పేదల అక్కరకు రాని 2013 భూసేకరణ చట్టం
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:45 AM
బ్రిటిష్ వాళ్లు రూపొందించిన భూ సేకరణ చట్టం ‘ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్–1894’ కి మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక రెండు మూడు చిన్న సవరణలు జరిగినప్పటికీ ‘భూసేకరణ చట్టం–2013’ వచ్చే వరకు...
బ్రిటిష్ వాళ్లు రూపొందించిన భూ సేకరణ చట్టం ‘ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్–1894’ కి మనకు స్వాతంత్ర్యం సిద్ధించాక రెండు మూడు చిన్న సవరణలు జరిగినప్పటికీ ‘భూసేకరణ చట్టం–2013’ వచ్చే వరకు దాదాపు 120 సంవత్సరాలు అదే అమల్లో ఉంది. ఆ చట్టం పరిధిలోనే ప్రజాప్రయోజనాల పేరిట ప్రైవేట్ వారి కోసం కొన్ని వేలు, లక్షల ఎకరాల భూ సేకరణ జరిగింది. జాతీయ స్థాయిలో టాటా సంస్థ కార్ల తయారీ కోసం నందిగ్రామ్, సింగూర్‌లలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు బెంగాల్ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగిపోవలసి వచ్చింది. గుజరాత్‌లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ప్రాజెక్టు. దీని వల్ల 17 జిల్లాలు, 15 వ్యవసాయ డివిజన్లు, 3550 గ్రామాలు పూర్తిస్థాయి విస్తాపనకు గురైనాయి. కొన్ని లక్షల మందికి జరుగుతున్న అన్యాయం పట్ల మేధా పాట్కర్ చేసిన ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ కోవకు చెందినవే భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జునసాగర్, పోలవరం ప్రాజెక్టులు. తర్వాత కూడా సెజ్‌లకు, ప్రాజెక్టులకు, ఫార్మాసిటీలకు వేలాది ఎకరాలు భూ సేకరణలు జరుగుతూనే వచ్చాయి.
ఈ భూసంతర్పణను వ్యతిరేకిస్తూ చాలా ఏళ్ళ నుంచి ఎందరో శాసనకర్తలు, న్యాయాధీశులు, రైతు సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా చేసిన విజ్ఞప్తులు, ఇంకా సమకాలీన అవసరాల దృష్ట్యా గత యూపీఏ ప్రభుత్వం రెండవసారి ఎన్నికైన తర్వాత అంటే 2013లో కొత్త భూ సేకరణ చట్టం రూపుదిద్దుకుంది. ఈ కొత్త చట్టానికి హక్కు అనే పదం జోడించి ‘భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం, న్యాయమైన పరిహారం, పారదర్శకత 2013 చట్టం’గా తయారు చేసారు. ఇది జనవరి 2014 నుంచి అమలుపరిచేలా కేంద్రం నిర్ణయించింది. ఈ చట్టాన్ని రూపొందించి రాష్ట్రాల అభిప్రాయం కోరినప్పుడు ఇంతటి ఖర్చుతో కూడిన భూ సేకరణ చేయడం మా వల్ల కాదంటూ రాష్ట్రాలు చేతులెత్తేశాయి. అందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘మీ ప్రాంతాలవారీగా ఉండే భూ సంబంధిత ఒడిదుడుకులను అధిగమించేలా మీకు నచ్చిన సవరణలను, మీ రాష్ట్ర పరిధిలో మీకు అవసరమైన చట్టాలను చేసుకోవచ్చు’ అనే వెసులుబాటు ఇచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీఓ 123 కొత్త చట్టం స్ఫూర్తిని దెబ్బతీసింది. ఇందులో సోషల్ అసెస్మెంట్ అంటూ సామాజిక అంచనాలను కూడా రికార్డు చేసి వారి ఇబ్బందులను తెలుసుకోమంది చట్టం. రెండు పంటలు పండే పొలాలను వదిలేయడం, అత్యధిక సంఖ్యలో రైతులు మేము ఒప్పుకోము అంటే ఆ భూమిని వదిలేయడం, భూమికి భూమి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కుటుంబానికి నమ్మకాన్ని కల్పించడం ఇవన్నీ ఉన్నప్పుడే అభ్యంతరం లేని భూసేకరణలు జరుగుతాయి. కొత్త చట్టంలో గ్రామంలో నివాసముంటున్న వృత్తిపనివార్లకు, భూమి లేకుండా కేవలం వృత్తి ఆధారంతో బతుకుతున్న వారికి ఏ రకమైన హామీ లేదు. ముఖ్యంగా ఊళ్లో ఉండే కమ్మరి, వడ్రంగి, అవుసుల, కంచర, శిల్పి, గౌడ్, గొల్ల కురుమ, కుమ్మరి, రజక, క్షౌర, ఖాజీ, వడ్డెర, బ్రాహ్మణ... వీరికి ఏ రకమైన పునరావాసం, పునర్నిర్మాణం ఆలోచన చట్టంలో లేదు.
ఈ భూసంతర్పణను సమర్థించుకోవడానికి ప్రభుత్వం– ‘ఫ్యాక్టరీలకు, ఓడరేవులకు, రహదారులకు, విమానాశ్రయాలకు, భూములు కావాలి. అభివృద్ధికి ఇవన్నీ కావాలి’ అని వాదిస్తున్నది. కానీ, వ్యవసాయానికి, పశువులకు, సముద్రంలో చేపల వేటకు తీరం వెంబడి భూములు కావాలి. ఇంటి గోడల కోసం కూడా మట్టి కావాలి, బంజర్లు కావాలి. వీటి మీద బతికుండే ప్రజలు కూడా బాగుండాలి. ఇవన్నీ అభివృద్ధిలో భాగం కావాలి.
ప్రకృతి నుంచి ప్రజలు పొందే జీవనానికి బదులుగా నామమాత్ర నష్టపరిహారం ఇస్తే ఎలా సరిపోతుంది? ఎంత భూమి కావాలంటే అంత పరిశ్రమలు వగైరాలకు ఇచ్చుకోవచ్చునని భావించే పాలనా నీతిని ఏమనాలి? వీరిచ్చే పరిహారంతో ఆ ప్రజలు కోల్పోయిన దానిలో నాల్గవ వంతు భూమి కొనుక్కోలేరు. ఇంకొకచోట స్థిరపడి ఊరుమ్మడి బతుకు సాగించడానికి అవసరమైన పునరావాసం గాని, భూములు లేని వారికి ఇచ్చే నష్టపరిహారంగానీ కొత్త చట్టంలో ఒక హక్కుగా చేర్చబడలేదు. ఎంతసేపూ నష్టపరిహారం, పునర్నిర్మాణం, పునరావాసం గురించే కాక అభివృద్ధి విధానాల గురించి కూడా పునరాలోచించాలి. అమలు లక్ష్యాన్ని కోల్పోయిన కొత్త భూసేకరణ చట్టం వల్ల విస్తాపనకు గురి అవుతున్న ప్రజల అవసరాలకు, వారి ఆందోళనలకు అండగా ఉందాం.
దేశవ్యాప్తంగా భూ సేకరణ విధానాన్ని ప్రశ్నిద్దాం, లేదంటే ప్రజలు ఉన్న భూములను కూడా కోల్పోతారు. భూ సేకరణ జరగకపోతే అభివృద్ధి ఆగిపోతుందని భావిస్తే ఆ ప్రజలకు రెండు తరాలకు సరిపడా జీవనభృతిని హామీగా ఇస్తూ అమలు చేయాలి. ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వడానికి ఏ చట్టాలు అడ్డు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.
వి. బాలరాజు, తహశీల్దార్ రిటైర్డు