గ్రామ రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దాలి!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:35 AM
పాలకుల చదరంగంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ నేడు కనుమరుగైపోయింది. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఎక్కడో, ఎవరో అవినీతికి పాల్పడ్డారని మొత్తం వ్యవస్థే భ్రష్టు పట్టిందని 1984లో తీసుకున్న అనాలోచిత...

పాలకుల చదరంగంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ నేడు కనుమరుగైపోయింది. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఎక్కడో, ఎవరో అవినీతికి పాల్పడ్డారని మొత్తం వ్యవస్థే భ్రష్టు పట్టిందని 1984లో తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగా మొత్తం గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు బీజం పడింది. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతికి అంతులేకుండా పోయింది. కోళ్లు తినేవాళ్లు పోయి గొర్రెలు తినేవాళ్లు వచ్చిన విధంగా పరిస్థితి తయారైంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా గ్రామ రెవెన్యూ వ్యవస్థపై సరైన నిర్ణయాలు తీసుకోలేదు.
మండలాలు ఏర్పడిన తదుపరి రద్దయిన గ్రామాధికారుల నుంచి కోర్టు తీర్పులననుసరించి ఎస్‌ఎస్‌సి, ఆపై చదివిన అర్హులైన వారికి గ్రామ సహాయకులుగా ప్రతి మండలానికి నలుగురైదుగురు చొప్పున పే స్కేల్ ఇచ్చి 1987లో నియమించారు. రాష్ట్రంలో 1989 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1992లో రద్దయిన గ్రామాధికారుల నుంచి అర్హులైన మరికొంతమందిని తీసుకుని వారికి గౌరవ వేతనం ఇచ్చి, వారి వారి సొంత గ్రామాల్లోనే వీఆర్వోగా కొనసాగించారు. 1999లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2002లో ప్రతి రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలను కలిపి కొత్తగా పంచాయతీ కార్యదర్శి పోస్టు సృష్టించారు. 1992లో తీసుకున్న వీఆర్వోలకు కూడా పేస్కేల్ ఇచ్చి వారి సొంత గ్రామం నుంచి బదిలీ చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2006లో పంచాయతీ, రెవెన్యూ శాఖలను వేరు చేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక వీఆర్వోను నియమించారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం గ్రామ వీఆర్వో, వీఆర్‌ఏలను 2020లో తొలగించి గ్రామ రెవెన్యూ వ్యవస్థకు మంగళం పాడారు.
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేనందున కొండలకు, గుట్టలకు, జాతీయ రహదారులకు, ప్లాట్లుగా మార్చిన వ్యవసాయ భూములకు కూడా రైతుబంధు డబ్బులు జమచేసి సుమారు ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఊర్లోకి ఎవరైనా అధికారి వస్తే వారికి సమాచారం ఇచ్చేవారు, ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలిపేవారు, గ్రామాల్లో నేరాలు, తగాదాలు, ఎన్నికలు జరిగినప్పుడు పై అధికారులకు సమాచారం ఇచ్చేవారు, బ్యాంకు సిబ్బందికి సహకరించేవారు లేరు.
మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఒక గాడిన పెట్టాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో సమగ్రంగా ఆలోచించి, పొరపాట్లకు తావులేకుండా ఈ వ్యవస్థ పునరుద్ధరణపై సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
టి.సుదర్శనరెడ్డి, మాజీ గ్రామాధికారి