రాజ్యాంగానికి వెన్నెముక ‘పీఠిక’
ABN , Publish Date - Jun 14 , 2024 | 02:13 AM
భారత రాజ్యాంగానికి ప్రాణం, వెన్నెముక, కళ్ళు, మెదడు అన్నీ దాని పీఠికే. భారతదేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మన రాజ్యాంగ పీఠిక పేర్కొంటోంది. 1949 నవంబరు 26న ఆమోదించిన...
భారత రాజ్యాంగానికి ప్రాణం, వెన్నెముక, కళ్ళు, మెదడు అన్నీ దాని పీఠికే. భారతదేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మన రాజ్యాంగ పీఠిక పేర్కొంటోంది. 1949 నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ‘సర్వ సత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మాత్రమే ఉందన్నది వాస్తవం. ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాలు మొదట్లో లేవు; ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో 1976 డిసెంబరు 18న 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాన్ని అడ్డంగా చేర్చారనే వాదనను బీజేపీ చాలా కాలంగా చేస్తోంది. తాము ఇక్కడవున్నది రాజ్యాంగాన్ని మార్చడానికే అని చెప్పిన నాయకులూ ఆ పార్టీలో కొందరున్నారు. దీనికి విరుద్ధమైన వాదన కూడా బలంగానే వుంది. ప్రజాస్వామ్యానికి విస్తృత అర్థమే ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలని గట్టిగా వాదిస్తున్నవారూ ఉన్నారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలు ‘తమకుతాము’ ఇచ్చుకున్న హామీల్లో, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉన్నాయి. వీటిల్లోనూ అంతర్లీనంగా ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలున్నాయి.
‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు’ భారత సాంప్రదాయం కాదనీ వాటిని బయటి దేశాల నుంచి అరువు తెచ్చి రాజ్యాంగంలో బలవంతంగా జొప్పించారని అప్పట్లోనే ఆరెస్సెస్ వంటి సంస్థలు గట్టిగానే విమర్శించాయి. వాటికన్నా మనుస్మృతియే మన సమాజానికి సరిగ్గా సరిపోతుందని బలంగా వాదించాయి.
‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు’ ఎక్కడి నుండి వచ్చాయి? వాటిని ఎవరు తెచ్చారూ? అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవంలో ఈ నినాదాలు మార్మోగాయి. అయితే తాను బుద్ధుని బోధనల నుంచి ఈ నాలుగు ఆదర్శాలను స్వీకరించినట్టు గొప్ప దార్శనికులు, భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బి.ఆర్. అంబేడ్కర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఫ్రెంచ్ విప్లవ నినాదాలను జవహర్‌లాల్ నెహ్రూ సైతం విపరీతంగా అభిమానించేవారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదించింది. బ్రిటీష్ ఇండియాను స్వతంత్ర ఇండియాగా మార్చే ప్రక్రియను సజావుగా సాగించడానికి 1946 సెప్టెంబరు 2న భారత తాత్కాలిక ప్రభుత్వం (Pro-visional Government of India) ఏర్పడింది. అదే రాజ్యాంగ సభగానూ పనిచేసింది. భారత తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉండిన జవహర్‌లాల్ నెహ్రు 1946 డిసెంబరు 13న రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రవేశపెట్టారు. దాన్ని 1947 జనవరి 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ తీర్మానంలోనే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు అనే ఆదర్శాలు చాలా వివరంగా వున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి (సిఏఏ) వ్యతిరేకంగా 2019 చివర్లో ఢిల్లీ శివార్లలోని షాహీన్‌బాగ్‌లో ఉద్యమం ఆరంభమయినప్పుడు భారత రాజ్యాంగమే ఆధునిక ‘మతగ్రంథం’గా మారిపోయింది. ఆందోళనకారులైన ముస్లిం మహిళలు ఒక చేత్తో మువ్వన్నెల జాతీయ జెండాను పట్టుకుని మరో చేతిలో భారత రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకుని, ఒళ్ళో గాంధీజీ, అంబేడ్కర్‍ల ఫొటోలు పెట్టుకుని ‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ అంటూ నినదించారు.
‘భారత రాజ్యాంగ పీఠిక’ చారిత్రక ప్రాధాన్యాన్నీ, ప్రాసంగికతను గుర్తించి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఈ పుస్తకాన్ని రాశారు. రాజ్యాంగానికి సంబంధించిన అనేక పార్శ్వాలను 18 పర్వాల్లో ఇందులో ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం మీద రాయడానికి సరైన ఛాయిస్ మాడభూషి శ్రీధర్ అయితే, ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి విజయవాడ ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు కూడా అంతే సరైన ఛాయిస్. విశ్వేశ్వరరావు ప్రచురణలు సోషల్ బారోమీటర్స్.
‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకాన్ని జూన్ 15 శనివారం సాయంత్రం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. కె. రామచంద్రమూర్తి సభాధ్యక్షులు, ఎమెస్కో విజయకుమార్ ఆత్మీయ అతిథి.
డానీ