సొంత నియోజకవర్గాలపై శ్రుతి మించుతున్న ప్రేమ!
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:27 AM
పాలమూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా కొడంగల్‌ను చూడవచ్చు. కానీ అంతకంటే దుర్భర దారిద్ర్యంతో, కరువుతో అల్లాడుతున్న మరెన్నో మారుమూల ప్రాంతాలు కూడా...

పాలమూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా కొడంగల్‌ను చూడవచ్చు. కానీ అంతకంటే దుర్భర దారిద్ర్యంతో, కరువుతో అల్లాడుతున్న మరెన్నో మారుమూల ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కానీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన కాన్వాయిలోని కార్ల సంఖ్యను కూడా కుదించుకొని పొదుపు పాటించాలన్న సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన నియోజకవర్గం విషయంలో మాత్రం చేతికి ఎముక లేదన్నట్టు నిధుల వరద పారించారు. ఒకపక్క రాష్ట్రంలో రైతుబంధు సాయం సకాలంలో అందరికీ అందలేదన్న విమర్శలు వస్తున్న సమయంలో ఒక్క రోజే తన సొంత నియోజవర్గమైన కొడంగల్‍లో రూ.4369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడితో ఆగక ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధురకు రూ.334కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. ఇలా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు నిధుల్ని తమ సొంత నియోజకవర్గాలకు తరలించుకుపోవడం వారి స్వార్థానికి తార్కాణంగా నిలిచింది.
గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు అభివృద్ధి అంతా గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలకే పరిమితమైందని పలుమార్లు విమర్శించారు. నిజంగానే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మూడు నియోజకవర్గాలకు వేలకోట్ల రూపాయలు వరదలై పారాయి. ఆ సమయంలో ఒక్క రేవంతే కాదు, అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పోకడలు ప్రాంతీయ అసమానతలకు దారి తీస్తాయి అని గగ్గోలు పెట్టారు. ఆనాటి అసెంబ్లీలో సభాపక్ష నాయకునిగా ఉన్న భట్టి విక్రమార్క కూడా తెలంగాణ అంటే ఆ మూడు నియోజకవర్గాలే కాదనీ, మిగతా నియోజకవర్గాలను కూడా పట్టించుకోవాలనీ పదే పదే కోరారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే తప్పు! గతంలో గజ్వేల్‌కు ఔటర్ రింగురోడ్డు వేసినప్పుడు తీవ్రంగా విమర్శించారు. మరి ఇప్పుడు కొడంగల్‌కు వేల కోట్లు నిధులు కేటాయించటాన్ని ఎలా సమర్థించుకుంటారు. కనీసం ఒక సంవత్సరం తరువాత ఆర్థికంగా సర్దుకున్నాక నిధులు కేటాయించి ఉన్నా బాగుండేదేమో.
ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం సమయంలో ‘భయం గాని, పక్షపాతం గాని లేకుండా రాగద్వేషాలకు అతీతంగా, బాధ్యతగా’ రాజ్యాంగబద్ధ పాలన సాగిస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు. కానీ పదవులు అలంకరించాక ఆ ప్రమాణాన్ని గాలికి వదిలేసి సొంత నియోజకవర్గాల పట్ల పక్షపాత వైఖరి కనబరచడం బాధాకరం. ఎవరికైనా సొంత ప్రాంతంపై అభిమానం ఉండటం సహజమే. కానీ రాష్ట్రంలో కనీసం జీతాలకు, సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టేందుకు డబ్బు లేని నేటి విషమ పరిస్థితుల్లో నిధులన్నీ సొంత నియోజక వర్గాలకు మళ్ళించుకుపోవడమంటే స్వార్థమే అవుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులదారిలోనే ఈ ప్రభుత్వం కూడా వెళ్తుంది అన్న భావన కలుగుతున్నది.
ఇదంతా ఒక ఎత్తైతే ఇక రేవంత్ ప్రభుత్వంలో ఉన్నదంతా రాజకీయ ఉద్దండులే. అదీకాక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో!’ అన్న చందంగా ఉంటుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తనకంటే సీనియర్లు, తనకంటే కాంగ్రెస్‌పై అధిపత్యం, హక్కులు ఉన్న నేతలను కాదని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం అంటేనే కత్తి మీద సాములాంటిది. అలాంటప్పుడు నిర్ణయాలు ఏకపక్షమైతే కుడి ఎడమ కాకపోదు. ఇప్పటికే లోలోపల ముఖ్యమంత్రి పదవిపై ఉన్న వాంఛను అణచిపెట్టుకొన్న నేతలు ఎవరెవరో అందరికీ విదితమే. రేపు ఆయా నాయకులు తమ తమ నియోజకవర్గాలకు కూడా ప్రతిపాదనలు ఇస్తే అప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితిని ముఖ్యమంత్రి ఊహించగలడా.
ప్రభుత్వం అంటే ప్రైవేటు సంస్థానం కాదు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సంక్షేమానికి తాత్కాలిక ధర్మకర్తలు అన్న విషయాన్ని మరచిపోయి ఇష్టారాజ్యంగా సొంత నియోజక వర్గాలకు నిధులు కేటాయించుకోరాదు. అది నైతిక పాలనకు కూడా నిదర్శనం కాదు. పాలకులు కూడా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, కేవలం కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ పని చేయరాదు. సమతుల్య అభివృద్ధికి ఇది అవరోధంగా మారే ప్రమాదం ఉంది.
డా. దొంతగాని వీరబాబు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ