Share News

మౌన ఓటరే అంతిమ విజేత

ABN , Publish Date - May 31 , 2024 | 02:53 AM

భారతీయ ఓటర్లు ప్రస్తుత ఎన్నికల పండుగను ఎలా పాటిస్తున్నారు? చండీఘఢ్ నుంచి చెన్నై దాకా, బ్రహ్మపుత్రా పరీవాహక ప్రాంతాల నుంచి థార్ ఎడారి దాకా, కోల్‌కతా నుంచి కొచ్చిన్ దాకా...

మౌన ఓటరే అంతిమ విజేత

భారతీయ ఓటర్లు ప్రస్తుత ఎన్నికల పండుగను ఎలా పాటిస్తున్నారు? చండీఘఢ్ నుంచి చెన్నై దాకా, బ్రహ్మపుత్రా పరీవాహక ప్రాంతాల నుంచి థార్ ఎడారి దాకా, కోల్‌కతా నుంచి కొచ్చిన్ దాకా గత ఎనిమిది వారాలుగా ప్రయాణించాను. కొన్ని ప్రదేశాలకు మళ్లీ మళ్లీ వెళ్లాను. నేతలు, అభ్యర్థులతో మాటా మంతీ జరిపాను, ఓటర్లతో పిచ్చాపాటీలో పాల్గొన్నాను. కన్నవీ, విన్నవీ భారతీయ ఎన్నికల ప్రజాస్వామ్య బలాలు, బలహీనతలను వెల్లడించాయి. వాటి నుంచి అర్థం చేసుకోవల్సిన పది ప్రధాన అంశాలను సంగ్రహంగా నివేదించదలిచాను.

1) కేరళ నుంచి కశ్మీర్ దాకా 18వ సార్వత్రక సమరాన్ని నడిపిస్తున్న ఏకైక అంశం ఒకటి ఏదైనా ఉంటే అది నరేంద్ర మోదీ ప్రభావ శక్తేనని చెప్పక తప్పదు. ఈ ప్రజాస్వామిక పోరుకు ఏకోన్ముఖత కలిగిస్తున్నదీ, సాటిలేనిరీతిలో నిలకడ సమకూరుస్తున్నదీ ప్రధానమంత్రి ప్రభావ ప్రాబల్యాలే, సందేహం లేదు. ఈ ఎన్నికలను ‘అధ్యక్ష తరహా’ పోటీగా చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ‘మోదీకి గ్యారంటీ’ అనే నినాదాన్ని దేశం మీదకి వదిలింది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి (మహానేతగా ఆరాధన పొందుతున్న ఘటనా ఘటన సమర్థుడు) ప్రభావ ప్రాబల్యాల కారణంగా అధికార కూటమి ఎన్డీఏకి చెందిన 543 మంది అభ్యర్థులూ రాజకీయ వామనమూర్తులుగా మిగిలిపోయారు. బస్తీలు, పల్లెల్లో నలుగురు గుమిగూడిన ప్రతి చోటా వారి బాతాఖాని అంతిమంగా నరేంద్ర మోదీ గురించే జరుగుతోంది. ఆయనకు మరో ఐదేళ్లు అధికారం కట్టబెట్టేందుకు యోగ్యమైన రీతిలో ప్రధానమంత్రిగా గత పదేళ్ల పాటు ఆయన చేయవలసినదంతా చేశారా? అన్న విషయమై వారి తర్క వితర్కాలు జరుగుతున్నాయి. మార్పు కోసం బలీయమైన ఆకాంక్షతో 2014లోను, జాతీయ వాద భావోద్వేగాలతో 2019లోను భారతీయ ఓటర్లు మోదీని తమ ‘భాగ్య విధాత’గా ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు ఈ 18వ సార్వత్రక ఎన్నికలలో మరే అంశం కంటే మహానాయక ఆరాధనా భావమే అత్యంత ప్రాధాన్యం వహిస్తోంది! అవును, మోదీని మీరు ఆరాధించగలరు లేదా తృణీకరించగలరు.. అంతేగానీ ఆయన పట్ల ఉదాసీనత చూపేందుకు మీకు ఎలాంటి ఆస్కారం లేదు.


2) ఈ సార్వత్రక ఎన్నికలను ‘ఒకే నాయకుడు, ఒకే దేశం’ గురించిన పోరుగా బీజేపీ చేస్తే, ఈ ప్రజాస్వామిక యుద్ధాన్ని సాధ్యమైనంతవరకు ‘స్థానిక’ వ్యవహారంగా చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నించింది, కొంత మేరకు సఫలమయింది కూడా. ఈ ప్రయత్నంలో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లో పరీక్షా పేపర్లు లీక్ కావడాన్ని, ఎగుమతులపై ఆంక్షలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర నాసిక్‌లో ఉల్లి రైతుల నిరసనలను, జీఎస్టీ రేట్ల పెరుగుదలపై కోయంబత్తూరులో సూక్ష్మ పరిశ్రమల యజమానుల ఆందోళనలను ప్రతిపక్షం అస్త్రాలుగా మార్చుకుంది. అయితే ఈ సువిశాల వైవిధ్య దేశంలో ఒక ఏకత్వానికి ప్రయత్నించడంలో ఉన్న పరిమితులను ఈ ఎన్నికలు విస్పష్టంగా చూపాయి. తుది ఓటులో చీలిక తక్కువగా ఉండవచ్చునేమో గానీ, వీథుల్లో ఎన్నికలకు సంబంధించిన లోకాభి రామాయణంలో ఆరోగ్యకరమైన అభిప్రాయ బహుళత్వం బాగా వ్యక్తమవుతోంది.


3) ఎన్నికల ప్రధాన అంశంగా ‘ఆశాభావ’ రాజకీయాల స్థానంలోకి ‘భయ’ కారక రాజకీయాలు వచ్చాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిమ్ లీగ్ మేనిఫెస్టోలా ఉందని ఎత్తి పొడవడం ద్వారా ప్రధానమంత్రే స్వయంగా ఈ వ్యతిరిక్త ప్రచార ధోరణిని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ వారు అధికారానికి వస్తే హిందూ స్త్రీల మంగళసూత్రాలను సైతం లాక్కుంటారని, ఓట్ల కోసం ముజ్రా నృత్యాలు చేస్తున్నారనే గర్హనీయ వ్యాఖ్యలను ముతకభాషలో చేయడం అల్ప సంఖ్యాక వర్గమైన ముస్లింల పట్ల అధిక సంఖ్యాక వర్గమైన హిందువులలో దురభిప్రాయాలు, అపోహలను పెంపొందించడానికే అన్నది స్పష్టమే. నిజానికి ఓటర్లను ఆకట్టుకునేందుకు ముస్లింలను విమర్శించడమే ప్రధాన కార్యక్రమంగా ఉన్న పార్టీ ఆ మతస్థుల గురించి చేసిన తాజా వ్యంగ్య దూషణలు ఆశ్చర్యం కలిగించవు. కాకపోతే ప్రధానమంత్రే స్వయంగా అటువంటి వ్యాఖ్యలు చేయడమే తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్ సైతం ‘సంవిధాన్ ఖత్రే మే హై’ (రాజ్యాంగం ప్రమాదంలో పడింది) అని ఓటర్లను హెచ్చరించింది. బీజేపీ మళ్లీ అధికారానికి వస్తే రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తుందని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉపయోగిస్తున్న కుల-మత పాచికలు అంతిమంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయో నిశ్చితంగా చెప్పలేము కానీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఉద్దేశిస్తున్న భావోద్వేగ పూరిత ప్రకటనలు టీవీ స్టూడియోలలో కంటే బస్తీలు, పల్లెల్లో చాలా తక్కువ ప్రభావాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి.


4) ‘గ్యారంటీ’ల కోసం పోరాటం ఎన్నికల రాజకీయాలు అంతకంతకూ సంతరించుకుంటోన్న వ్యాపార లావాదేవీల స్వభావాన్ని బహిర్గతం చేస్తోంది. ‘ఉచితాలు’ ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం దోహదం చేయవని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే పేదరికం అంచుల్లో జీవిస్తున్న ఎంతో మంది అభాగ్యులకు తమ బ్యాంక్ ఖాతాలో రూ. 500 జమ కావడం లేదా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇతోధిక మేలుగా పరిగణిస్తున్నారు.

5) ‘వికాస్’ (అభివృద్ధి)ను వర్గం, భౌగోళికత అద్దం ద్వారా చూస్తున్నారు పట్టణవాసులు అయిన మధ్యతరగతి ప్రజలను నాలుగు లేదా ఆరు వరుసల హైవేలు అలరిస్తుండగా గ్రామీణ రహదారులు చురుగ్గా నడవడానికి సైతం అనువుగా లేని దుస్థితి కనిపిస్తోంది. నగర ప్రాంతాలలో సంపద సృష్టికి కొత్త కొత్త ప్రయత్నాలు జరుగుతుండగా గ్రామీణ భారతంలో అటువంటి వాటికి ఆస్కారం లేని పరిస్థితి ఉన్నది. ఆస్తిపరులు దుబాయ్‌లో గోల్డెన్ వీసాకు ఆరాటపడుతుండగా ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంతాలలో రైతులు ‘ఆవారా పశు’ (దారితప్పిన పశువులు) సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. సంపన్నులు మరింత సంపద్వంతమైన జీవనశైలులకు ఆరాటపడుతుండగా పేదలు జీవనాధార సమస్యలతో సతమతమవుతున్నారు.

6) నాయకులు, పౌరుల మధ్య సంబంధ రాహిత్యం మరింతగా పెరిగింది. ‘ఎర్ర దీపం’ అంబాసడర్ కారు స్థానంలో పెట్రోల్‌ను అమితంగా తాగివేసే ఎస్‌యువి కార్లు వచ్చాయి: పెద్ద పెద్ద కారుల కాన్వాయ్‌లో నాయకులు, వారి అనుచరులు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్నారు. అలా వచ్చి ఇలా చూసి అలా వెళ్లిపోవడం మామూలైపోయింది. సగటు నేత ప్రజలకు సుదూరంగా ఉంటున్నాడు. ఎవరికీ అందుబాటులో ఉండకపోవడమే తమ అధికార ప్రాభవానికి చిహ్నంగా నేతలు భావిస్తున్నారు. నాయకుల ఈ ధోరణితో వారు తమకు ఏదో చేస్తారనే భ్రమలు ఓటర్లకు పూర్తిగా తొలగిపోయాయి.


7) రాజకీయాలు ఇంకెంత మాత్రం ప్రతిభావంతులను, సజ్జనులను ఆకర్షించడం లేదు. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ కావడం అంత తేలిక వ్యవహారం కాదు. అవ్వాలని ఆశిస్తున్న వారు, అయినవారు నిరంతరమూ ఎన్నో డిమాండ్లను ఎదుర్కోవలసివస్తోంది. మన ప్రజా ప్రతినిధులలో ప్రతిభా పాటవాల లోటు బాగా ఉన్నది. నాయకులూ ఎంతకూ స్వీయాధిపత్యానికే ఆరాటపడడం లేదా సొంత సంపదలు పెంచుకోవడానికే ప్రాధాన్యమివ్వడం వల్ల ‘నేతా గిరి’పై ప్రజల్లో సదభిప్రాయం పూర్తిగా సమసిపోయింది. ఇదొక చేదు వాస్తవం. ప్రజల జీవితాలలో మౌలిక మార్పులు తీసుకురాగల నాయకులు సకృత్తుగా మాత్రమే ఉన్నారు.

8)ఇప్పుడు ఊరూ, వాడా పట్టణం, నగరంలో ఒక కొత్త ‘MY’ ప్రభావశీలంగా ఉన్నది. ఇది ముస్లిమ్ యాదవ్ వర్గాల సమ్మేళనం కాదు; అది మహిళ, యువత సమైక్య శక్తి. ఈ రెండు జన సముదాయాలు 2024 ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తులుగా ఉండనున్నాయి. పురుషుల ప్రాబల్యంలో ఉన్న మహిళల వాణి ప్రభావవంతంగా విన్పించడం తక్కువే కావచ్చు కాని ఇప్పుడు వారు మున్నెన్నడూ లేని రీతిలో మార్పుకు దోహదం చేసే శక్తులుగా ఉన్నారు. మహిళా ఓటర్లే సంక్షేమ పథకాల ‘లాభార్థి’ నియోజకవర్గంలో ప్రధానమైనవారు నేరుగా నగదు బదిలీలు, ఇతర ప్రత్యక్ష ప్రయోజనాలకు వారు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. యువ ఓటర్లు అశాంతితో ఉన్నారు. ఎన్నికల హామీలను వారు విశ్వసించడం లేదు. తమ రాజకీయ ఎంపికల విషయంలో ప్రయోగాలు చేసేందుకు వారు సుముఖంగా ఉన్నరు. ఈ ఎన్నికల సందర్భంగా వీథులలో వినిపిస్తున్న విభిన్నాభిప్రాయాలు యువజనులవి కావడంలో ఆశ్చర్యమేముంది?


9) ఈ రాజకీయ పోరులో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. 2019 సార్వత్రకం భారతదేశ మొట్ట మొదటి వాట్సప్ ఎన్నికలు కాగా 2024లో యూట్యూబ్ వీడియోల, ఇన్‌స్టా రీల్స్ కీలక ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రతి మొహల్లాలోను యువజనులు తమ స్మార్ట్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ, సందేశాలు చదువుతూ వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నారు.

10) రాజ్యాంగ విహితమైన ప్రజాస్వామ్యం బలహీనపడినట్టు కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల ప్రజాస్వామ్యం మొద్దు బారలేదు, మందకొడి కాలేదు. 18వ లోక్‌సభ ఎన్నికలలో పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య ఊహించిన దాని కంటే తీవ్రమైన పోటీ చోటుచేసుకున్నది. ప్రతిపక్షం దృఢ స్వరంతో మాట్లాడింది. దేశసమస్యలు, వాటి పరిష్కారం గురించిన కథనంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. ప్రతిపక్షం కథనానికి ప్రతిస్పందించడం పెత్తందారీ పోకడల ప్రభుత్వానికి అనివార్యమయింది. తద్వారా ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను విపక్షమే నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసింది. సంస్థాగత అధికారాలను ఉపయోగించుకోవడంలోనూ, ఆర్థిక వనరుల లభ్యతలోనూ పాలక, ప్రతిపక్షాలకు సమ అవకాశాలు లేకపోవచ్చు గానీ ఓటర్లకు ఆయా పార్టీలు, వాటి మానిఫెస్టోల విషయమై గట్టి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఎవరి వాదనలతోను ప్రభావితం చెందకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల వివేచనా శక్తి వారికి ఉన్నది. కనుకనే రాజకీయ పక్షాలను, వాటి అభ్యర్థులను ఆశ్చర్యపరచగల, కలవరపరచగల అపరిమిత సామర్థ్యం వర్తమాన భారతీయ ఓటర్లకు ఉన్నది. ముఖ్యంగా, ఓటు వేసేదాకా మౌనంగా ఉన్న ఓటర్‌దే అంతిమ విజయం కావచ్చు. జూన్ 4న స్పష్టమయ్యే సత్యమిదే.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్ )

Updated Date - May 31 , 2024 | 02:53 AM