Share News

కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు భేష్

ABN , Publish Date - May 23 , 2024 | 05:20 AM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం...

కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు భేష్

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకోవడం వల్ల కొంత అయినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన ప్రజా హక్కులు కాపాడబడ్డాయి. అసలే వెంటిలేటర్ మీద ఉన్న ప్రజాస్వామ్యానికి ఇంది కొంత బలాన్ని ఇచ్చింది.

రాజ్యాంగాన్ని, ప్రజా హక్కులను కాపాడవలసిన అధికారులు సరైన ప్రణాళికలు లేకపోవడంతో బాటు హింసాత్మక ఘటనలపై వెంటనే స్పందించకపోవడం, నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. వీటిని ఎంతమాత్రం ఉపేక్షించరాదు. ఇలాంటి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వీరు భయంతోనైనా తమ విధులను సక్రమంగా నెరవేరుస్తారు.


పల్నాడు, అనంతపురం ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అప్‌‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది.

ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘం ఇంత తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికల సంఘం స్పందించిన తీరు బాగుంది. సీఈసీ భవిష్యత్తులో మరింత చురుగ్గా వ్యవహరించి ప్రజాస్వామ్యానికి పట్టంగట్టాలి. ప్రపంచ పటంలో మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేయాలి.

అవధానం శ్రీనివాస్, కడప

Updated Date - May 23 , 2024 | 05:20 AM