Share News

వారిని అనర్హులుగా ప్రకటించాలి

ABN , Publish Date - May 21 , 2024 | 05:24 AM

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఆ పార్టీ నాయకులు....

వారిని అనర్హులుగా ప్రకటించాలి

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఆ పార్టీ నాయకులు దాడులు చేసారు. నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. అలా స్థానిక సంస్థలను 99 శాతం వాళ్ళే దక్కించుకున్నారు. గడిచిన ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ పాలనలో విధ్వంసం, దాడులు అరాచకాలు షరా మామూలే అనే విధంగా సాగాయి. చివరకు ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ ఆధీనంలో ఉన్నా, పోలింగ్‌ సందర్భంగా జరిగిన దాడులను చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదు. తెనాలిలో ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక ఓటర్‌ మీద దాడి చేసారు. నరసరావుపేట ఎంపీ టీడీపీ అభ్యర్థి, మాచర్ల, గురజాల టీడీపీ అభ్యర్థుల వాహనాల మీద వైఎస్సార్‌సీపీ మూకలు దాడులు చేసాయి. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ జనసేన, టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్‌ చేసారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచక ముఠాలు యధాతథంగా కొన్నిచోట్ల టీడీపీ శ్రేణుల మీద దాడులు చేశాయి. కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో కూడా కొన్నిచోట్ల టీడీపీ ఓటర్లను వైఎస్సార్‌సీపీ మూకలు భయాందోళనకు గురి చేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి స్వగ్రామం అయిన నల్లసింగయ్యగారి పల్లెలో ఉన్న పోలింగ్‌ బూత్‌లో టీడీపీ ఏజెంట్లను తరిమేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌ చేసుకున్నారు.


అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి మీద, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మీద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఇలా దాడులు చేసిన, చేయించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎన్నికల కమిషన్‌ అనర్హులుగా ప్రకటించాలని యావత్‌ ప్రజానీకం అభ్యర్థిస్తున్నది.

తిప్పినేని రామదాసప్పనాయుడు

Updated Date - May 21 , 2024 | 05:24 AM