Share News

రామాలయ పునరుద్ధరణ కథలో ‘రెండవ రామదాసు’

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:57 AM

అది 1961. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో కల్లూరి చంద్రమౌళి దేవాదాయ శాఖ మంత్రి. బ్రహ్మానందరెడ్డి గారి క్యాబినెట్‌లో రెండు గ్రూపులు ఉండేవి....

 రామాలయ పునరుద్ధరణ కథలో ‘రెండవ రామదాసు’

అది 1961. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో కల్లూరి చంద్రమౌళి దేవాదాయ శాఖ మంత్రి. బ్రహ్మానందరెడ్డి గారి క్యాబినెట్‌లో రెండు గ్రూపులు ఉండేవి. ఒక దానికి నీలం సంజీవరెడ్డి నాయకత్వం వహిస్తే, రెండవ గ్రూపునకు దామోదరం సంజీవయ్య నాయకత్వం వహించేవారు.

హైదరాబాద్‌ స్థాయిలో నీలం సంజీవరెడ్డి గ్రూపునకు అల్లూరి సత్యనారాయణ నాయకత్వం వహించేవారు. కల్లూరి చంద్రమౌళి సంజీవయ్య గ్రూపులో ఉండేవారు. ఆయన 1961 లో దేవాదాయ శాఖ మంత్రిగా భద్రాచలం వచ్చారు. అప్పటి భక్త రామదాసు 265 ఏళ్ల కింద కట్టిన దేవాలయం శిథిలావస్థలో ఉన్నది. భద్రాచల పురప్రముఖులు, భక్తులు ఆయనను కలసి, ఆలయ పునరుద్ధరణ చేపట్టమని ప్రార్థించారు.

దేవాలయంలో నిధులు లేవు. ఆదాయం కూడా తక్కువ. రాముడు శాంతమూర్తి. వేంకటేశ్వరస్వామికి భయపడినట్టు భక్తులు రాముడికి భయపడరు. తిరుపతి హుండీలో నోట్ల కట్టలు పడితే, భద్రాచలం హుండీలో చిల్లర డబ్బులు పడతాయి. దేవాలయ నిర్మాణం చేయాలంటే చాలా ధనం కావాలి. ప్రభుత్వ ధనం ఖర్చు చేయడానికి వీలులేదు. కాని, భద్రాచల రామాలయ పునర్నిర్మాణం కోసం కల్లూరి చంద్రమౌళి ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. వెంటనే కార్యాచరణకు నడుం బిగించారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రామభక్తులు. తమ ఆరాధ్యదైవం రామునికి ఆలయం పునర్నిర్మించుకోలేరా? చంద్రమౌళి ఒక మంత్రిగా కాక, ఒక రామభక్తునిగా ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి దేవాలయానికీ తిరిగి, రామాలయ పునరుద్ధరణకు, విరాళాలు వసూలు చేయసాగారు. మీరు వింటే ఆశ్చర్యపోతారు. 1962లో భద్రాచల రామాలయ పునరుద్ధరణకు, ఆంధ్రదేశ ప్రజలు, దేవాలయాలు 22 లక్షల రూపాయల విరాళాలను వితరణగా సమర్పించారు. అంటే ఇప్పటి లెక్కలో 100 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భద్రాచల రాముడంటే అంత భక్తి!

మరి దేవాలయం తిరిగి కట్టాలి కదా! అది ఆషామాషీ విషయం కాదు. మంత్రి గారు చాలా మంది పండితులతో ఆలోచనలు చేశారు. వారంతా చెప్పిందేమిటంటే మీరు ఆగమ శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి, దేవాలయం ఏ విధంగా కడితే బాగుంటుంది, గర్భాలయ కొలతలెంత, అర్ధ మంటపము, మహామంటపములు ఎంత ఉండాలి, దేవాలయ గోపురం ఎంత ఉండాలి, వగైరాలు నిర్ధారణ చెయ్యాల్సి ఉంటుంది అని సలహా ఇచ్చారు. ఆ విధంగా చంద్రమౌళి మంత్రి హోదాలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆగమ పండితులతో సమావేశమయ్యారు. భద్రాచల రాముడు స్వయంభూ. విగ్రహాన్ని కదిలించడానికి వీలులేదు. రోజూ జరిగే నిత్యపూజలు, అభిషేకాలు నైవేద్యాలకు ఆటంకం కలగడానికి వీలులేదు. అందుకని దేవుని విగ్రహాల చుట్టూ టెంపరరీగా షెల్టరు కట్టి, రోజువారి కార్య్రకమాలను ఆచరించాలి.

భద్రాచల రాముడి మూలవిరాట్టు ఎత్తు రెండు అడుగుల ఒక అంగుళం. కావున గర్భాలయ లోపలి కొలతలు విగ్రహానికి నాల్గింతలు అంటే ఎనిమిది అడుగుల నాలుగు అంగుళాలు ఉండాలి. ఇది ఆగమశాస్త్రంలో నిర్దేశించబడిన నిబద్ధత.

దేవాలయం మొత్తం నిర్మాణం రాతి శిలలతో, శిల్పులతో చోళ సంప్రదాయంలో నిర్మించాలి. అప్పటికే కంచిపుర వాస్తవ్యుడైన గణపతి స్థపతిని పిలిపించి దేవాలయ స్థపతిగా నియమించారు. దేవాలయ కట్టడానికి ముందు పాత దేవాలయాన్ని పడగొట్టాలి కదా. రామదాసు కట్టిన దేవాలయ కొలతలు రికార్డులో నిక్షిప్తపరచడానికి అప్పటి ప్రభుత్వ ఆర్‌ అండ్‌ బి డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఒక ముస్లిం సూపర్‌వైజరును దేవాలయానికి పిలిపించారు. అయితే ఆయనను అర్చకులు గర్భగుడిలోకి రానీయలేదు. దాంతో ఆయన టేపు ఇచ్చి అర్చకులనే కొలతలు చెప్పమన్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే టేపు రింగు ఒక అంగుళం ఉంటుంది. ఇది అర్చకులకు తెలియదు. రింగులో వేలు దూర్చి, రామదాసు కట్టిన గర్భాలయం కొలతలు ఏడు అడుగుల పదకొండున్నర అంగుళాలుగా చెప్పారు. ఆ ముస్లిం సూపర్‌వైజరు ఆ కొలతలనే నోటు పుస్తకంలో నోట్‌ చేసుకున్నారు. తర్వాత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామ విగ్రహాలు చుట్టూ ఇనుప రేకులతో షెడ్డు ఏర్పాటు చేసి దేవాలయాన్ని కూలగొట్టారు. ఆ ముస్లిం సూపర్‌వైజర్‌ నోట్‌ చేసిన కొలత తప్ప భక్త రామదాసు కట్టిన గుడి కొలతలు ఎక్కడా లేవు.

భద్రాచలంలో గోదావరి ఒడ్డున శిల్పినగరు ఏర్పాటు చేసి 400 మంది శిల్పులకు షెడ్లు వేయించి, దేవాలయం నిర్మాణం ప్రారంభించారు. పర్ణశాల వద్ద ఉన్న బండిరేవు క్వారీని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించే శిలలుగా సెలక్టు చేసి, శిల్పినగరులో శిల్పులు, గణపతి స్థపతి ఆధ్వర్యంలో పని ప్రారంభించారు. సంవత్సరం గడిచిపోయింది. దాదాపు నాలుగు లక్షల వరకు వ్యయమైంది. శిల్పులు, వాళ్లు తయారుచేసిన కుడ్యపు శిలలను భద్రగిరి మీదకు తరలించి గుడి కట్టడం మొదలుపెట్టారు.

ఇక్కడ హైదరాబాద్‌లో వేడి మొదలైంది. సంజీవయ్య వర్గీయుడైన చంద్రమౌళికి పేరు రావడం బ్రహ్మానందరెడ్డి వర్గీయులకు కంటగింపు అయింది. వారు వెంటనే ఒక మీటింగు పెట్టి, బ్రాహ్మణ కులస్థుడైన నీలంరాజు వెంకట శేషయ్య, భాట్టం శ్రీరామమూర్తి, ముక్కు శర్మ ఇంకా కొంతమందిని సంప్రదించి, మీ కులస్తుడైన భక్త రామదాసు కట్టించిన రామా లయాన్ని, ఒక శూద్ర కులస్తుడైన (కమ్మ) చంద్రమౌళి కూలగొట్టి మళ్లీ కట్టడమేంటి, మీరందరూ ఏం చేస్తున్నారని ఎగదోశారు. ఇది రాజకీయ ఎత్తుగడ. బ్రాహ్మణ కులస్తులైన కొంతమంది పెద్దలు భద్రాచలం వచ్చి మీటింగులు పెట్టుకుని, ఏదైనా తప్పు దొరుకుతుందా అని ఎంక్వయిరీ చేయసాగారు. అప్పుడు వారికి ఎవరో గిట్టనివారొచ్చి, రామదాసు కట్టిన గుడి కొలతలు మార్చి చంద్రమౌళి సొంత కొలతలతో గుడి కడుతున్నారని, గర్భాలయ కొలత (7'–11 1/2'') బదులు (8'–4'') పెట్టి కొలతలు మార్చేశాడని ఏగదోశారు. నిప్పు రాజుకుంది.

మరునాడు పేపర్లలో భద్రాచల రామాలయ గర్భాలయ కొలతలు మార్చి కడుతున్నారని, భద్రాచలం నుంచి రాముడు వెళ్లిపోయాడని, గుడి అపవిత్రమవుతున్నదని పెద్ద హెడ్డింగులతో ప్రచురించారు. భద్రాచలంలోని కమర్షియల్‌ టాక్స్‌లో పనిచేస్తున్న ఒక బ్రాహ్మణునితో శిబిరం వేయించి, నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది. సత్యాగ్రహ శిబిరానికి నలుమూలల నుంచి భక్తులు వచ్చి సత్యాగ్రహంలో పాల్గొనసాగారు. అగ్గి రాజుకుంది. మంటలు రాజధాని హైదరాబాద్‌ వరకు పాకాయి. ఒక వర్గం వారు అనుకున్న కార్యక్రమం నెరవేరింది.

వెంటనే ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, చంద్రమౌళిని ఆఫీసుకు పిలిపించుకుని ‘ఏమిటీ గందరగోళం, ఈ గొడవ ఢిల్లీ వరకు పోయేట్టున్నది. దీనికి వివరణ కావాలి’ అని కోరారు. దానికి చంద్రమౌళి ‘అయ్యా ముఖ్యమంత్రిగారు, శిథిలావస్థలో ఉన్న భద్రాచల రామాలయాన్ని పునర్నిర్మించడానికి నేను ప్రభుత్వం మీద భారం పడకుండా భక్తుల విరాళాలతో పని ప్రారంభించాను. ఇందుకు ఆగమ శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి, శాస్త్ర ప్రకారం నిర్దేశించిన విధంగా దేవాలయ నిర్మాణం జరుగుతోంది. గణపతి స్థపతి 400 మంది శిల్పులతో నిర్మాణం కొనసాగిస్తున్నారు. మీరు ఏ ఎంక్వయిరీ వేసుకున్నా నేను బద్ధుడనై ఉంటాను’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి ‘ఈ విషయాన్ని కంచి పీఠాధిపతికి ప్రభుత్వం తరఫున నివేదిస్తాను. ఆయన నిర్ణయానికి మనం బద్ధులమై ఉందాం’ అని ముగించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం విషయం మీద కంచి పీఠాధిపతికి ఒక సమగ్ర నివేదికను పంపింది. అప్పటికే బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కంచికి చేరుకున్నారు. అప్పుడు కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామివారు. ఆయన శాస్త్రాలన్నీ పరిశీలించారు. ఆగమ శాస్త్ర ప్రకారం మూలవిరాట్టు ఎత్తుకు నాలుగు రెట్లు అంటే 8'–4'' కట్టడం శాస్త్ర సమ్మతం. కాని రామదాసు గారు కట్టిన ఆలయం 7'–11 1/2'' కొలతలు అంటున్నారు. ఆయన బాగా ఆలోచించి తన జడ్జిమెంటు ఇచ్చారు. ‘భద్రాచల రామాలయం ఇప్పుడు కడుతున్న కొలతల ప్రకారం (8'–4'') ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్ర సమ్మతమే. కాని భక్త రామదాసు గారు పెట్టిన కొలతల ప్రకారం కడితే బాగుండేది’. కంచి స్వామివారి ఈ నిర్ణయం కల్లూరి చంద్రమౌళికి శరాఘాతంలా తగిలింది. ముఖ్యమంత్రికి పన్నీరు పోసినట్టయింది. వెంటనే చంద్రమౌళి మంత్రి పదవికి రాజీనామా చేసి, హైదరాబాద్‌ వెళ్లిపోయి అక్కడ తన పూర్వీకుల ఇంట్లో రాజకీయాలతో తెగతెంపులు చేసుకుని నివసించసాగారు.

కాని ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. రామదాసు గారు ఆగమశాస్త్ర నిబద్ధతతకు వ్యతిరేకంగా 7'–11 1/2'' ప్రకారం దేవాలయం ఎందుకు కట్టారు? అదే వివరిస్తాను. రామదాసు కూడా దేవాలయాన్ని 8'–4'' కొలతలతోనే కట్టారు. కాలక్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన మార్వాడీ భక్తులు, గర్భాలయంలో గోడలకు గ్లేజ్‌డ్‌ టైల్సు తమ సొంత ఖర్చుతోవేయించారు. అందువల్ల లోపలి కొలతలు తగ్గిపోయాయి. అంతేకాక అర్చకులు టేపులో రింగును 1'' కింద లెక్కలోకి తీసుకోలేదు. ఈ వివాదం వల్ల ఒక నిబద్ధత గల రాజకీయవేత్త భక్త రామదాసుగారిలా పదవిని, ప్రతిష్ఠను కోల్పోవలసి వచ్చింది.

నేను భద్రాచలంలో సైటు ఇంజనీరుగా జాయిన్‌ అయిన సంవత్సరం తర్వాత, హైదరాబాద్‌లో పీవీ నర్సింహారావుగారి చాంబరులో సెక్రటేరియట్‌లో మీటింగు జరిగింది. అప్పుడు పీవీ గారు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, కొండా వాసుదేవగారు ఎండోమెంటు కమిషనరు, భద్రాచల ఉద్ధరణ సంఘం అప్పటి కొత్త చైర్మన్‌ లక్కినేని నర్సయ్యగారితో సహా సభ్యులందరూ హాజరయ్యారు. దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు మాదిరెడ్డి మాధవరావుగారితో సహా నేను కూడా హాజరయ్యాను. దేవాలయ గర్భాలయం 8'–4''తో తయారైంది. దాని లోపల మార్బులు స్టోన్సు తెప్పించి 7'–11 1/2'' కొలతలకు లోపల అతికిస్తే సమస్య తీరిపోతుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు రాజస్థాన్‌ మక్రానా నుంచి తెల్లని శ్రేష్ఠమైన మార్బుల్‌ పలకలు తెప్పించి గర్భాలయంలో 7'–11 1/2'' కొలతలకు సరిపడా నేను దగ్గరుండి అతికించాను. ఆ విధంగా ఆ వివాదాన్ని అధిగమించాం.

కొప్పుల ప్రకాశం

(రిటైర్డు ఇంజనీరు, హైదరాబాద్)

Updated Date - Apr 16 , 2024 | 03:57 AM