Share News

అప్పటి హామీల అమలు కోసమే రైతు ఉద్యమం

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:38 AM

రైతు ఉద్యమాన్ని అడ్డుకునే పేరుతో మోదీ ప్రభుత్వం నేరుగా కురిపిస్తున్న పెల్లెట్లతో, దేశ ప్రజల కడుపు నింపడానికి శ్రమిస్తున్న భారతదేశ రైతులు తీవ్రంగా గాయపడుతున్నారు. విచక్షణారహిత ప్రభుత్వ నిర్బంధంతో...

అప్పటి హామీల అమలు కోసమే రైతు ఉద్యమం

రైతు ఉద్యమాన్ని అడ్డుకునే పేరుతో మోదీ ప్రభుత్వం నేరుగా కురిపిస్తున్న పెల్లెట్లతో, దేశ ప్రజల కడుపు నింపడానికి శ్రమిస్తున్న భారతదేశ రైతులు తీవ్రంగా గాయపడుతున్నారు. విచక్షణారహిత ప్రభుత్వ నిర్బంధంతో, తమ కంటి చూపును కోల్పోతున్నా, దేశ భవిష్యత్తును వెలుతురు వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. డ్రోన్‌లతో వదులుతున్న బాష్పవాయు గోళాలను ఎదుర్కొంటూ కూడా సంక్షోభంలో ఉన్న గ్రామీణ ప్రజల కన్నీళ్లను తుడవడానికి ఉద్యమిస్తున్నారు.

2020లో కేంద్రం తెచ్చిన కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక మూడు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు డిల్లీని చుట్టుముట్టి, పోరాడి ప్రభుత్వాన్ని వెనక్కు నెట్టి, విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఎన్నికల ముంగిట రోడ్లు ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చినట్లుగా రైతులు పండించే పంటలకు ప్రకటించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ఋణ మాఫీ చేసి రైతులను ఋణ విముక్తులను చేయాలనే కీలకమైన డిమాండ్లను రైతులు మళ్ళీ ప్రభుత్వం ముందు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను ఎత్తేయాలని, రైతు ఉద్యమంలో అమరులైన 700 మందికి పైగా రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఆయా కుటుంబాలలో అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, లఖింపూర్ ఖేరీలో నిర్లక్ష్యంగా రైతులపైకి జీపును నడిపి, అనేక మంది మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కొడుకును శిక్షించాలని, విద్యుత్ బిల్లు – 2020ను ఉపసంహరించుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రైతులు, కూలీలు, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు, పశు పోషకులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న మిగిలిన ముఖ్యమైన డిమాండ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇంతకాలం వీటిపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా, హామీలను కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. కానీ పంజాబ్ కేంద్రంగా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించిన రైతులను మాత్రం తాను అధికారంలో ఉన్న హర్యానా రాష్ట్ర బోర్డర్‌లోనే ఆపి, దేశ రాజధానికి రాకుండా అడ్డుకోవడానికి బారికేడ్లు పెడుతున్నది, రోడ్లను తవ్వేస్తున్నది, రోడ్లపై మేకులు నాటుతున్నది, రోడ్లకు అడ్డంగా గోడలు కడుతున్నది. రైతుల ట్రాక్టర్లను శత్రు దేశాల ట్యాంకులుగా ప్రచారం చేస్తున్నది. రైతుల ప్రదర్శనలలో పాల్గొంటే ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నది. నయా రామావతార్‌గా, ‘విశ్వగురు’గా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ సాధారణ రైతులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నాడు.

దేశంలో రైతు కుటుంబాల వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడే రైతుల ఉద్యమం, డిమాండ్లు అర్థమవుతాయి. దేశంలో కోట్లాది వ్యవసాయ కుటుంబాల సభ్యులకు ఇప్పటికీ ఆత్మగౌరవం ఉన్న మనుషులుగా గుర్తింపు లేదు. భారత పౌరులుగా వారికి హక్కులు లేవు. వ్యవసాయ కుటుంబాల కనీస ఆదాయాలకు గ్యారంటీ లేదు. సాగు చేసుకోవడానికి అవసరమైన స్వంత భూమి లేదు. సాగును జీవనోపాధిగా ఎంచుకున్న కౌలు రైతులకు ఏ రాష్ట్రంలోనూ సరైన గుర్తింపు లేదు. ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. కోట్లాది మంది రైతులకు వడ్డీలేని పంట రుణాలు, పెట్టుబడి రుణాలు అందడం లేదు. పంటల బీమా పథకాలు అమలుకావడం లేదు. పంట నష్ట పరిహారం అందడం లేదు. రైతులు పండించిన పంటలకు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు న్యాయమైన ధరలు దక్కడం లేదు.

2006లో డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలోని వ్యవసాయ రంగ జాతీయ కమిషన్ అన్ని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారానికి అనేక సూచనలు చేసింది. కనీస మద్దతు ధరలకు సంబంధించి, సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు 50శాతం కలిపి (C2 + 50 శాతం) కనీస మద్దతు ధరను నిర్ణయించాలనేది ఈ కమిషన్ సిఫారసులలో ముఖ్యమైనది. నిజానికి ఆయన చేసిన సిఫారసులను పూర్తిగా అమలు చేస్తే మాత్రమే వ్యవసాయ కుటుంబాల సంక్షోభానికి సంపూర్ణ పరిష్కారాలు దొరుకుతాయి.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిఫారసును అమలు చేయలేదని, 2014 ఎన్నికల సందర్భంగా వందకు పైగా సభల్లో విమర్శించి, స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా గత పదేళ్లుగా ఈ సిఫారసును అమలు చేయలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2012లోనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ చైర్మన్‌గా ఉన్న మోదీ, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని తన కమిటీ తరపున స్పష్టంగా సిఫారసు చేశారు. కానీ 2014లో ప్రధానమంత్రి అయ్యాక తన 2012 సిఫారసుకు, 2014లో బీజేపీ ఇచ్చిన హామీకి భిన్నంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయలేమని, ఆ సిఫారసు అమలు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పైగా స్వామినాథన్ కమిషన్ సిఫారసును వక్రీకరిస్తూ, సమగ్ర ఉత్పత్తి ఖర్చులను (C2 ) కాకుండా, కేవలం పంట సాగు ఖర్చులకు (A2) కుటుంబ సభ్యుల శ్రమకు కొంత విలువను జోడించి, దానికి 50శాతం కలిపి కనీస మద్దతు ధరలను (MSP) ప్రకటిస్తున్నది.

నిజానికి వ్యవసాయంలో రైతులు పెట్టే అన్ని పెట్టుబడులనూ పంట ఖర్చుల ధరల నిర్ణాయక కమిషన్ (CACP) పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా రైతు సాగు భూమికి ఏ విలువా వేయడం లేదు. రైతు పెట్టే ఇతర పెట్టుబడులకు (ట్రాక్టర్ కొనుగోలు, డ్రిప్ లాంటి సూక్ష్మ సాగు నీటి వ్యవస్థ ఏర్పాటు, సాగునీటి కోసం బోర్ వేయడం, బావి తవ్వడం, విద్యుత్ ట్రాన్స్‌ఫాం ఏర్పాటు, పొలంలో షెడ్డు వేయడం, నీటి కోసం దూర ప్రాంతాల నుంచి పైప్‌లైన్ వేసుకోవడం, పంట కోత, ఎండబెట్టడం, గ్రేడింగ్ చేయడం, క్లీనింగ్ చేయడం లాంటి వాటికి) అసలు విలువ ఇవ్వడం లేదు. వ్యవసాయ సీజన్‌లో రైతుకయ్యే రవాణా ఖర్చులను పట్టించుకోవడం లేదు. పంటల బీమా పథకం ప్రీమియం కూడా లెక్కింపులోకి తీసుకోవడం లేదు. కూలీలను దూరం నుంచి రప్పించుకుని పని చేయించుకోవడం కోసం పెట్టే రవాణా, భోజనం, మద్యం సరఫరా లాంటి వాటికి అయ్యే అదనపు ఖర్చులను కూడా ఉత్పత్తి ఖర్చులలో పరిగణనలోకి తీసుకోవడం లేదు.

దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం సహా 100కు పైగా పంటలు, ఇతర గ్రామీణ ఉత్పత్తులు వస్తుంటే, ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి కేవలం 23 పంటలకు మాత్రమే కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నది. పత్తికి కూడా కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), ప్రస్తుతం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు పలుకుతున్నాయనే పేరున, పత్తిని గత మూడేళ్లుగా సేకరించడం మానేసింది.

కేంద్రం ప్రకటించే ఈ ధరలకు ఇప్పటి వరకూ ఎటువంటి చట్టబద్ధత లేదు. అవి కేవలం సలహా ధరలుగా మాత్రమే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి నేరుగా, పంటలను కొనుగోలు చేసే సమయంలో మాత్రమే ఈ ధరలు రైతులకు అందుతున్నాయి. పంట నాణ్యత లేదనే పేరుతో, తేమ ఎక్కువ ఉందనే పేరుతో, ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థలు కూడా ధరలో కోతలు పెడుతూనే ఉన్నాయి.

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం వల్ల, దళారీ వ్యాపారులు, కంపెనీలు రైతులకు వాటిని చెల్లించకపోయినా వారిపై ఎటువంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకోలేవు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులలో కానీ, ఈ–నామ్ లాంటి ఆన్‌లైన్ పోర్టల్‌పై కానీ రైతులకు కనీస మద్దతు ధరలు తప్పకుండా చెల్లించాలనే నియమం ఏమీ లేదు. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా వ్యాపారులు, కంపెనీలు కుమ్మక్కై కార్టెల్‌గా ఏర్పడి, పంటలకు అతి తక్కువ ధరలనే చెల్లిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిజమైన రైతుల సమస్యలను, డిమాండ్లను మళ్ళీ మరోసారి ముందుకు తేవడం ద్వారా ప్రజలను సమీకరించి, తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఈ ఎన్నికల సమయం సరైందని భావించిన కొన్ని రైతు, కూలీ సంఘాలు ఉమ్మడిగా ఛలో డిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చాయి. ఫలితంగా గత వారం రోజులుగా రైతుల ఎజెండా అనివార్యంగా ప్రజలలో చర్చకు వచ్చింది.

మన దేశంలో జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO) నివేదిక 2019 ప్రకారం వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం కేవలం రూ.10,218 మాత్రమే. ఈ నివేదిక ప్రకారం దేశంలో 50శాతం రైతు కుటుంబాలు అప్పులో కూరుకుపోయి ఉన్నాయి.

రైతులు కొనసాగిస్తున్నది న్యాయమైన ఉద్యమం. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు మళ్ళీ మొదలైన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బలపరచడం, మద్దతునీయడం, భాగస్వాములు కావడం మనందరి బాధ్యత.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - Feb 20 , 2024 | 01:38 AM