విగ్రహాల రాజకీయ వలలు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:51 AM
‘తెలంగాణా తల్లి’ విగ్రహం మీద, అధికార పార్టీ వారూ– ప్రతిపక్ష పార్టీల వారూ చేస్తున్న ఆర్భాట కార్యక్రమాలు ఇన్నీ అన్నీ కావు. ‘తెలంగాణా తల్లికి, మా పార్టీయే ముద్దు బిడ్డ!’ అని ఒకరంటే, ‘మీ పార్టీ కాదు...
‘తెలంగాణా తల్లి’ విగ్రహం మీద, అధికార పార్టీ వారూ– ప్రతిపక్ష పార్టీల వారూ చేస్తున్న ఆర్భాట కార్యక్రమాలు ఇన్నీ అన్నీ కావు. ‘తెలంగాణా తల్లికి, మా పార్టీయే ముద్దు బిడ్డ!’ అని ఒకరంటే, ‘మీ పార్టీ కాదు, మా పార్టీయే!’ అని మరొకరూ! ప్రకటనలూ, పాలాభిషేకాలూ, భారీ బహిరంగ సభలూ! ‘మా విగ్రహం తెలంగాణా ఆత్మగౌరవానికీ, అస్తిత్వానికీ ప్రతీక’ అని ఒక పార్టీ అంటే, ‘మీ విగ్రహం తెలంగాణా ఆత్మగౌరవం మీదా, అస్తిత్వం మీదా, దాడి’ అని ఇంకో పార్టీ! రెండు పార్టీల వారూ, ‘తెలంగాణా తల్లి బిడ్డల’మనే చెప్పుకుంటారు. ఆ బిడ్డల్లో ఒక పార్టీ వారు, ‘మా విగ్రహంలో రాజసం ఉట్టిపడుతూ వుంటే, మీ విగ్రహం తెలంగాణా తల్లిని దీనాతి దీనం చేస్తోంది’ అని అంటూవుంటే, ఇంకో పార్టీ వారు, ‘కాదు, మీ విగ్రహం పరలోక దేవతా విగ్రహం అయితే, మా విగ్రహం బహుజన కన్న తల్లి!’ అని అంటున్నారు! ఈ రకంగా, పార్టీలవారి వాద వివాదాలు!
రెండు పార్టీలూ, తెలంగాణా ప్రాంతపు బిడ్డలే! అయినా ఇరు పక్షాల వారికీ, వారి తల్లి రూపురేఖలు వేరు వేరుగా అయిపోయాయి! కారణం, అవి రాజకీయ పార్టీలు! ఎలాంటి రాజకీయాలు? లాభాల్ని దండుకునే, ‘శ్రమ దోపిడీ’ని సమర్థించే, పెట్టుబడిదారీ వర్గ రాజకీయాలు!
మరో చిత్రం, ఇటు తెలంగాణాకీ, అటు ఆంధ్రాకీ ఒకే భాష! అది తెలుగు! ఆంధ్రా వాళ్ళు, ‘మా తెలుగుతల్లికీ మల్లెపూదండా!’ అంటారు. అక్కడ ఆంధ్రా వారికి, ‘తెలుగు భాషే’ తల్లి! ఇటు, తెలంగాణా వారు, ‘జయ జయహే తెలంగాణ జననీ’ అంటారు! ఇక్కడ, భాష పేరు కాదు, ప్రాంతం పేరు! ఆంధ్రా తల్లికి ఇప్పటికీ ఒక రూపమే. తెలంగాణా తల్లికి ఇప్పుడు రెండు రూపాలు! మొత్తం మీద ఒకే ‘తెలుగు తల్లి’కి మూడు రూపాలు!
విగ్రహాల రాజకీయాల్ని చూస్తోంటే, చలం, ‘హంకో మొహబ్బత్’ అనే కధలో రాసిన మాటలు కొన్ని అస్పష్టంగా గుర్తొచ్చాయి. ఆ పుస్తకం తీసి ఒకసారి చూశాను. ‘‘భరత మాత! తెలుగు తల్లి! పాకిస్తాన్ మాత! ఎక్కడుంది భారత మాత! రష్యా పిత! అమెరికా అత్త! చైనా తాత! పెరూ మరదలు! ఏనాటికైనా నవ్వుకోరా జనం, మట్టిని పట్టుకుని గంతులేసిన కాలాన్ని చూసి! ఈ పద్యాలకూ, మాటలకూ ఏం గానీ, ఆ మట్టిని చూసి నీకు తల్లిలా అనిపించిందా?’’... ‘‘లేవరా ఆంధ్రుడా! పడుకోవే ఆంధ్రీ! అనుకుంటో!’’ ‘‘మరి, తెలుగు జాతి?’’ ‘‘జాతి! జాతి! ఏం, మనుషులైనాక ఏదో ఒక భాష వుండదూ? ఎక్కడో ఓ చోట పుట్టరూ? ఏదో ఓ తిండి తినరూ? ఏదో మాతట!... ఏమిటా లేవరా ఆంధ్రుడా? ఎవరి మీదకిరా లేవడం? లేవమను, పక్కలు విరగ తంతారు. ఎవరి మీదకోయీ?’’ చలం నించీ కొన్ని మాటలే తీశాను. భాషా సంకుచిత తత్వాన్నీ, ప్రాంతీయ దురభిమానాన్నీ, జాతీయ దురహంకారాన్నీ, గొప్ప వ్యంగ్యంతో వర్ణించాడాయన!
ఇది, విగ్రహాల గురించి కాబట్టి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఫలానా మనిషి ప్రతి రూపాన్ని, ఒక చిత్రంగా గానీ, శిల్పంగా గానీ, విగ్రహంగా గానీ, మలిచే కళ, వేలాది సంవత్సరాల నించీ జరుగుతున్న కళే! ఆ ప్రయత్నంలో, ఆ మనిషి రూపం ఎలా ఏర్పడినా, అది, ఫలానా మనిషి కోసం ఏర్పడేదే! ఆ మనిషి నిజం మనిషి కావచ్చు, మనం చూడని మనిషి కావచ్చు. ఊహల్లోనో, సాహిత్యంలోనో చిత్రించిన ఫలానా మనిషి కావచ్చు! అయితే, ‘తెలంగాణా తల్లి’గా తయారైన విగ్రహం, తెలంగాణాలో ఏ తల్లిది? తెలంగాణాలోనే కాదు, ఏ ప్రాంతంలో అయినా, సంపన్న తల్లులూ, నిరుపేద తల్లులూ, వుంటారు. వారిలో కూడా వేరు వేరు స్తాయిలు! ఆ నిజమైన స్తాయిల్లో, ఏ స్తాయి స్త్రీ రూపం ‘తెలంగాణా తల్లి రూపం’ అవుతుంది?
తల్లుల స్తాయిలు వేరు వేరై వుండగా, వారిలో ఏ తల్లి రూపం తెలంగాణా తల్లిగా అవుతుంది? ఒక విగ్రహాన్ని తయారుచేసి, ఇది ‘తెలంగాణా తల్లి’ అనడం సాధ్యమేనా? సాధ్యం కాదు. వేరు వేరు స్తాయిల స్త్రీలని, ఒకే స్తాయిలోకి మార్చడం అసత్యం! ‘ఫలానా మనిషి’ కోసం అయితే తప్ప, ఇతర అవసరాల అర్థంతో, ఏ కళా రూపమూ నడవదు. నడకే లేని చోట, చిత్రాలూ, శిల్పాలూ, విగ్రహాలూ, సత్యాల్ని మాయం చేస్తాయి! ఈ కారణంతో, ‘తెలంగాణా తల్లి’ అయినా, ‘ఆంధ్ర మాత’ అయినా, అసత్యం!
ఈ ‘తెలుగు తల్లి’ బిడ్డలు– తెలంగాణా వాళ్ళు గానీ, ఆంధ్రా వాళ్ళు గానీ, మాట్లాడే మాటలకి అర్థాలేమిటి? ‘అస్తిత్వం’ అంటారు! ‘ఆత్మగౌరవం’ అంటారు! ‘అస్తిత్వం’ అనే మాటకి ‘ఉనికి’ అనీ, ‘గుర్తింపు’ అనీ అర్థాలున్నాయి. భాషాపరంగా అయితే, ‘తెలుగు వాళ్ళూ–తమిళ వాళ్ళూ’! అవే తేడాలే! ప్రాంతాలుగా అయితే, ‘ఆంధ్రా వాళ్ళూ’–‘తెలంగాణా వాళ్ళూ’! దేశాలుగా, ‘భారతీయులూ’ ‘పాకిస్తానీయులూ’! ‘కులాలు’గా చూస్తే, ‘కింది కులాలూ’–‘పై కులాలూ’! ఇలా! ఈ అస్తిత్వ భావనలన్నీ చాలా సంకుచితమైనవి. ఎందుకంటే, ఇవి ‘శ్రమ దోపిడీ’, ‘అసమాన శ్రమ విభజన’ అనే వాస్తవాల్ని, మరుగుపరుస్తాయి. ఈ వాస్తవ, మూల కారణాల వల్లనే, ప్రాంతీయ అసమానతలూ, కుల భేదాలూ, స్త్రీ–పురుష అసమానత్వమూ పుట్టుకొచ్చాయని గ్రహించడానికి, అస్తిత్వ భావనలు ఆటంకమవుతాయి.
ఇప్పుడు జరుగుతున్న విగ్రహాల రాజకీయాల సందర్భాన్నే చూద్దాం. తెలంగాణా తల్లి పిల్లలందరూ ఒకే స్తితిలో వున్నారా? అనేకులు శ్రమ చేసే వారిగానూ, అతి కొద్ది మంది ఏ శ్రమలూ చేయని వారిగానూ లేరూ? అనేక మంది జీతాల మీదా, కొద్దిమంది లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ వంటి శ్రమ దోపిడీ ఆదాయాలమీదా బతికేవారుగానూ లేరూ? తెలంగాణా కోసం పోరాడామని చెప్పుకునే పార్టీ నాయకుల్ని గానీ, తెలంగాణాని ఇచ్చామని చెప్పుకునే పార్టీ నాయకుల్ని గానీ, సర్వే చేసి చూడండి! వీళ్ళ ఆస్తులూ, అంతస్తులూ, ఆదాయ మార్గాలూ, అన్నీ ఎలాంటివో తెలుస్తాయి! ‘తెలంగాణా తల్లి’ బిడ్డలైనా, ‘ఆంధ్ర మాత’ బిడ్డలైనా, ‘ఉత్కల (ఒరిసా) జనని’ బిడ్డలైనా, ‘కన్నడ రాజ్యమాత’ సంతానమైనా, ‘తమిళ తాయి’ పిల్లలైనా, ‘మరాఠీ ఆయీ’ పిల్లలైనా, ఒకే అస్తిత్వంతో లేరు. ఏ దేశాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా, జనాభాలో అసంఖ్యాకులు ఏదో ఒక రకమైన శ్రమ చేసుకుంటూ బ్రతికే వారే! అల్ప సంఖ్యాకులు మాత్రమే సిరిసంపదలతో తులతూగేవారు! కంటికి కనిపించినా, వాస్తవాల్ని అర్థం చేసుకోలేని, వర్గ చైతన్యం లేని జనాలను, ‘జయ జయహే తెలంగాణ జననీ!’, ‘జై ఆంధ్ర మాతా!’, ‘బంగారు తెలంగాణా!’, ‘స్వర్ణాంధ్రప్రదేశ్!’ వంటి నినాదాలతో, నిద్రపుచ్చి, వారిని శ్రమ దోపిడీకి అప్పజెప్పడమే కదా అస్తిత్వవాదులు చెయ్యగలిగే ఘనకార్యం! ఈ ఘన కార్యాలకోసమే, వేల లీటర్ల పాలాభిషేకాలూ, బహిరంగ సభలూ!
ఈ అస్తిత్వవాదులు, విరివిగా వాడే ఇంకో మాట, ‘ఆత్మగౌరవం’! బతుకుతెరువు కోసం అవసరమైన శ్రమ సాధనాలు లేని అసంఖ్యాక శ్రామిక జనాలు, ఆ సాధనాల్ని స్వంత ఆస్తిగా గల యజమానుల కింద జీతాల బానిసత్వంలో జీవిస్తూ వుంటే, అది ఆత్మగౌరవం అవుతుందా? ‘పై కులాలూ’ – ‘కింది కులాలూ’గా చీలివున్న సమాజంలో, ఆత్మగౌరవంతో ఎవరు ఉండగలరు? ఇంటిపని ప్రధానంగా స్త్రీలకీ, బైటిపని ప్రధానంగా పురుషులకీ అనే అసమాన శ్రమ విభజన వున్న కుటుంబ జీవితాల్లో, స్త్రీలు ఎలాంటి ఆత్మగౌరవంతో వుండగలరు?
ఇప్పుడు జరగవలిసిందేమిటంటే, అస్తిత్వం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో, నడిచే విగ్రహాల రాజకీయాలకి దూరంగా వుండాలి! ‘శ్రమ దోపిడీ’ వ్యతిరేకమైన చైతన్యాన్నీ, సమానత్వం గురించిన అవగాహననీ నేర్చుకోవాలి!
రంగనాయకమ్మ