Share News

అభివృద్ధి ముసుగు.. అడ్డంగా దోపిడీ!

ABN , Publish Date - May 10 , 2024 | 12:53 AM

అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టికి కేంద్రాలైన అమరావతిని, పోలవరాన్ని, విశాఖపట్నం అభివృద్ధిని కూల్చివేసి, ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి...

అభివృద్ధి ముసుగు..  అడ్డంగా దోపిడీ!

అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టికి కేంద్రాలైన అమరావతిని, పోలవరాన్ని, విశాఖపట్నం అభివృద్ధిని కూల్చివేసి, ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తన నైజాన్ని చాటుకున్న పాలకుడు జగన్‌రెడ్డి. వైసీపీ పాలనలో సకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో సగటు పౌరుల, కార్మికుల జీవనస్థితి దుర్భరమయింది.

విశాఖలో రుషికొండకు గుండు కొట్టారు, మిలీనియం టవర్స్ ఖాళీ చేయించారు. లులూ, హెచ్ఎస్‌బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫిన్‌కార్ప్ లాంటి కంపెనీలను తరిమేశారు. మన్యంలో లేటరైట్‌, బాక్సైట్, మైనింగ్ దోపిడీకి జెండా ఊపారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూ వనరులను దోచుకోవటానికి విశాఖను రాజధానిగా చేస్తానంటూ మూడుముక్కలాట ఆడుతున్నారు. విలువైన దసపల్లా, 65 ఎకరాల ఎన్‌సీసీ, బే పార్కు, జ్ఞానానంద- రామానంద ఆశ్రమం, కార్తీకవనం ప్రాజెక్టును, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూములను, రుషికొండలోని రూ.1500 కోట్ల విలువ చేసే 93 ఎకరాల హడ్కో స్థలాన్ని సొంత పార్టీ వారికి దోచిపెట్టి, జగన్ ప్రజలను మోసగించారు.


భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను గత ప్రభుత్వం అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసినా, నిర్మాణం చేయకుండా ఆలస్యం చేసి ఉత్తరాంధ్రకు జగన్‌రెడ్డి ఎంతో నష్టం చేశారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా, పారిశ్రామికవేత్తలలో ఎలాంటి భరోసా నింపకుండా పెట్టుబడిదారులను జె– టాక్స్‌ పేరుతో బెదిరించడంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు ఆగిపోయాయి. లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా ఉండిపోయారు. 2019లో విశాఖలో దాదాపు యాభైవేల మంది ఐటీ నిపుణులు ఉంటే, ఆ కంపెనీలను తరిమేశారు. దాంతో వారంతా విశాఖపట్నం నుంచి తరలిపోయారు.

కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ప్రాణాలు తీశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పదివేల ఎకరాల అసైన్‌మెంట్ భూమిని బలవంతంగా తీసుకొని ఉత్తరాంధ్రలో బడుగులకు ఏమి న్యాయం చేశారో జగన్‌ చెప్పాలి. మద్యం రేట్లు పెంచి, రకరకాల బ్రాండ్లతో వేలాది కార్మికుల ఆరోగ్యాలను, కుటుంబ వ్యవస్థలను కూల్చివేశారు. అన్న క్యాంటీన్‌ రద్దు, చంద్రన్న బీమా రద్దు, పండుగ కానుకల రద్దు, రైతు రుణమాఫీ రద్దు, నిరుద్యోగ భృతి రద్దు, స్థానిక ఎన్నికలలో బడుగులకు 10 శాతం రిజర్వేషన్లు రద్దు, విశాఖ రైల్వే జోన్ రద్దు వంటి వాటితో అపకీర్తి మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయాలా?


పోలవరాన్ని ఎత్తు తగ్గించి రివర్స్ టెండర్లతో నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని, నాగావళి–వంశధార నదులను అనుసంధానం చేయకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను నష్టపరిచారు. సంపద సృష్టించే ప్రజా రాజధాని అమరావతిని ధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి, సామాన్య ప్రజానీకం మీద మరింత భారం మోపిన ఈ ప్రభుత్వం గురించి ఓటర్లు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఉత్తరాంధ్రలోని నదుల నుంచి ఇసుక లూటీ చేసి లక్షలాది నిర్మాణ కార్మికుల బ్రతుకులు దుర్భరం చేశారు. డ్రగ్స్, గంజాయి, ల్యాండ్ మాఫియాతో సామాన్య, మధ్యతరగతి, విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు జగన్‌రెడ్డి. జీవో 217తో ఉత్తరాంధ్రలోని లక్షలాది మంది మత్స్యకారుల వృత్తిని దెబ్బతీశారు. జీవో 5తో వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఉత్తరాంధ్రలోని ఇండస్ట్రియల్ కారిడార్ల, ఆటోనగర్‌ భూములు దోచుకోవడానికి స్కెచ్ వేశారు. గంగవరం, మూలపేట పోర్టులను అదానికి; కాకినాడ పోర్టు, సెజ్‌లను విజయసాయి రెడ్డికి దోచిపెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్థిక పరిస్థితి దిగజార్చి, అమ్మటానికి ప్రయత్నించి అందులోనూ వాటా కొట్టేయాలని చూస్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్‌కు మంగళం పాడి, ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయాలతో కలుషితం చేశారు. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రను గుండాలు, రౌడీల రాజ్యంగా మార్చి భూకబ్జాలు, బెదిరింపులతో హత్యలకు నిలయంగా మార్చారు.


ప్రజాస్వామ్యానికి హాని కలిగించే జగన్‌రెడ్డి కావాలో, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేసి, హుద్‌హుద్ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న నగరానికి యుద్ధ పాతిపదికన మౌలిక వసతులు కల్పించి, సకాలంలో పునరుద్ధరించి విశాఖ అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందిన చంద్రబాబు కావాలో ప్రజలు ఆలోచించాలి. ఉత్తరాంధ్ర యువత అభివృద్ధి కోసం నిరంతరం తపించే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేసింది. మన గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి సంపద సృష్టించే ఆధునికాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గెలుపు కోసం పౌర సమాజంలోని ప్రజాతంత్ర శక్తులు, అన్ని వర్గాల వారు కృషి చేయాలి. అరాచక జగన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు సమాయత్తం కావాలి.

కోగంటి లెనిన్‌బాబు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిఎన్‌టియుసి

Updated Date - May 10 , 2024 | 12:53 AM