‘‘తెలుగు ముస్లిం కథకు ఆదరణ పెరిగింది’’ - వేంపల్లె షరీఫ్
ABN , First Publish Date - 2024-02-19T01:17:45+05:30 IST
తెలుగు ముస్లిముల జీవన వైవిధ్యాలను, సంస్కృతీ సంప్రదాయాలను, పేదరికాన్ని శక్తిమంతంగా సాహిత్యంలోకి తెస్తున్న కొద్దిమంది కథకుల్లో వేంపల్లె షరీఫ్ ఒకరు. అలా అని షరీఫ్ ముస్లిం కథకుడు అంటూ...
తెలుగు ముస్లిముల జీవన వైవిధ్యాలను, సంస్కృతీ సంప్రదాయాలను, పేదరికాన్ని శక్తిమంతంగా సాహిత్యంలోకి తెస్తున్న కొద్దిమంది కథకుల్లో వేంపల్లె షరీఫ్ ఒకరు. అలా అని షరీఫ్ ముస్లిం కథకుడు అంటూ ముద్రవేసి చూడటం పెద్ద మర్రిచెట్టును బోన్సాయ్ మొక్కగా కుండీలో కుదించి చూపడమే అవుతుంది. ఇతివృ త్తం ఎంపికలో, కథానిర్మాణంలో, పాత్రల చిత్రీకరణలో, మొత్తం కథను ఉత్తమంగా మలచడంలో అతనిదొక ప్రత్యేకత.
కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన ‘జుమ్మా’ కథల సంపుటితో పాటు ‘టోపి జబ్బార్’ అనే మరో కథల సంకలనాన్ని షరీఫ్ వెలువరించారు. మరో కథకుడు ఖదీర్ బాబుతో కలసి ముస్లిం నేపథ్య కథల సంకలనం ‘కథామినార్’ వెలువరించారు. ఇటీవలే తెలుగులో 40 ఏళ్లలోపు వయసున్న యువ కథకుల సంకలనం ‘యువ-అండర్ ఫార్టీ’ని తీసుకొచ్చారు. ఇటీవల రాసిన ‘మట్కా’ కథను కేస్ స్టడీగా తీసుకుని కథ వెనక కథను నెమరు వేసుకున్నారు. తెలుగులో ముస్లిం సాహిత్యం స్థితిగతులనూ తలపోసుకున్నారు.
ఇటీవల షరీఫ్ రాసిన ‘మట్కా’ కథ నేపథ్యం...
రాయలసీమలోని చాలా ఊళ్లలో ఇప్పటికీ మట్కా జాడ్యం వేళ్లూనుకుపోయి ఉంది. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కొంతమంది తెలిసినవాళ్లు మట్కా ఆడుతుంటే గమనించే వాణ్ణి. పేదరికంలో ఉన్న వారిని ఆశల పల్లకిలో ఊరేగిస్తోంది మట్కా. ఈ సమస్యపై కథ రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. మట్కాకు ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లున్నాయి. కొన్ని చోట్ల దీన్ని బ్రాకెట్ అంటారు. కథలో మొదట నసీమూన్ పాత్ర ప్రతికూల పాత్రపై తిరుగుబాటు చేసినట్టు రాసుకున్నాను కానీ ఆ పాత్ర తిరుగుబాటు చేయ డానికి నిరాకరించింది. పాత్ర చెప్పినట్టు వినాల్సి వచ్చింది.
పాత్ర గొప్పదా? రచయిత గొప్పవాడా?
పాత్రే గొప్పది అంటాను. ఎందుకంటే రచయిత పాత్రను సృష్టిస్తాడు. తర్వాత దాని గమ్యాన్ని అదే వెతుక్కుంటుంది. బలవంతంగా దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తే కథ ఔచిత్యం దెబ్బతినే అవకాశం ఉంది. నా కథల్లో నేను చాలా సార్లు పాత్రల మాటే విన్నాను. నేనేదో అనుకుని మొదలు పెడితే పాత్ర ఇంకేదో అనుకుని అర్ధాంతరంగా ముగిసి పోతుంది. మంచి రచయిత పాత్ర మాటే వింటాడని నా నమ్మకం. అయితే కథ ప్రధాన అంశాన్ని నిర్దేశించేది మాత్రం రచయితే.
ప్రతి కథా ఒక సవాలే!
నేను రాసిన ‘తలుగు’ అనే కథ కూడా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. కులాలే లేవు అని నమ్మే ముస్లిం సమాజం కుల వ్యవస్థను ఎలా పాటిస్తుందో చెబుతూనే మొత్తం ముస్లిం సమాజాన్ని మెజార్టీ సమాజం ఎలా చూస్తుందో చెప్పే ప్రయత్నం చేశాను. ముస్లిముల్లో నువ్వు ఏ ఉపకులానికి చెందినవాడివైనా సరే అంతిమంగా మెజార్టీ సమాజం పెట్టే పరీక్షకు నిలబడాల్సిందే అనే అర్థాన్ని కూడా ప్రభావ వంతంగా ఇవ్వదల్చుకున్నాను.
ఇలాంటి సమాకాలీన, రాజకీయ, సాంస్కృతిక అంశాల కథలు రాస్తున్నప్పుడు ఇతర ఏ వర్గ రచయితకు లేని సవాళ్లు ముస్లిం రచయితకు ఎదురవుతాయి. కథలో లేని అర్థాలు ధ్వనించి ఏ వర్గం మనోభావాలు దెబ్బతిన్నా కథ ఉద్దేశ్యం నెరవేరదు. అందుకే స్వతహాగానే కథ రాయడం ఒక సవాలైతే ఇలాంటి ఇతి వృత్తాలతో రాయడం డబుల్ సవాల్. కథా లక్షణాలను పట్టించుకుంటూనే ఈ విషయాలను సమర్థవంతంగా రాయడంలో తెలుగు ముస్లిం కథకులు మంచి పరిణితితో వ్యవహరిస్తున్నారని నా అవగాహన.
ముస్లిం కథకు ఆదరణ పెరుగుతోంది
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగులో ముస్లిం కథకు ఆదరణ పెరిగింది. దేశ పరిణామాలను ఇవ్వాళ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతుండటమే అందుకు కారణ మని నేను భావిస్తాను. ఇప్పుడున్న పరిస్థి తుల్లో ముస్లిం సాహిత్య అవసరాన్ని పాఠ కులు, మేధావులు, పాత్రికేయులు గుర్తిస్తు న్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ మైనార్టీ సాహిత్యానికి ఆదరణ పెరిగింది. అయితే తెలుగులో విమర్శే ముస్లిం కథ మీద అనుకున్నంత రాలేదు. మైనార్టీ సాహిత్య పరిధిని కుదించి చూడటం లేదా ఆ జీవితాన్ని దగ్గరగా పరిశీలించిన అనుభవం, ఆసక్తి లేకపోవడం అందుకు కారణం కావొచ్చు.
తెలుగులో ముస్లిం సాహిత్యం ఎవరు చదువుతున్నారు?
ఇది చాలా కీలకమైన ప్రశ్న. చాలామంది ముస్లిం రచయితలు తెలుగులో రాస్తున్నారు అంటే తెలుగొచ్చిన మెజారిటేరియన్లతో పాటు ముస్లిములు చదువుతారు. అయితే తెలుగు చదివే ముస్లిములు ఎంతమంది ఉన్నారనేది కచ్చితమైన లెక్కల్లేవు.
పైనుంచి గమనిస్తే మిగతా సమాజంతోపాటు ముస్లిములు కూడా తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలోనే చదివిస్తు న్నారు. మదర్సాల్లో కూడా ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉంది. ఒకవైపు ఉర్దూ మీడియం, మరోవైపు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న పిల్లలు ముస్లిముల్లో పెరుగుతు న్నారు. వీరికి తెలుగు సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకుండా పోతోంది. అటు తెలుగు, ఉర్దూ రచయితల మధ్య సమన్వయం లేదు. వీరు అనువాదంతో ఆదాన ప్రదానాలు కూడా చేసుకోవడం లేదు. దీంతో అపార్థాలు వస్తున్నాయి. తెలుగు సాహిత్యం రాసే ముస్లిములు పూర్తిగా సొంత సమాజానికి వ్యతిరేకంగా రాస్తున్నారని కొంతమంది ఉర్దూ రచయితలు, ఉర్దూలో రచనలు చేసే వాళ్లు పూర్తిగా మతానికి అనుగుణంగా రాసి దాని పరిధి కుదిస్తున్నారని కొంతమంది తెలుగు రచయితలు భావిస్తున్నారు. వీళ్లిద్దరూ ఆ పరిధులు దాటి అపోహలను తుడిచేసుకోవాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను.
మరి ఇన్ని అవరోధాల మధ్య తెలుగు ముస్లిం సాహిత్య ఉద్దేశ్యం నెరవేరు తోందా?
అసలు మొత్తం సాహిత్య ఉద్దేశ్యమే నెరవేరుతోందా లేదా అనేది ఇవ్వాళ ఎవరికి వారు తేల్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి సాహిత్యానికి దాని పరిధిలో కొన్ని అవరోధాలు ఉండి తీర్తాయి. అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన పనిలేదు.
మొత్తం ముస్లిం సాహిత్యం గురించి కాకుండా కథా సాహిత్యం గురించి నేను కొంత చెబుతాను. తెలుగులో ముస్లిం కథ ప్రధానంగా రెండు రకాలుగా వస్తోంది. మొదటిది సొంత సమాజంలో సంస్కరణలను ఆశిస్తోంది. ఈ రకం సాహిత్యం 1980ల ప్రాంతం నుంచే ఉంది. ఆ మాటకొస్తే తెలుగులో తొలి ముస్లిం కథ పుట్టిందే అంతర్గత సంస్కరణ కోసం. ఈ సాహిత్యం మరి అంతర్గత సమాజం దగ్గరికి పూర్తి స్థాయిలో వెళ్తోందా.. అంటే నేను అంతకు ముందు చెప్పిన అవరోధాలు ఉన్నాయి.
ఇక రెండో రకమైన సాహిత్యం.. మెజార్టీ సమాజానికి ముస్లిములపై ఉన్న అపోహలను తొలగించే సాహిత్యం. దీనికి ఎలాంటి భాషాపరమైన అవరోధాలు లేవు కదా. అందుకే అవకాశం ఉన్నంతవరకు ఈ సాహిత్యం తన ఉద్దేశ్యాన్ని తప్పక నెరవేస్తోంది. ముస్లిం కథకు తెలుగు కథాభిమానుల దగ్గర్నుంచి వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనం.
సంభాషణ: గోవిందరాజు చక్రధర్