Share News

బడుగుయువత భవితను మింగేసిన వైసీపీ సర్కార్

ABN , Publish Date - May 10 , 2024 | 12:55 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళ వైసీపీ పాలన సుస్థిర ఆర్థికవ్యవస్థను తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమైంది. యువతకు ఉపాధి భరోసా కల్పించగలిగిన లక్ష్యసాధన దిశగా అడుగులు కూడ వేయలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో...

బడుగుయువత భవితను మింగేసిన వైసీపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళ వైసీపీ పాలన సుస్థిర ఆర్థికవ్యవస్థను తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమైంది. యువతకు ఉపాధి భరోసా కల్పించగలిగిన లక్ష్యసాధన దిశగా అడుగులు కూడ వేయలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్‌ సిటీ ఏర్పాటులాగో, నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానిలాగో భారీ ప్రాజెక్టుల నిర్మాణమూ జరగలేదు. యువత సాధికారత కోసం ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించిన ఆనవాళ్ళూ లేవు. వారి భవిష్యత్తును మొత్తంగా అంధకారంలోకి నెట్టేసింది. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయన్నంతటి హడావిడి చేసి జగనన్న పేరిట అరకొర చిల్లర కానుకలతో సరిపెట్టేసింది. జాలరుల పగ్గాలు తెగిపోయాయి. సాలీల మగ్గాలు తుప్పుపట్టేశాయి. కమ్మరి కొలుముల్లో బొగ్గులు కరువయ్యాయి. కుమ్మరి చక్రం మీద ప్లాస్టిక్‌ పడగ విప్పింది. ముఖ్యమంత్రి జగన్ నిర్దిష్ట మానవాభివృద్ధి లక్ష్యాలతో పాలన చేయలేక పోయారనడానికి ఇవన్నీ నిదర్శనాలు. విభాగానికో అరడజను మంది చొప్పున వందల మందిని సలహాదారులుగా నియమించుకున్నప్పటికీ చివరికి ఖజానాకు కన్నం పడిందే తప్ప యువత కలలు సాకారం కానేలేదు. సమగ్ర సమృద్ధి విధానాల రూపకల్పనలో వాళ్లెవరూ భాగం కాలేకపోయారు. కేవలం వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను చూపించి నిరుద్యోగసమస్యకు అదే పెద్ద పరిష్కారం అన్నట్లుగా ప్రభుత్వం చాటుకుంది. అడపాదడపా ఏవో కొన్ని ఉద్యోగనియామకాలు తప్ప మెగా డిఎస్సీ, మెగా పోలీసు రిక్రూట్‌మెంట్‌, సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పెద్దసంఖ్యలో నియామకాలు చేపట్టలేకపోయింది. నిజానికి ఆ వ్యవస్థ ఒక ప్రహసనంగా మిగిలిపోయింది. ఈ పరిస్థితులు ప్రత్యేకించి బడుగు యువతను మరింత అగమ్యగోచరంలోకి నెట్టేశాయి. గ్రామీణ యువతీయువకుల పరిస్థితి మరింత అధ్వాన్నమైపోయింది. రాష్ట్రానికి ఒక్కకొత్త పరిశ్రమా రాకపోగా ఉన్నవి కూడా తరలిపోయాయి. ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలసబాట పట్టింది. అభివృద్ధి మీద అవగాహన, భవిష్యత్తు మీద ఆశలు కలిగిన జనం ప్రశ్నలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం పథకాల గేలం వేసింది. రాష్ట్రంలో పప్పూబెల్లాల సంక్షేమాన్ని వ్యతిరేకించి, అభివృద్ధి కావాలని ప్రశ్నించే ప్రజలే లేకుండా పోయారు. ఎవరైనా ఉన్నా వారి మీద దాడులు జరిగాయి.


ఆంధ్రప్రదేశ్‌ యువత ప్రపంచమంతా విద్యా, ఉద్యోగరంగాల్లో అవకాశాల్ని వెతుక్కుంటూ విస్తరించింది. దీని వెనుక గత ప్రభుత్వాల కృషి ఎంతో ఉంది. ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు, కంప్యూటర్‌ రంగ నిపుణులు అనేకమంది రాష్ట్రంలో పర్యటించి స్ఫూర్తి నింపారు. అవకాశాల మీద అవగాహన కల్పించారు. చైతన్యవంతుల్ని చేశారు. అయితే ఉన్నత చదువుల కోసం, లక్ష్యసాధన కోసం వలస వెళ్లిన వారిలో ధనికవర్గాలే అధికంగా ఉన్నాయి. పేద, మధ్యతరగతి, బడుగువర్గాల యువతలో ఒక్కరో, ఇద్దరో మినహా మిగిలినవారంతా ఆర్థికస్తోమత లేక ఇక్కడే ఉండిపోయారు. వీరికి రాష్ట్ర పరిధిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం తప్పనిసరి. పైగా కుటుంబసభ్యులు కూడా వీరి మీదే ఆధారపడి జీవించే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివారి భవితకు దారులు వేయడంలో, ఆర్థికంగా చేయూత అందించడంలో ప్రభుత్వం విఫలమయింది. గత మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, ఇతర అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ యువత సాధించిన విజయపరంపరను వైసీపీ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య నీరుగారిపోయింది. అధ్యాపక, ఇతర సిబ్బంది కొరతతో పారిశ్రామిక శిక్షణకేంద్రాలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు అనేకం మూతపడ్డాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకుని నట్టేట ముంచేసింది. చివరికి ఇంజనీరింగ్‌ కళాశాలలూ నిరాదరణకు గురయ్యాయి.


ఇటీవల మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్మిక, ఉపాధి సమస్యల నివేదిక 2024ను విడుదల చేసింది. అంతర్జాతీయ కార్మికసంస్థ భాగస్వామ్యంతో కలిసి రూపొందించిన ఈ నివేదిక మనదేశంలోని ఆర్థిక, కార్మిక, మార్కెట్‌, విద్య, నైపుణ్యం తదితర అంశాల గురించి చర్చించింది. దేశంలో నిరుద్యోగం సమస్య ఎక్కువగా ఉందని ఉన్నత విద్యనభ్యసించిన వారిలో ఇది మరింత ఎక్కువని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిని పరిశీలిస్తే గతంలో కంటే వెనుకబడి ఉందని తేటతెల్లమవుతుంది. ఇసుక రాజకీయంలో కూరుకుపోయి నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతినడంతో చేతివృత్తి కార్మికులు, భవననిర్మాణ కార్మికులు, వడ్రంగి, తాపీ తదితర వృత్తులవారికి పనులే దొరకడం లేదు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పులేదు. ముందు జాగ్రత్తల గురించి యోచించడం అటుంచి దీనిని చక్కదిద్దడానికి ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడ చేయలేదు. ఫలితంగా బడుగువర్గాలకు తగిన ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. పేదరికం మరింత పెరిగింది. కులాల ప్రాతిపదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందల కార్పొరేషన్లు ఈ దయనీయ పరిస్థితుల్లోనూ నిస్సహాయంగా మిగిలిపోయాయి. వీటి ద్వారా కనీసం చిన్నమొత్తాల్లోనైనా రుణాలు మంజూరు చేసి బడుగు యువతకు ప్రభుత్వం చేయూత అందించలేకపోయింది. ఉపాధికల్పన గురించి ఆలోచించకుండా ఖాతాల్లో పదేసివేలు జమచేసే పథకాల్ని రూపొందించి చేతులు దులుపుకుంది. వాటినే ఇప్పటి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పటిష్టంగా మార్చాలన్నా, పదికాలాల పాటు జనం సుభిక్షంగా జీవించాలన్నా వైసీపీ ప్రభుత్వ విధానాలు సరిపడవని మేధోవర్గం తలబాదుకుంటోంది.


రాష్ట్రంలో మానవవనరుల అభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర వహించే విశ్వవిద్యాలయాలు రాజకీయకేంద్రాలుగా మారి సామర్థ్యాలు కోల్పోయి ప్రశ్నార్థకంగా నిలిచాయి. సరైన బోధనాసిబ్బంది నియామకాలు జరగలేదు. ప్రభుత్వనేతల సిఫార్సులతో ఉపకులపతులు నియమావళిని పక్కనబెట్టి చడీచప్పుడు లేకుండా సొంతంగా నియామకాలు చేసుకున్నారు. వారిలో సగం మందికి కనీస అర్హతలు లేవు. దాంతో ధనికవిద్యార్థులు ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. సగానికి పైగా విశ్వవిద్యాలయాల్లో పాలన ప్రైవేటుపరమైపోయింది. వర్శిటీల అధికారులు కూడా ఎన్నికలసంఘానికి చిక్కని రూపాల్లో అధికారపార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకటనకు ముందే రాష్ట్రంలో అన్ని విశ్వవిశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలను అణగదొక్కి మరీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నిర్మించారు. ఇంత విఫలచరిత్ర సృష్టించుకున్న వైసీపీ ప్రభుత్వం విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మంటగలిపి బడుగుల బతుకును, భవితను మింగేసింది. గడచిన ఐదేళ్లుగా తిరోగమనబాట పట్టించిన ప్రభుత్వం స్థానంలో సమర్థప్రభుత్వం కావాలిప్పుడు. తమ జీవితాల్ని మెరుగుపరచి, యువత భవిష్యత్తుకు పూచీకత్తుగా నిలిచి, అభివృద్ధికి పట్టం కట్టే నాయకత్వం వైపే ప్రజానీకం నిలబడాలి.

డాక్టర్‌ జీకేడీ ప్రసాద్‌

Updated Date - May 10 , 2024 | 12:56 AM