Share News

తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:51 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒకే ఒక్కడు కూనంనేని సాంబశివరావు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం నుంచి...

తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒకే ఒక్కడు కూనంనేని సాంబశివరావు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం నుంచి ఎన్నికల్లో సాధించిన విజయం ఘనమైనది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మరో మాజీ మంత్రి, ఇంకా ఇతరులపైన ఈయన 27వేల పైచిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు. కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి జరిగిన ఎన్నికలలో ఇదే అత్యధిక మెజారిటీ.

కూనంనేని ప్రజల కోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. టాడా లాంటి నిరంకుశ కేసులతో సైతం జైలుపాలు అయ్యారు. పోలీసు కాల్పులను కూడా ఎదుర్కొన్నారు. మూడు పర్యాయాలు వరంగల్‌ సెంట్రల్‌ జైళ్లలో నెలల తరబడి ఉన్నారు. ఆయన నిత్యం ప్రజల వెంటే ఉన్నారు. కొత్తగూడెంలో అనేక కాలనీలను నిర్మించి వేలాదిమందికి ఇంటి సౌకర్యం కల్పించారు. దాదాపు 35 నుంచి 40 అసంఘటితరంగ కార్మికుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రంగంలో కమ్యూనిస్టులు కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, ఇతర పార్టీల పొత్తుతోపాటు పైన పేర్కొన్న అన్ని వర్గాల ప్రజల మద్దతుతో విజేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోను, తర్వాత 2018 ఎన్నికల్లోనూ అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుతో ఒకే ఒక్క సీటును సీపీఐ దక్కించుకున్నది. ఈ ఎన్నికల్లో సీపీఎం ఎవరితోను పొత్తు పెట్టుకోక ఒంటరిగా 19 నియోజక వర్గాల్లో పోటీ చేసి అన్నింటిలో డిపాజిట్లు కోల్పోయింది.

మునుగోడు ఉపఎన్నికల్లో వారి మద్దతు తీసుకుని, ఆ తర్వాత వదిలేసి, కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని, వారు ప్రజల్లో లేరని హేళన చేసిన బీఆర్‌ఎస్‌ ఈ రోజు రాష్ట్రంలో అధికారం కోల్పోడానికి కారణం కొంతవరకూ కమ్యూనిస్టులే అంటే అతిశయోక్తి కాదు! కమ్యూనిస్ట్ పార్టీల ఆస్తిత్వాన్ని సవాల్‌ చేసినవారు కుప్పకూలిన దాఖలాలు కోకొల్లలు. కూనంనేని సాంబశివరావు ఒక్కడే అయినా, ఆయన నాలుగు కోట్ల ప్రజానీకం గొంతుగా ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకసారి సాంబశివరావు కొత్తగూడెం నుంచి శాసనసభకు వెళ్లారు. ఆయన గతంలో ఆనాటి విశాలాంధ్ర సంపాదకులు రాఘవాచారి శిక్షణలో జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. శాసనసభ్యులుగా ఉన్న కాలంలో లక్షా నలభై వేల ఎకరాల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం శాసనసభ లోపలా బయటా పెద్దయెత్తున పోరాటం చేశారు. అసెంబ్లీలో సోంపేట కాల్పులకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్‌‍బండ్‌ పైన విగ్రహాల కూల్చివేతకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర వహిస్తూనే విశ్లేషణాత్మకంగా చేసిన ప్రసంగాలు ఇప్పటికీ గుర్తుంటాయి. సింగరేణి బొగ్గుగని కార్మికుల హక్కు కోసం పోరాడి వారి కోసం జైళ్లకు వెళ్ళిన నేతగా ఆయన కార్మికుల అభిమానాన్ని పొందారు.

తెలంగాణ సాయుధ పోరాట ఘన చరిత్రకు వారసులుగా ఉన్న కమ్యూనిస్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మరింత బలంగా పురోగమిస్తారని అందరూ భావించారు. మొదటి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులకు చెరొక స్థానం వచ్చినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా లభించకపోవడంతో కమ్యూనిస్టులు చట్టసభల్లో లేని లోటు సామాన్య ప్రజలకు స్పష్టంగా కనిపించింది. ఈ దశలోనే రాష్ట్ర రాజకీయాలు కింది నుంచి పైవరకు పార్టీ ఫిరాయింపులతో భ్రష్టు పట్టిపోయాయి. పాలకులు ప్రశ్నించే గొంతులను నులిమేశారు. హైదరాబాదులో నిరసన హక్కుకు చిహ్నంగా నిలిచిన ధర్నాచౌక్‌ను బందు చేశారు. సమ్మె హక్కులను కాలరాశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఆ సమ్మెకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు స్వయంగా ఆమరణ దీక్షకు దిగారు. రాష్ట్రంలో కార్మికుల హక్కులు కాలరాయబడకుండా ఉండేందుకు కమ్యూనిస్టులు సర్వం ధారపోశారు. ధర్నా చౌక్‌ పునరుద్ధరణకు మఖ్దూంభవన్‌లో దీక్షలు చేస్తూ కమ్యూనిస్టులు, ప్రజాతంత్ర శక్తులు, పార్టీలు ఇతర సంఘాలకు పోరాట వేదికగా నిలిచింది సీపీఐ.

చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనప్పటికీ కమ్యూనిస్టులు చట్టసభల వెలుపల తమ పోరాటాలను ఏ మాత్రం తగ్గనీయలేదు. పేదల కోసం అనేక చోట్ల గుడిసెలు వేయించారు. వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి తదితర జిల్లాల్లో వేల సంఖ్యలో నిరుపేదలకు గుడిసెలు వేసేందుకు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా సాంబశివరావు నాయకత్వంలో ఎర్రజెండా బాసటగా నిలిచింది. చివరకు రాష్ట్రంలో లౌకిక పునాదులను ధ్వంసం చేసేందుకు మోసపుటెత్తులతో దూసుకుపోతున్న బీజేపీకి కళ్ళెం వేసింది కూడా కమ్యూనిస్టు పార్టీనే. నాడు మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న నిర్ణయంతో మతోన్మాద శక్తులకు ముకుతాడుపడింది. ఉప ఎన్నికల్లో పాలక పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ తన పోరాట బాటను విడవలేదు. గుడిసె వాసుల పోరాటం, ఆశ, అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మెలు, ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రొఫెసర్లు, రచయితలపై ఉపా, దేశద్రోహ చట్టాలను పెట్టి వారిని అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు కమ్యూనిస్టులే వారికి అండగా నిలిచారు.

ఒకవైపు దేశాన్ని మతోన్మాదం కబళిస్తూ, నిరంకుశ పాలకులు చెలరేగిపోతున్న సమయంలో పార్లమెంటులో, అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవడం పెద్దలోటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటాల ద్వారా ప్రజల సమస్యలను, హక్కులను ప్రధాన స్రవంతిలో వినిపించడం ఒక భాగమైతే, చట్టసభల్లో అందుకు అనుగుణమైన చట్టాలను తీసుకురావడం, ఉన్న చట్టాలను కోల్పోకుండా బలమైన వాణిని వినిపించడంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అత్యవసరం. ధనబలం, కండబలం, మద్యంతో మకిలిపట్టిన ఎన్నికల విధానంలో కమ్యూనిస్టులు నెగ్గుకు రావడం సవాలుగా మారింది. అందుకే కూనంనేని సాంబశివరావు హైదరాబాదులో నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలోనే, ‘నేను శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే కాదు, అన్ని వామపక్ష పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రగతిశీల శక్తులందరికీ ప్రతినిధిని’ అని ప్రకటించడం యావన్మందికీ ఆనందాన్ని కలిగించింది.

కమ్యూనిస్టు పార్టీలు ఖతం అని ప్రచారం చేస్తూ, మతం విద్వేషాలు సృష్టించే వారికి కూనంనేని గెలుపు ఒక సవాల్‌. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోను కూనంనేని గెలుపుతో ఎర్రజెండా పార్టీలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రజల గొంతుకు అభినందనలు తెలిపారు. ధనస్వామ్యం, కార్పొరేట్‌ స్వామ్యాల ఉక్కు పిడికిలిలో ఎన్నికల రంగం నలిగిపోతున్న తరుణంలో ఎన్నికలలో దామాషా ప్రాతినిధ్యం కొరకు పోరుసల్పి దామాషా ఎన్నికల విధానాన్ని సాధిస్తే కమ్యూనిస్టుల వాణి చట్టసభల్లో మరింత ప్రతిధ్వనించగలదు. కమ్యూనిస్టులు లేని ప్రజాస్వామ్యం మనజాలదు. కమ్యూనిస్టులు తక్షణమే అధికారంలోకి రాలేకపోయినా ప్రజల తరఫున గొంతు వినిపించడంలో, పోరాటం చేయడంలో కమ్యూనిస్టుపార్టీలను మించి మరేపార్టీ ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల గొంతుకగా ఉంటానంటున్న కూనంనేనికి ఆల్‌ ది బెస్ట్‌!

ఎండి. మునీర్‌

సీనియర్‌ జర్నలిస్ట్

Updated Date - Jan 03 , 2024 | 12:51 AM