Share News

‘సుప్రీం’ లక్ష్మణరేఖ!

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:23 AM

రాజ్యాధినేతలే పక్షపాత ధోరణితో అన్యాయంగా నేరస్థుల కొమ్ము కాస్తే కంచే చేను మేసినట్లవుతుంది. గుజరాత్‌లో 2002లో ఘోరమైన గ్యాంగ్‌ రేపు సంఘటనలో (బిల్కీస్‌ బానో కేసు) ముంబై సెషన్‌ కోర్టు పదకొండు మందికి...

‘సుప్రీం’ లక్ష్మణరేఖ!

రాజ్యాధినేతలే పక్షపాత ధోరణితో అన్యాయంగా నేరస్థుల కొమ్ము కాస్తే కంచే చేను మేసినట్లవుతుంది. గుజరాత్‌లో 2002లో ఘోరమైన గ్యాంగ్‌ రేపు సంఘటనలో (బిల్కీస్‌ బానో కేసు) ముంబై సెషన్‌ కోర్టు పదకొండు మందికి 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముంబై సెషన్స్‌ కోర్టులో ఈ కేసు రావటానికి కారణం నిష్పక్షపాత విచారణ కోసం సుప్రీంకోర్టు 2004లో ఈ కేసును గుజరాత్‌ రాష్ట్రం నుంచి సీబీఐకి బదిలీ చేయటం. ముంబై న్యాయస్థానంలో న్యాయ విచారణ జరిగిన తర్వాత నిందితులకు శిక్ష విధించారు. అసలు కథ అప్పుడు మొదలైంది. గుజరాత్‌ బీజేపీ ప్రభుత్వం కాలం చెల్లిన 1992 లోని పాలసీని పరిగణనలోకి తీసుకొని శిక్షపడిన నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించింది. సుప్రీంకోర్టు ఈ సంవత్సరం జనవరి 8న తీవ్రమైన పదజాలంతో ఈ చర్యను తప్పుపట్టింది. నేరస్థులను రెండు వారాలలోపు జైలుకు వెళ్ళాలని ఆదేశించింది. ఈ సంఘటన మన న్యాయ వ్యవస్థ ఎంతగా న్యాయానికి కట్టుబడి వున్నదో అద్భుతంగా తెలియజేస్తున్నది. జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ యుజ్జల్‌ భయాన్‌‌లతో కూడిన బెంచి స్పష్టంగా గుజరాత్‌ ప్రభుత్వానికి శిక్ష కాల పరిమితిని తగ్గించి క్షమాభిక్ష యిచ్చే అధికారం కానీ, పరిధి కానీ లేదని తేల్చి చెప్పటం విశేషం.

నిజానికి పదకొండు మంది నేరస్థులలో ఒకడైన రాధేశ్యామ్‌ భగవాన్‌దాస్‌ షా హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు నిజాలను కప్పిపుచ్చి 2022లో క్షమాభిక్ష ఆర్డరు సంపాదించుకున్నాడు. గుజరాత్‌ హైకోర్టు అప్పటికే రెండుసార్లు అప్పీలు చేసినప్పుడు ఈ కేసు మహారాష్ట్ర న్యాయ పరిధిలోకి వస్తుందని, గుజరాత్‌ జ్యురిస్‌డిక్షన్‌లోకి ఇలాంటి విన్నపాలు తీసుకోవటం చట్ట సమ్మతం కాదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత కూడా గుజరాత్‌ ప్రభుత్వం నేరస్థులకు ఇలా క్షమాభిక్ష ఇవ్వటం పక్షపాత వైఖరికి పరాకాష్ఠ. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే చట్టాన్ని, న్యాయాన్ని సమాధిచేసినట్లయ్యేది. సరైన సమయంలో ఈ తీర్పు రావటం ముదావహం. ఒకవిధంగా ఈ తీర్పుతో మన దేశంలోని న్యాయస్థానాల వన్నె పెరిగినట్టయింది. చట్టానికి కట్టుబడి తీర్పులు ఉండవేమోనన్న అనుమానపు పొరలను ఈ తీర్పు తొలిగించినట్లయింది.

అంతేగాదు ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదించటం లాంటి విచక్షణాధికారాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా మరోసారి సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టి పాలకులకు చెప్పినట్లయింది. గుజరాత్‌ ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి తలవొంపులు తెచ్చింది. నిందితులనూ, నేరస్థులనూ సంస్కరించటంలో తప్పు లేదు. కానీ ఈ నేరస్థులు సమాజాన్ని, విలువలను లెక్కచేయని రీతిలో ఘోరాతి ఘోరమైన మానభంగానికి తలపెట్టటమే కాకుండా, ఆ కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపారు. ఇలాంటివారు ఉరిశిక్షకు అర్హులు. కానీ సంస్కరించే ధోరణిలో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించటమే ఒక విధంగా వారిని మంచి మార్గంలో పెట్టటానికి చేసిన ఆలోచనగా భావించవచ్చు. కానీ ‘దయగల’ ప్రభుత్వం ఈ రీతిలో మరిన్ని నేరాలు చేసేవిధంగా వారికి క్షమాభిక్షను అందించటం వల్ల భవిష్యత్తులో వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అదీగాక క్షమాభిక్ష ఇవ్వటానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవ్వన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. క్షమాభిక్ష దొరక్కపోతే ఇలాంటి శిక్షబడ్డ వారు సుమారు 14ఏళ్ళు జైలులో ఉండాలి. అందుకనే నేరస్థుడికీ నేరస్థుడికీ ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించటంలో తేడాలు ఉంటాయి. క్షణికావేశంలో తలపెట్టిన నేరం, అసంకల్పిత ప్రతీకార చర్య లాంటి వాటిల్లో కొంతలో కొంత విచక్షణను ఉపయోగించవచ్చు. క్షమకు ఎవరు అర్హులనేది ప్రభుత్వాలు అనేక కొలతబద్దల ఆధారంగా మానవీయ కోణంలో, సంస్కరణను దృష్టిలో ఉంచుకొని నిర్వహించాలి. చట్ట ప్రయోజనాలకు, సమాజానికి జరిగే హానిని దృష్టిలో పెట్టుకోకుండా అధికారం ఉంది కదా అని బరితెగించి నచ్చినవారికి మేలు చేయటానికి చట్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలూ, కోర్టులూ చూస్తూ ఊరుకోవు. విచక్షణాధికారానికి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ గీయటమే కాకుండా ప్రభుత్వాలకు హద్దులు ఏర్పరచటం న్యాయచరిత్రలో ఒక చెరిగిపోని పేజీ.

రావులపాటి సీతారాంరావు

Updated Date - Jan 17 , 2024 | 05:23 AM