Share News

విద్యార్థుల స్థాయికి తగ్గ పుస్తకాలు ఉండాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:08 AM

భాష, సాహిత్యం, సంస్కృతి ఈ మూడు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. కవి తన భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. అలాగే అతని చుట్టూ ఉండే సమాజం కూడా సాహిత్యంలో...

విద్యార్థుల స్థాయికి తగ్గ పుస్తకాలు ఉండాలి

భాష, సాహిత్యం, సంస్కృతి ఈ మూడు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. కవి తన భావాన్ని వ్యక్తం చేయడానికి భాష అవసరం. అలాగే అతని చుట్టూ ఉండే సమాజం కూడా సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. సమాజ ఆచరణనే సంస్కృతి. కాబట్టి సాహిత్యంలో సంస్కృతి కూడా అంతర్లీనంగా ఉంటుంది. ప్రథమ భాష తెలుగు పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు అందిపుచ్చుకుంటున్న భాషా సాహిత్యాంశాలను పరిశీలించాలి.

విద్యావిధానంలో పాఠ్యపుస్తకం ఒక ఆయుధం లాంటిది. దీనిని సమర్థవంతంగా రూపొందించి ఉపయోగించినప్పుడే దేశ భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది కనుక. పాఠ్యపుస్తకాల ప్రణాళికా సూత్రాలు విద్యార్థులకు అందాలంటే పాఠ్యపుస్తకం రచన చాలా జాగరూకతతో సాగాలి. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థి స్థాయినిబట్టి రచించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ పాఠ్యపుస్తకాలు అమలులో ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన పాఠ్యపుస్తకాలే కాకుండా ఆర్క్ బర్డ్, శ్రీరామ మొదలైన పబ్లిషర్స్ తెలుగు వాచకాలను చాలా ప్రైవేటు పాఠశాలలు అనుసరిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వ విద్యావిధానంలో నియత (ఫార్మల్‌) అనియత (నాన్‌–ఫార్మల్‌) అని రెండు పద్ధతులున్నాయి. సార్వత్రిక పాఠశాలలు (ఓపెన్‌ స్కూల్స్‌) మరో కోవకు చెందుతాయి.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆయా పాఠ్యపుస్తకాల రచయితలు రాసిన పాఠాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరు, ఏడు తరగతులలో కొన్ని ఆయా రచయితలు రాసినవి, మరికొన్ని ఇతర రచయితల రచనల నుంచి తీసుకున్నవి ఉన్నాయి. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఇతర రచయితల రచనల నుంచి తీసుకుని వాటికి అభ్యాసాలు మాత్రం పాఠ్యపుస్తక రచయితలు రాశారు. ఇవి విద్యార్థుల స్థాయినిబట్టి ఉన్నాయా? అన్నది వివాదాంశం.

తెలుగు భాష చాలా ప్రాచీనమైంది, విస్తృతమైంది. అక్షరాల సంఖ్య కూడా ఎక్కువే. నన్నయకు పూర్వం శాసనాలకే పరిమితమైన తెలుగుభాషను నన్నయ తన కాలానికి కావ్యరచనకు అనుగుణంగా ఉద్ధరించాడు. కాలానుగుణంగా భాష మారితేనే సజీవంగా ఉంటుంది. అంటే భాషకు సంకుచిత స్వభావం ఉండకూడదు. భాష తనను తాను విస్తృత పరచుకోవడానికి ఎన్నో ఇతర భాషా పదాలను తనలో చేర్చుకుంటుంది. రాజ్యం ప్రభావం కూడా భాష మీద ఉంటుంది. తొలినాళ్ళలో సంస్కృతం, బ్రిటీషర్స్ కాలంలో ఇంగ్లీషు, నిజాం రాజుల ప్రభావంతో ఉర్దూ పదాలు విడదీయరానంతగా తెలుగు భాషలో ఇమిడిపోయాయి. నన్నయ కాలం నుంచి ఆధునిక కాలం వరకు విస్తృతమైన సాహిత్యం తెలుగు భాషకు ఉన్నది. భాషాధ్యయనంలో భాగంగా సాహిత్యం కూడా విద్యార్థులకు పరిచయం అవుతుంది. సమాజంలోని వ్యక్తుల అవసరాల మేరకు వారి ఆచార వ్యవహారాలలో మార్పు అనివార్యం. ప్రాచీన కాలానికి, ఆధునిక కాలానికి సమాజంలో సంస్కృతిలో చాలా మార్పులు వచ్చాయి. భాషాశాస్త్రవేత్తల సూచనల మేరకు తెలుగు వర్ణమాలలోని కొన్ని అక్షరాలను తొలగించారు. వీటిని విద్యార్థులకు కేవలం పరిచయం చేస్తే చాలు. దీనివలన విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రాచీన భాషాధ్యయనంలో మాత్రమే ఆ అక్షరాల అవసరం ఉంటుంది. వ్యవహారంలో వాటి అవసరం అంతగా ఉండదు.

ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు పద్యభాగం, గద్యభాగం విడివిడిగా ఉండేవి. ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాలలో పద్య, గద్య భాగాలు రెండూ కలిసే ఉన్నాయి. పద్యభాగంలో ప్రాచీన, ఆధునిక కవిత్వానికి సంబంధించిన పాఠ్యాంశాలున్నాయి. నన్నయ, తిక్కన, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, పోతన మొదలైన ప్రాచీన కవులను పరిచయం చేశారు. ఆధునిక కవులలో దాశరథి, డా. సి.నారాయణ రెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ మొదలైన కవుల పాఠ్యాంశాలున్నాయి. పద్యం, వ్యాసం, కథానిక, శతకం, గేయం, గజల్, జీవితచరిత్ర మొదలైన సాహిత్య ప్రక్రియలను పరిచయం చేశారు. ప్రాచీన సాహిత్యంలో అతి ముఖ్యమైన ప్రబంధ ప్రక్రియను, ఆధునిక సాహిత్యంలోని పేరడీ, గల్పికలను మర్చిపోయారు.

ప్రస్తుతమున్న పాఠ్యపుస్తకాలలోని అభ్యాసాలు విద్యార్థి స్థాయికి మించి ఉండడం గమనార్హం. ఇంతకు మునుపు ఎనిమిదో తరగతిలో ఉన్న ఛందస్సు, సంస్కృత సంధులను ప్రస్తుతం ఆరవ తరగతిలోనే పరిచయం చేశారు. అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం తినిపించినట్టుంది ఇది. పాఠ్యపుస్తకాల రచయితలకు తరగతి గది అనుభవం కంటే ఎస్‌సిఇఆర్‌టి ఆఫీసు అనుభవమే ఎక్కువగా ఉండడం దీనికి కారణం కావచ్చు. విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు ఎవరైనా ఆరవ తరగతి విద్యార్థి మీద తమ పాండిత్యప్రకర్షను రుద్దాలని అనుకోరు. ఇకపోతే అన్ని తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించి ఇచ్చిన దాదాపు అన్ని ప్రాజెక్టులు వారి వారి స్థాయిని మించి ఉన్నాయి. ఇది కూడా విద్యార్థులతో వారికి ప్రత్యక్ష సంబంధం లేదనడానికి సాక్ష్యం. తరగతిగది బోధన, విద్యార్థులతో నిరంతరం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ఉపాధ్యాయులు పాఠ్యపుస్తక రచయితలుగా ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి.

గిరిజ పైడిమర్రి

Updated Date - Jan 11 , 2024 | 01:09 AM