Share News

పోలింగ్‌ను పోటెత్తించిన యువత, మహిళ!

ABN , Publish Date - May 24 , 2024 | 06:20 AM

లోక్‌సభకు నాలుగోదశ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కీలకఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలోని అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు...

పోలింగ్‌ను పోటెత్తించిన యువత, మహిళ!

లోక్‌సభకు నాలుగోదశ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కీలకఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలోని అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు పెద్దసంఖ్యలో బారులుతీరడం కనిపించింది. వాళ్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనే విషయం జూన్‌ నాలుగో తేదీన తెలియనుంది. అయితే పోలింగ్‌శాతం ఇంతగా పెరగడానికి, ఓటర్లు గంటల తరబడి ఓపిగ్గా క్యూలైన్‌లలో నిలబడడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.


2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజలను రాజకీయపక్షాలు ఎన్నికలమూడ్‌లోకి తీసుకెళ్లిపోయాయి. సభలు, సమావేశాలతో నిత్యం హోరెత్తించేశాయి. ఎన్నడూలేని విధంగా ఈసారి రాజకీయచర్చల్లో మహిళలు, వృద్ధులు, యువత విరివిగా పాల్గొన్నారు. మారుమూల పల్లెల్లో నిర్వహించిన సభలకు సైతం వారు తరలివచ్చారు. అలా వచ్చినవారిలో చాలామందికి ఆయా పార్టీల నేతలు ప్రోత్సాహకాలను అందించారు. సభలకు వెళ్లడంతో వారిలో రాజకీయచైతన్యం పెరిగింది. నాయకులు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విని చర్చించేవారు. గ్రామీణప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపించింది. దీనితోపాటు పత్రికలు, టీవీ చానల్స్‌తోపాటు సోషల్‌మీడియా వేదికగా వచ్చే అన్ని అంశాలను కూడ వారంతా పరిశీలించేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాన్ని కొనసాగించాలా? లేకపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలా? కేంద్రంలో ప్రధాని మోదీ సర్కార్‌ను కొనసాగించాలా? ఇండియా కూటమిని గద్దెనెక్కించాలా? తమ జీవితాలకు ఎవరు భరోసానిస్తారు? సంక్షేమపథకాలా, రాష్ర్టాభివృద్ధా, మతమా? జీవనప్రమాణాల పెరుగుదలా? ఇలా అనేక అంశాలపై వారిలో వారు చర్చించుకోవడం ఎక్కువైపోయింది. అందుకే ఈసారి ఎన్నడూ లేనివిధంగా రాజకీయసభలు విజయవంతమయ్యాయి. ఏ నాయకుడు సభ నిర్వహించినా వందలు, వేల సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇదే వాళ్లను పోలింగ్‌బూత్‌ల వైపునకు నడిపించడానికి దోహదపడింది.


మరోవైపు దేశవిదేశాల్లో ఉన్న వివిధవర్గాల ప్రజలు, యువత రాష్ట్ర రాజకీయాలపై మునుపెన్నడూ ఎరగని రీతిలో ఎంతో ఆసక్తిని కనబరిచింది. జగన్‌ సర్కార్‌ విచ్చలవిడిగా అప్పులు తెచ్చి సంక్షేమపథకాలను అమలు చేస్తూ. రాష్ర్టాభివృద్ధిని పట్టాలు తప్పించిందని వారంతా భావించారు. తమ రాజధాని ఏదో చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని మార్చేసిందని ఆవేదన చెందారు. కొద్దిపాటి వర్షానికే పాడైన రహదారులు.. చిన్నపాటి చెరువుల్లా మారడం కూడా సోషల్‌మీడియా వేదికగా రాష్ర్టాన్ని నగుబాటుకు గురిచేయడాన్ని చాలామంది తట్టుకోలేకపోయారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారని ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా బలంగా నమ్మారు. ఈ అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో తలపెట్టిన ఆందోళనలను అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ అడ్డుకోవడాన్ని అవమానంగా భావించారు. ఇలాంటి వారంతా ఎన్నికలకు మూడునెలల ముందునుంచే రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, యూరప్‌, ఆస్ర్టేలియా తదితర దేశాలనుంచీ కదిలివచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చేందుకు వందలాది బస్సులు, వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక రైళ్లు నడిచాయి. జగన్‌ సర్కార్‌ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థించే వర్గం కూడా వారికి పోటీగా మారింది. దాంతో వీరంతా రెండువర్గాలుగా చీలిపోయి పోలింగ్‌రోజు పోటెత్తారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ వారిని రప్పించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పించాయి. వరుసగా మూడురోజులు సెలవు రావడంతో చాలామంది స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. ఇది పోలింగ్‌శాతం పెరుగుదలకు దోహదం చేసింది.

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, 2024 ఎన్నికలు మరొక ఎత్తు అన్నట్టు డబ్బు వరదగోదావరిలా ప్రవహించింది. రాష్ట్రంలో పోలింగ్‌ నాలుగోదశలో జరగడంతో అభ్యర్థులకు, పార్టీలకు ఖర్చు రెండింతలు పెరిగింది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. చాలాచోట్ల అభ్యర్థులు సామాజికవర్గాల విభజన పాటించడం. ఫలానా సామాజిక వర్గం ఓట్లు తమకు పడవు అని బలంగా నమ్మినవారు డబ్బుల పంపిణీలో వారిని మినహాయించారు. దాంతో వాళ్లంతా దీన్ని తీవ్రంగా పరిగణించి తమ ప్రతాపాన్ని ఈవీఎంలపై చూపించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఓట్లశాతం పెరుగడానికి ఇది మరో కారణం.


గోదావరి జిల్లాల్లో ఇటీవలి వరకు భిన్నధ్రువాలుగా ముద్రపడిన రెండు బలమైన సామాజికవర్గాల మధ్య ఉన్న సన్ననిగీత ఈ ఎన్నికల్లో చెరిగిపోయింది. జనసేన–తెలుగుదేశం పొత్తును మొదట్లో వ్యతిరేకించిన ఆయావర్గాలు క్రమేపీ సర్దుకున్నాయి. వీరి ముందున్న సవాల్‌ ఒక్కటే.. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే జనసేనతోపాటు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రధానంగా కాపు సామాజికవర్గం ఆ పార్టీకి, పవన్‌కు అండగా నిలచి కసిగా పనిచేసింది. మరోవైపు టీడీపీని, చంద్రబాబును ఈసారి అధికారంలోకి తీసుకురాకపోతే.. రాబోయే రోజుల్లో జగన్‌ నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కమ్మ సామాజికవర్గం బలంగా విశ్వసించింది. ఈ కారణంగా దేశవిదేశాల్లో ఉన్న ఆ వర్గం గడిచిన మూడునెలలుగా ప్రత్యేక క్యాంపెయినింగ్‌ చేసింది. వారంతా పెద్దసంఖ్యలో వచ్చి ఓటేయడం పోలింగ్‌శాతం పెరగడానికి ఇంకో కారణం.

పోలింగ్‌శాతం పెరుగుదలలో వలంటీర్లు కూడా చెప్పుకోదగిన పాత్రే నిర్వహించారు. అధికారంలోకి రాగానే ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున నియమించిన వలంటీర్లను ఎన్నికల నిర్వహణలో నేరుగా వినియోగించుకుందామని జగన్‌ భావించినప్పటికి ఎన్నికలసంఘం అడ్డుపడడంతో అది సాధ్యపడలేదు. అయినప్పటికీ వేలాది వలంటీర్లతో రాజీనామాలు చేయించి, పార్టీ తరపున ప్రచారం చేయించారు. తమకు ఎవరు అనుకూలంగా ఉన్నారో వారిద్వారా గుర్తించి పోలింగ్‌బూత్‌ల వైపు నడిపించారు. ప్రతిగా తెలుగుదేశం కూటమి కూడా ఇదేస్థాయిలో ఇంటింటి ప్రచారం చేసి తమకు అనుకూలంగా ఉన్నవారిని తరలించింది.


ఓటింగ్‌శాతం పెరుగుదలకు ఎన్నికలసంఘం చేసిన కృషిని కూడా మనం చర్చించాలి. కొత్తఓటర్ల నమోదు, తొలగింపులపై అది ఈసారి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది.. పెద్దసంఖ్యలో ఉన్న దొంగఓట్లను, డబుల్‌ ఎంట్రీలను, స్థానికంగా నివాసం లేనివారు, చనిపోయినవారి ఓట్లను తొలగించింది. 2014–2019– 2024 మధ్య పెరిగిన ఓటర్లశాతంలో అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. 2014 నుంచి 2019నాటికి పెరిగిన ఓటర్లు 26,85,171 మంది కాగా, 2019 నుంచి 2024నాటికి పెరిగినవారు 19,99,887 మాత్రమే. తొలగించిన ఓట్ల కంటే పెరిగిన ఓటర్లశాతం తక్కువగా ఉంది. అనేక నియోజకవర్గాల్లో గడిచిన ఐదేళ్లలో పెరిగిన ఓటర్ల సంఖ్య రెండంకెలు కూడా దాటకపోవడం గమనార్హం. ఓటర్లజాబితాలో భారీగా అనర్హుల ఓట్ల తొలగింపుతో ఓటు వేసే వారి సంఖ్య పెరిగిందని భావించవచ్చు. అందుకే 2024 ఎన్నికల్లో 81.86 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు అర్థమవుతోంది.


2024 జనవరి 22న కేంద్ర ఎన్నికలసంఘం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. ముసాయిదా జాబితాలో ఉన్న 16,52,422 మంది ఓటర్లను ఈ జాబితాలో తొలగించారు. వీరిలో మరణించినవారు 5,86,810, ఇతరప్రాంతాల్లో ఉన్నవారు 8,47,421, పునరావృతమైన ఓటర్ల సంఖ్య 2,30,191. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 మందికి చేరింది. ఇందులో సుమారు పదిలక్షల మంది కొత్తఓటర్లు. మే 13న జరిగిన పోలింగ్‌, అంతకుముందు జరిగిన పోస్టల్‌బ్యాలెట్‌తో కలుపుకుని రికార్డుస్థాయిలో 81.86 శాతం ఓట్లు పోలైనట్టు ఎన్నికలసంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 3,33,40,560, పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు మొత్తంగా కలిపి 4.97 లక్షల మంది ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఓటర్లు 2.62 లక్షల మంది మాత్రమే. గతంలో వృద్ధులు, వికలాంగులు పోలింగ్‌బూత్‌ల వద్దకు వచ్చేందుకు ఇబ్బందులు పడేవారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇళ్ల వద్దే ఓటు వేసే అవకాశం కల్పించడం కూడ ఓటింగ్‌శాతం పెరిగేందుకు దోహదపడింది. అయితే ఓటింగ్‌ పెరగడంపై దృష్టి సారించిన ఎన్నికలసంఘం పోలింగ్‌ నిర్వహణలో విఫలమైందనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం, వీవీ ప్యాట్‌లో స్లిప్‌లు రావడానికి ఎక్కువ సమయం పట్టడంతో గంటల తరబడి ఓటర్లు క్యూ లైన్‌లలో నిలబడాల్సి వచ్చింది. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లను పెంచకపోవడం దీనికి ఒక కారణం. లేకుంటే ఓటింగ్‌శాతం మరింత పెరిగి ఉండేది.

దేవగళ్ల రామకృష్ణ

సీనియర్‌ జర్నలిస్టు

Updated Date - May 24 , 2024 | 06:20 AM