస్తూ నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఎలా ప్లాన్ చేశారో మనం ఇంతకు ముందు భాగంలో చర్చించాం. ఈ డిజైన్‌లో మరో ప్రధాన సమస్య ఉంది. అదేమిటంటే, నీటిని ఎత్తిపోయడానికి విద్యుత్ అవసరం. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం తెలంగాణకు కచ్చితంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. కానీ నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన విద్యుత్తును తగ్గించి చౌక మార్గాన్ని పరిశీలించాలి. కనీస విద్యుత్తును వాడుతూ ఎక్కువ నీటిని ఎలా ఎత్తిపోయవచ్చనే దానిపై నిపుణులు గతంలో అనేక విధానాలు, ఆలోచనలు ఇచ్చారు. ఉదాహరణకు తుమ్మిడిహట్టి బ్యారేజీ నుంచి నీటిని పొందాలంటే మేడిగడ్డ నుంచి అవసరమయ్యే విద్యుత్ కంటే చాలా తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. అదేవిధంగా మేడిగడ్డ ప్రాంతం నుంచి నేరుగా నదీ ప్రవాహానికి లంబంగా ఉన్న లోతట్టు ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసి ఉంటే ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ కచ్చితంగా తక్కువగా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను పంపింగ్ సీజన్‌లో ఒకేసారి ఆపరేట్ చేసే అవకాశం ఉన్నందున గరిష్ఠ విద్యుత్ డిమాండ్ రోజుకు 203.02 ఎంయూలుగా ఉన్నది. 2021–22లో మొత్తం రాష్ట్రంలో సగటు రోజువారీ విద్యుత్ (రోజుకు 196.06 ఎంయూ) కంటే ఇది ఎక్కువ. ఈ ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ ఛార్జీల కింద రూ.10,374.56 కోట్లు అవసరం అవుతాయి. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో భాగంగా అనేక సంవత్సరాల పాటు ప్రతి ఏటా మరో రూ.11,000కోట్లను బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నందున ఇది రాష్ట్ర ఖజానాపై పెనుభారం.


కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చర్చించాల్సిన మరో అంశం మూడో టీఎంసీ గురించి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడో టీఎంసీ కాంపోనెంట్ ద్వారా 65 రోజుల్లో రోజుకు 3 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించింది. అసలు కాళేశ్వరం డీపీఆర్‌లో రోజుకు 2 టీఎంసీల చొప్పున 98 రోజుల పాటు మొత్తం 195 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళిక ఉంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన హైడ్రాలజీ అధ్యయనం ప్రకారం మేడిగడ్డ వద్ద 120 వరద రోజుల్లో ఎత్తిపోయడానికి నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల మేడిగడ్డ వద్ద 120 వరద రోజుల గోదావరి జలాల లభ్యతకు 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసే ప్రణాళిక సరిపోతుంది. వరద రోజుల సంఖ్య 98 రోజుల కంటే తక్కువగా ఉంటే రోజుకు 2 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ అలా కాదు. ఎత్తిపోయడానికి 120 రోజులకు సరిపడా నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల మూడో టీఎంసీ కాంపోనెంట్ అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మూడో టీఎంసీ కాంపోనెంట్ కింద గోదావరి నుంచి ఎత్తిపోసేందుకు ఈ 195 టీఎంసీలు తప్ప మరో చుక్క అదనపు నీరు లేదు. అలాగే, ఈ మూడో టీఎంసీ కాంపోనెంట్ కింద నీరు ఇవ్వడానికి అదనంగా 1 ఎకరా కూడా లేదు. కాబట్టి ఒక్క చుక్క నీటిని నిల్వ చేయకుండా, పొదుపు చేయకుండా, అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వకుండా మూడో టీఎంసీ కాంపోనెంట్‌ను ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడో టీఎంసీ కాంపోనెంట్ అమలుకు రూ.30,000 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏ లాభమూ లేకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా రూ.30,000 కోట్లు ఖర్చు చేయాలనుకుంది. ఇది సరైన ప్రతిపాదన అని ఎవరైనా అనగలరా?


కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ప్రాజెక్టు’ హోదా ఇవ్వలేదని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. కానీ వాస్తవం ఏమిటంటే ‘జాతీయ ప్రాజెక్టు’ హోదా పథకం 2014కు ముందు మాత్రమే ఉంది. 2014 నుంచి ‘జాతీయ ప్రాజెక్టు’ అనే పథకం లేదు. ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ (పీఎంకేఎస్‌వై), ‘నదుల అనుసంధానం’ వంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర పథకాలు ఉన్నాయి. ‘పీఎంకేఎస్‌వై’ కింద 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో ఉన్న ‘జాతీయ ప్రాజెక్టు’ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ‘నదుల అనుసంధానం’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుంది. పైన పేర్కొన్న ఏ పథకాన్నైనా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ పథకం కింద నిధులు కోరే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పథకం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పైన పేర్కొన్న ఏ పథకం కిందనైనా ఒక ప్రాజెక్టు పరిశీలనకు రావాల్సిన ముఖ్యమైన షరతుల్లో ఒకటి కేంద్ర జలసంఘం నుంచి పెట్టుబడి అనుమతి పొందడం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీడబ్ల్యూసీ నుంచి పెట్టుబడుల క్లియరెన్స్ పొందడంలో విఫలమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.

ట్రిబ్యునల్ తమకు కేటాయించిన గోదావరి జలాలను వినియోగించుకోని రాష్ట్రం తెలంగాణ. ముఖ్యంగా 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించడానికి బీఆర్‍ఎస్ ప్రభుత్వానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన సుమారు 980 టీఎంసీలను వినియోగించుకోవడానికి పదేళ్ల సమయం సరిపోతుంది. కానీ వారు ఈ పనిలో పూర్తిగా విఫలమయ్యారు. 2014కు ముందు తెలంగాణలో గోదావరి నదిపై ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు మాత్రమే ఉండేవి. 2014 తర్వాత ఇన్ని లోటుపాట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు క్రింద వున్న 195 టీఎంసీల్లో పది శాతం కూడా రాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌తో సమస్యలు ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పరిష్కరించలేకపోయింది. ఈ ప్రాజెక్టు ఏ ప్రత్యేక కమాండ్ ఏరియాకు సేవలందిస్తుందనే దానిపై కూడా స్పష్టతలేదు. ఈ ప్రాజెక్ట్‌లో చూపించబడ్డ కమాండ్ ఏరియా ప్రస్తుతమున్న ఇతర ప్రాజెక్ట్‌ల కమాండ్ ఏరియాతో ఓవర్‌లాప్ అయి వుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి స్పష్టత ఇవ్వడంలో విఫలమైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని ఒప్పించడంలో కూడా విఫలమైంది. ఈ అడ్డంకులను తొలగించి ఈ ప్రాజెక్టుకు ఆమోదం పొందేందుకు రాష్ట్రం ప్రయత్నించాలి.


సీతారామ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది కానీ దానికి తగిన లాభం–ఖర్చుల నిష్పత్తి (Benefit-Cost Ratio) లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు డబ్బునూ కాలాన్నీ కేవలం కాళేశ్వరం పైనే (కేవలం 195 టీఎంసీల కోసం) వెచ్చించారు. సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇచ్చంపల్లి (ఇంద్రావతి గోదావరిలో కలిసిన వెంటనే), కాంతలపల్లి వంటి ఇతర మంచి ప్రదేశాలను విస్మరించారు. సమ్మక్క సారక్క, సీతారామ డీపీఆర్‌లు సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉన్నాయి. ఈ డీపీఆర్‌లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది.


ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాలను నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం లాక్కోవడానికి కుట్ర పన్నుతోందని కొందరు అహేతుకంగా మాట్లాడుతున్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి తమిళనాడుకు నీటిని తీసికెళ్తున్నారని కేంద్రాన్ని నిందిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం కార్యక్రమం కింద తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల్లో ఒక్క చుక్కను కూడా ముట్టుకోబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవానికి గోదావరి జలాల్లో తమకు కేటాయించిన 980 టీఎంసీల వాటాను వినియోగించుకుని తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తోంది. ఈ గోదావరి –కావేరి నదుల అనుసంధాన కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నిరుపయోగంగా ఉన్న నీటిని (సుమారు 147 టీఎంసీలు) మాత్రమే వినియోగించనున్నారు. ట్రిబ్యునల్ తమకు కేటాయించిన ఈ 147 టీఎంసీల గోదావరి జలాలను ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోలేకపోతోంది. నదుల అనుసంధానం కార్యక్రమంలో ఈ జలాలను వినియోగించుకునేందుకు ఛత్తీస్‍గఢ్ సమ్మతిని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను సంప్రదిస్తోంది. గోదావరి, కావేరి నదుల అనుసంధానం వల్ల ఈ 147 టీఎంసీలు మొత్తం కావేరికి బదిలీ కావు. 20 నుంచి 30 టీఎంసీలు మాత్రమే కావేరిలోకి తీసుకెళ్తారు. మిగిలిన 120 టీఎంసీల నీటిని ఇచ్చంపల్లి నుంచి ప్రారంభమయ్యే కాలువ అలైన్‌మెంట్‌లో వినియోగించనున్నారు. కాబట్టి ఈ 147 టీఎంసీల్లో 50 శాతాన్ని తెలంగాణలోని కరువు ప్రాంతాల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరించే 90 శాతం ఖర్చుతో తెలంగాణ సుమారు 70 టీఎంసీల అదనపు గోదావరి జలాలను (వాటి కేటాయింపుల్లో భాగం కానివి) వాడుకునే అవకాశం ఉంది. ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం వల్ల దిగువన సమ్మక్క సారక్క బ్యారేజీ, ఎగువన మేడిగడ్డ బ్యారేజీ ఉనికికి ఎలాంటి ఆటంకం కలగదని ఇక్కడ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బ్యారేజీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరుపయోగంగా ఉన్న నీటిని మాత్రమే తెలంగాణకు నష్టం వాటిల్లకుండా వాడుకునే విధంగా ఇచ్చంపల్లి బ్యారేజీని కేంద్ర ప్రభుత్వం రూపొందించనుంది. అంతే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టదు. కాబట్టి గోదావరి–కావేరి నదుల అనుసంధానం అంటే తెలంగాణ నుంచి వారి గోదావరి జలాలను లాక్కోవడం కాదు, తమకు చెందని గోదావరి జలాలను తెలంగాణకు ఇవ్వడం మాత్రమే.

వెదిరె శ్రీరామ్

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు

(‘కాళేశ్వరం కహాని’ ఇంతటితో ముగిసింది)

Updated Date - May 03 , 2024 | 05:06 AM