Share News

అన్నంపెట్టిన పథకం అక్రమార్కుల పాలు!

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:38 AM

పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేనప్పుడు రాజకీయాలు ఎందుకంటూ– ఎన్‌.టి. రామారావు 1983 జూలై 6న రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రారంభించడం అప్పట్లో ఒక సంచలనం. ఈ రెండు రూపాయలు బియ్యం పథకంతో...

అన్నంపెట్టిన పథకం అక్రమార్కుల పాలు!

పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేనప్పుడు రాజకీయాలు ఎందుకంటూ– ఎన్‌.టి. రామారావు 1983 జూలై 6న రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రారంభించడం అప్పట్లో ఒక సంచలనం. ఈ రెండు రూపాయలు బియ్యం పథకంతో ఎన్‌టీఆర్‌ను పేద ప్రజలు దేవుడుగా కొలిచారు. ఆ రోజుల్లో వరి అన్నాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అందరూ తినే పరిస్థితి లేదు. పల్నాడులో, రాయలసీమ చాలా జిల్లాల్లో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు, సజ్జలు, కొర్రలు తినేవారు. అందరికీ వరి అన్నం లభించాలనే ఉద్దేశంతో ఎన్‌టీఆర్‌ ఆ రోజున ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ఇప్పటికి 42 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకాన్ని తీసే సాహసం రాష్ట్రంలోని ఏ ప్రజా ప్రభుత్వమూ చేయలేదు. యావత్ దేశాన్నీ ఆకర్షించిన ఈ పథకాన్ని వివిధ రాష్ట్రాలు అనుసరించాయి.


కానీ నేటి రోజుల్లో ఏ స్కాం చూసినా బియ్యం చుట్టూ తిరుగుతున్నది. బియ్యం కోసం కాకుండా కేవలం ప్రభుత్వ పథకాల కోసమే తెల్లరేషన్‌ కార్డులు పొందుతున్నవారు ఆ బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇప్పటికీ తెల్లరేషన్‌ కార్డే ప్రామాణికం అని, తెల్లకార్డు లేదంటే అన్ని పథకాలు రద్దవుతాయని చాలామంది లబ్ధిదారుల్లో ఆందోళన ఉంది. చాలా పథకాలకు రేషన్‌ కార్డుతో సంబంధం లేదని అధికారులు చెబుతున్నా అంతిమంగా ఆ కార్డునే లెక్కలోకి తీసుకుంటున్నారు. బియ్యం తీసుకోపోతే కార్డు రద్దవుతుందనే భయంతోనే చాలామంది లబ్ధిదారులు వారికి అవసరం లేకున్నా బియ్యం తీసుకొని అది బ్లాక్‌మార్కెట్‌కి తరలిపోవడానికి కారణమవుతున్నారు. రేషన్ బియ్యం తీసుకునే వాళ్లలో సుమారు సగం మంది వాటిని కిలో రూ.15–18కి హోటళ్లకు, వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వాళ్లు మళ్ళీ దళారులకు రూ.25కు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. పెద్దమొత్తంలో బియ్యాన్ని పోగు చేసి క్వింటాళ్ల లెక్కన తిరిగి రైస్‌ మిల్లులో రీసైక్లింగ్‌ చేసి (పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్పించి) నేరుగా కాకినాడ వంటి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. ఈ విధంగా పేదల కోసం ప్రభుత్వాలు పంపిణీ చేసే ఉచిత బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. కాకినాడ వంటి పోర్టులు కేంద్రంగా వేల టన్నుల పీడీఎస్‌ (ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం నౌకల ద్వారా విదేశాలకు తరలిపోతోందంటూ వచ్చిన ఆరోపణల దృష్ట్యా పేదలకు పంచే ఈ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధన కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. మొన్న కాకినాడ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న కొన్ని వందల టన్నుల పేదల బియ్యాన్ని కలెక్టర్ పట్టుకోగా, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లయ్‌ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ వెళ్లి తనిఖీ చేశారు. అలానే మాజీ మంత్రుల గోడౌన్‌లో కూడా పట్టుకున్న పరిస్థితి. లోపభూయిష్టమైన ఈ పథకం వలన కొన్ని వేల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. అసలు బియ్యం పథకం ఉన్నది పేదలకు ఇవ్వడానికా ఎగుమతులు చేయడానికా అనే స్థితికి ఈ పథకం చేరింది. పేద ప్రజల కోసం పెట్టిన ఈ పథకం ఇలా రంగు మార్చుకుని అవినీతికి ఆలవాలంగా మారిపోవడం బాధాకరం.


గత ప్రభుత్వ హయాంలో డీలర్ల వ్యవస్థను పక్కనపెట్టి ఇంటి వద్దకే మొబైల్‌ డిస్పెస్సింగ్‌ యూనిట్‌ (ఎండియుల) ద్వారా బియ్యం పంపిణీ చేసే కొత్త వ్యవస్థకు తెరలేపి, కొంతమంది మధ్యవర్తులు, ఎండియుల ద్వారా అక్రమ రవాణా జరిపారని విమర్శలు ఉన్నాయి. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో సుమారు 6.43 లక్షల క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది.

గడచిన 42సంవత్సరాల చంద్రబాబు హయాంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగినటువంటి గొప్ప సంస్కరణ– ప్రజా పంపిణీ వ్యవస్థని ePOS మెషిన్ ద్వారా ఇచ్చి, ముఖ్యంగా మరణించిన లబ్ధిదారులను, నకిలీ లబ్ధిదారులను గుర్తించి, కొంతమంది డీలర్ల ద్వారా జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం. కానీ ఇప్పుడు కొంతమంది ఉచిత బియ్యం అవసరం లేని లబ్ధిదారులే ఈ బియ్యం అడ్డదారులు తొక్కడానికి పరోక్ష కారకులు అవుతున్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం, రేషన్‌ బియ్యం అనేది లేకుంటే మార్కెట్‌లో బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కేజీకి రూ.43 వరకు వెచ్చించి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంటే, రాష్ట్రంలో ఎక్కువ శాతం లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని వాడకుండా, బియ్యాన్ని దోశల్లోకి, బియ్యపు పిండికి, కోళ్లకి దాణాగా అధికంగా వాడుతున్నారు. పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం పథకంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ దేశంలో పేదవాడికి వరమైన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా అరికట్టవలసిన అవసరం చాలా ఉంది. రాష్టంలో నాలుగు దశాబ్దాల పైబడి అమలవుతున్న బియ్యం పథకంపై సమీక్ష, చర్చ జరిపి పరిష్కారం కనుక్కోవడం అత్యవసరం. ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ‍సారథ్యంలోనే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం.

యార్లగడ్డ వెంకట్రావ్

ప్రభుత్వ విప్ & గన్నవరం శాసనసభ్యులు

Updated Date - Dec 31 , 2024 | 12:38 AM