Share News

ఫేస్‌బుక్‌ గూటికి చేరిన తెలుగు సాహిత్యం

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:16 AM

‘‘మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా’’ మూడు సన్మాన సభలతోనూ, ఆరు ఆవిష్కరణ సభల తోనూ విరాజిల్లుతున్న సాహితీ కార్యక్రమాలు కరోనా విషశ్వాస తగిలి ఆర్చుకుపోయాయి. ఇంట్లోనో, పార్కులోనో, హోటల్‌లోనో, స్కూల్‌ కాలేజ్‌ ప్రాంగణాల్లోనో సాహిత్యాభి...

ఫేస్‌బుక్‌ గూటికి చేరిన తెలుగు సాహిత్యం

‘‘మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా’’ మూడు సన్మాన సభలతోనూ, ఆరు ఆవిష్కరణ సభల తోనూ విరాజిల్లుతున్న సాహితీ కార్యక్రమాలు కరోనా విషశ్వాస తగిలి ఆర్చుకుపోయాయి. ఇంట్లోనో, పార్కులోనో, హోటల్‌లోనో, స్కూల్‌ కాలేజ్‌ ప్రాంగణాల్లోనో సాహిత్యాభి మానులు అంతా కలిసి సమూహంగా ఏర్పడి ఓ పుస్తకం గురించో, ఓ కవి, రచయిత గురించో, ఓ ట్రెండ్‌ గురించో, ఏదైనా ఒక సమకాలీన సమస్య గురించో ఆలోచనల్ని ఒకరికొకరు పంచుకొని మాట్లాడుకునే రోజులు కరోనా కాలంలో దూరమయ్యాయి. ఆ విషమ పరిస్థితుల్లో చాలా వరకు సామాజిక మాధ్యమాలే సాహిత్యానికి వేదిక లయ్యాయి. లాక్డౌన్‌ వల్ల ఇళ్లకే పరిమితమైన సాహిత్యాభి మానులంతా ఇంటర్నెట్‌ వేదికగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించారు. అలా అలవాటుపడ్డాక కరోనా తర్వాత కూడా చాలా సమావేశాల్ని కార్యక్రమాల్ని నేడు ఇంటర్నెట్‌ వేదికగానే నిర్వహిస్తున్నారు.

కరోనా ఎన్నో విలువైనవాటిని మన నుంచి తీసుకుపోతూ మరికొన్నింటిని మనకి పరిచయం చేసింది. వాటిల్లో అంతర్జాల సదస్సులు (ఇంటర్నెట్‌ కాన్ఫరెన్సులు) ముఖ్యంగా చెప్పుకోదగినవి. వాట్సాప్‌, ఈమెయిల్‌, ఫేస్బుక్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్‌, ట్విట్టర్‌ (నేటి ‘ఎక్స్‌’)... ఇలా ఎన్నో సామాజిక మాధ్యమాల్లో రకరకాల సాహిత్య విషయాల చర్చలు, సమావేశాలు, కార్యశాలలు ముమ్మరంగా సాగుతున్నాయి. గూగుల్‌ మీట్‌, జూమ్‌, యూట్యూబ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ వంటి వేదికలలో నిరంతరాయంగా సదస్సుల, కార్యశాలల రూపంలో విజ్ఞానస్రవంతి సాగుతూనే ఉంది. ఈ మాధ్యమాల్లో వెల్లివిరిసే విజ్ఞానంలో భాగస్వాములు కావడానికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. సాహిత్యాసక్తి కలిగివుంటే చాలు. ఆయా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, వ్యక్తిగత కార్యక్రమాల నిర్వాహకులు ఇచ్చిన లింకు మీద ఒక్క మీట నొక్కడంతో నేరుగా ఆ కార్యక్రమంలోకి చేరి వీక్షించవచ్చు.

అప్పటివరకూ దిన, పక్ష, మాస పత్రికలలో వచ్చే సాహిత్య పుటల్ని, ఆదివారపు అనుబంధ సంచికలోని కథలను, వ్యాసాలను చదువుతూ ఉన్న పాఠకులు కరోనా మహమ్మారి వల్ల కొంతకాలం పత్రికలు స్తంభించిపోయినప్పుడు వెబ్‌-పత్రికలు చదవడం మొదలు పెట్టారు. కాలంతోపాటు వచ్చిన మార్పును గ్రహించి పత్రికా యాజమాన్యాలు కూడా పత్రికలను క్రమంగా ఇంటర్నెట్‌ ద్వారా ప్రజలకి చేరువ చేశాయి.

దిన, పక్ష, మాస పత్రికల్లో ప్రచురితమైతేనే గౌరవంగా భావించే కాలం నుంచి తన స్వీయ బ్లాగ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, లేక వెబ్‌ మేగజైన్స్‌ లోనో రాసుకునే వెసులుబాటు రావడంవల్ల రచయితల సంఖ్య గణనీయంగా పెరిగింది. తద్వారా చర్చలు, సదస్సులు, ఆవిష్కరణలు కూడా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఎక్కువమంది కవులకు, రచయితలకు చేరువగా ఉన్న మాధ్యమం ఫేస్‌బుక్‌. ఈమధ్య కాలంలో, ముఖ్యంగా తెలుగులో, మిగిలిన సాంకేతిక మాధ్యమాల కన్నా ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా చర్చలు, సమీక్షలు, విశ్లేషణలు, విమర్శలు విరివిగా జరుగుతున్నాయి.

ఇదివరకు కవులు, రచయితలు తమ భావాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను, సూత్రాలను పుస్తక రూపంలో ముద్రించి తీసుకు రావడానికి సంవత్సరాలపాటు సమయం పట్టేది. సాంకేతిక మాధ్యమాల వాడకం నేడు విస్తృతం అవ్వడం వల్ల కవి, రచయిత తన ఆలోచనని వెంటనే ఫేస్‌బుక్‌, వాట్సప్‌ మొదలైన మాధ్యమాల ద్వారా పాఠకలోకంతో వెంటనే పంచుకునే సౌలభ్యాన్ని ఈ మాధ్యమాలు రచయితలకి కల్పించాయి. ఎక్కడెక్కడో తెలుగు భాష కాని ప్రాంతాల్లో ఉండే తెలుగు పాఠకులు సైతం ఫేస్‌బుక్‌ ద్వారా తెలుగు రచనలు ప్రచురితమైన వెంటనే చదవగలుగుతున్నారు.

గతంలో ఏదైనా పుస్తకావిష్కరణ పెట్టుకొని పుస్తక సమీక్ష చేసే సదస్సుల్లో ముప్ఫై నుండి యాభైమంది పాల్గొనడం చాలా కష్టంగా ఉండేది. ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫేస్‌బుక్‌ లైవ్‌ కార్యక్రమంలో వంద నుండి రెండు వందల వరకు పాఠకులు చేరుతున్నారు. దానికి కారణం వ్యక్తులు భౌతికంగా ఎక్కడ ఉన్నాసరే తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌, ఐపాడ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ మొదలైన ఉపకరణాలతో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండటం.

అలాగే కొందరు సాహితీవేత్తలు నిర్వాహకులు వారంవారం ఒక ప్రముఖ కవి గురించో, రచయిత గురించో, కథల గురించో, విమర్శ గురించో లేదా ఒక వాద సాహిత్యం గురించో ఆయా రంగాల్లో కృషి చేసిన నిష్ణాతులైన వక్తల చేత ఫేస్‌బుక్‌లో ఉపన్యాసాలను ఇప్పిస్తున్నారు. అలాంటి పనిని చేబూనిన నిర్వహణ కమిటీలు కొన్ని ఉదాహరణకు: బహుజన కథా ఊట (పసునూరి రవీందర్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, చందు తులసి, జి. వెంకటకృష్ణ, మల్లిపురం జగదీశ్‌), సంతకం కవిత్వ పరామర్శ (ఎం.ఎం. వినోదిని), తెలంగాణ స్వేరో సర్కిల్‌ (పసునూరి రవీందర్‌), హర్యాలీ ముస్లిం వాద సాహిత్యం (స్కైబాబా, షాజహానా), హృదయగానం (కవి సమ్మేళనం), సాహితీ సౌరభం (మంచికంటి, శ్రీరామ్‌ పుప్పాల, శ్రీనివాసగౌడ్‌), రాయలసీమ సాహిత్య సభ (రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బండి నారాయణస్వామి, జి. వెంకటకృష్ణ, దాదాహయాత్‌, చిలుకూరి దీవెన, సడ్లపల్లి చిదంబరరెడ్డి), రాయలసీమ సామాజిక - సాంస్కృతిక ఉపన్యాసాలు (అప్పిరెడ్డి హరినాథరెడ్డి), కథా మానసీయం (మానస ఎండ్లూరి) మొదలైనవి పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమాల్ని వీక్షించే శ్రోతలు మూడు రకాలుగా కనిపిస్తారు. ఆసక్తితో విని కొత్త విషయాలను తెలుసుకోవాలనే శ్రోతలు మొదటి రకంవారు. అదేవిధంగా నిర్వాహకుల దృష్టిలో తాను కూడా కార్య క్రమంలో పాలుపంచుకున్నాను అని తెలియడంకోసం కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తులు రెండవ కోవకు చెందినవారు. మాట్లాడే వక్తను బట్టి కార్యక్రమానికి వచ్చే శ్రోతలు కూడా లేకపోలేదు. వీరు మూడవ విభాగానికి చెందినవారు. ఇలా ఫేస్‌బుక్‌ సాహిత్య విజ్ఞానం ఆయా రీతుల్లో శ్రోతలకి చేరుతుంది.

ఫేస్‌బుక్‌ ఉపన్యాసాలన్నీ ఒక ఎత్తు అయితే, ఫేస్‌ బుక్‌ సాహిత్య రాతలు మరో ఎత్తు. సాహిత్యంలో వస్తున్న కొత్త పోకడలను, ధోర ణులను ఎప్పటికప్పుడు రచయితలు గమనిస్తూ ఫేస్‌బుక్‌ వేదికగా కవితలు, కథలూ, కొందరైతే నవలలూ విస్తృతంగా రాస్తున్నారు. అంతేగాక కొన్ని సమూహాలు ప్రత్యేకంగా శీర్షికలు నిర్వహించి ఆయా సాహిత్య ప్రక్రియల్లో కృషి చేసిన వారిచేత వారం వారం వాటిని నడిపిస్తున్నాయి. ఇలాంటి విశిష్టమైన పనిని కొందరు ఎవరికివారు చేస్తున్నారు, సమూహాలుగా కూడా జరుగుతున్నాయి. సమూహాల విషయానికి వస్తే ఉదాహరణకు: కవిసంగమం, కవిసమ్మేళనం, స్నేహకళాసాహితి, తెలుగు కవులు, పుస్తక సమీక్ష, సాహిత్యం, విశ్వసాహితి సమితి, తెలంగాణ పదాలు, ప్రతిలిపి, మన తెలుగు సాహిత్యం, దేశభక్తి సాహిత్యం, తెలుగు సందేహాలు, సమీక్షా సాగరం, ప్రేమ కవితలు, మన కవిత్వం, కవి సాయంత్రం, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, కవితా కథ సాధన, ఆంధ్ర సారస్వత పరిషత్‌, కొలిమి, సాహితీసేవ, వసంతమేఘం, కవిసంధ్య మొదలైన సమూహాలతో పాటు వేల సంఖ్యలో కథలకి, నవలలకి, విమర్శకి, సాహితీ విషయాలకు సంబంధించిన సమూహాలు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి.

శ్రోతల్లో మూడు తరగతులకి చెందినవారు ఉన్నట్లుగానే పాఠకుల్లో కూడా మూడు విభాగాలు కనిపిస్తారు. ఫేస్‌బుక్‌ సమూహంలో వచ్చిన పోస్ట్‌ను క్షుణ్ణంగా చదివి కొత్త విషయాలను గ్రహించాలనే ఆరాటపడే పాఠకులు ఒకరకమైతే, గ్రూప్‌ నిర్వాహకుల దృష్టిలో పడాలని పోస్ట్‌ కింద లైక్‌, కామెంట్‌, షేర్‌ చేసేవారు ఇంకొందరు. మరికొందరు పాఠకులు శీర్షిక రాసే రచయితను బట్టి చదువుతారు.

ఫేస్‌బుక్‌ వల్ల పాఠకుల, శ్రోతల సంఖ్య తప్పకుండా పెరిగిందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ పాఠకులు ఏ వర్గం నుంచి పెరిగారు అని పరిశీలించి చూస్తే, ఎగువ తరగతి ప్రజలే ఎక్కువగా ఇంటర్నెట్‌ వాడుతున్నారు. కొంతలో కొంత మధ్య తరగతివారిలో కూడా పాఠకులు, శ్రోతలు ఇంటర్నెట్‌ వాడకంలో ముందడుగు వేసారు. రోజువారి సంపాదనతో జీవనం సాగించే వారు కాని, పరిమితమైన సంపద కలిగిన వర్గాలవారుకాని ఇంటర్నెట్‌లో ఇంకా పాఠకులుగా మారలేదు. కారణం వీరికి ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు. అందువల్ల బీదవారిలో ఇంటర్నెట్‌ పాఠకులు ఎవరూ పెరగలేదనే చెప్పుకోవచ్చు. అలాగే కవి, రచయిత ఫేస్‌బుక్‌ మాధ్యమంలో పోస్ట్‌ చేసిన రాతల్ని, లేదా చెప్పే విషయాన్ని ఓపికగా చదివి, విని చర్చ చేసే వాతావరణం కొంతమందిలో లేకపోవడం కనిపిస్తుంది. దానివల్ల భావోద్వేగాలు రగిలి చర్చ పక్కదారిపట్టే సందర్భాలు ఎక్కువే ఉంటున్నాయి.

ఏదిఏమైనప్పటికీ ఇప్పటి వరకు తెలుగు సాహిత్య విస్తరణలో ఫేస్‌బుక్‌ గణనీయమైన పాత్ర వహించిందని కచ్చితంగా చెప్పుకో వాల్సిందే. ఇక మీదట కూడా ఈ మాధ్యమం ద్వారా ఇంకా సాహిత్య విస్తరణ జరగాల్సి ఉంది.

సారిపల్లి నాగరాజు

80083 70326

Updated Date - Jan 29 , 2024 | 05:16 AM