Share News

ఎండ

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:35 AM

వేలవేల అద్దాలు బద్దలైనట్టు, సముద్రాలు ఆవిరై ఒంటి మీద ఊరుతున్నట్టు. ఉపమానాలన్నీ పాతబడ్డ పోలికలై తూలికల్లా ఎగిరిపోతున్నట్టు...

ఎండ

వేలవేల అద్దాలు బద్దలైనట్టు,

సముద్రాలు ఆవిరై

ఒంటి మీద ఊరుతున్నట్టు.

ఉపమానాలన్నీ పాతబడ్డ పోలికలై

తూలికల్లా ఎగిరిపోతున్నట్టు

నీడ విలువ

నీటి విలువ

చెట్ల విలువ

తెలియజెప్పే ఒక కఠోర పాఠం ఎండ.

గాలి నిశ్చేష్ఠితమౌతుంది

జాలి అనార్ద్రమౌతుంది

ఎండలో కాయకష్టం

మరింత భారమౌతుంది

పక్క వీధి కూడా దూరమౌతుంది.

ఎటూ తోచదు

కవిత్వం వెలువడుతుంది గాని

అది వేడిగా వుంటుంది.

చంద్రుని గురించిన పాట కూడా

చందనంలా చల్లగా వుండదు.

పిల్లి వేటకు వెళ్ళదు

కుక్క వెల్లకిలా పడుకుని

అంగలారుస్తుంది.

కట్టెల మోపు నెత్తుకొని

ఆమె చకచకా నడుస్తుంది.

అవి నెత్తి మీదనే ఎండిపోయాయి.

నాకు ఆమె తలపై

చుట్టకుదురై నలగాలని వుంది.

డా. ఎన్.గోపి

Updated Date - Apr 17 , 2024 | 05:35 AM