Share News

భూపంపిణీతోనే రాజ్యాధికారం!

ABN , Publish Date - May 10 , 2024 | 12:39 AM

ప్రస్తుత రాజకీయాల్లో కింది కులాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్తున్న సందర్భంలో దళితులకు రాజ్యాధికారం, వ్యవసాయ భూమి ఈ రెంటిలో ఏది ప్రధానం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది...

భూపంపిణీతోనే రాజ్యాధికారం!

ప్రస్తుత రాజకీయాల్లో కింది కులాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్తున్న సందర్భంలో దళితులకు రాజ్యాధికారం, వ్యవసాయ భూమి ఈ రెంటిలో ఏది ప్రధానం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అవి ఒకటి వ్యవస్థకి, మరొకటి ఆర్థిక వనరుకి సంబంధించినప్పటికీ, వేరు వేరు అంశాలుగా కనిపించినప్పటికీ, ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి.

సాధారణంగా సామాజిక ఉద్యమాలు లక్ష్యాల వైపు ప్రయాణంలో విఫలమయ్యేది ప్రజలను సమీకరించడంలోనే. ముందుగా ప్రజలు ఏ సమస్య వలన ఇబ్బంది పడుతున్నారు, ఎందువలన ఉద్యమంలో భాగం కావట్లేదు అనేది పరిశీలన చేసుకోవాలి. నేను గ్రామీణ ప్రాంతాలలో పరిశోధన నిమిత్తం తిరిగినప్పుడు కింది కులాల్లో వ్యవసాయ భూమి లేకపోవడం ప్రధాన సమస్యగా గుర్తించాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న దళితులు స్వంత భూమి లేని కారణంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. అంటే భూమి ఉన్నా లేకున్నా వ్యవసాయ భూమి అనేది వారి రోజువారి జీవనోపాధికి ప్రధానమైనది. చారిత్రాత్మకంగా చూస్తే దళితులకు స్వాతంత్రం కంటే ముందు వ్యవసాయ భూమిపై హక్కు లేదు. అప్పుడు ఉన్న జమిందారీ, ఇనాందారీ, రైత్వారీ లాంటి వ్యవస్థలన్నీ కూడా ఆధిపత్య కులాలకు మేలు చేసినవే. కాబట్టి దళితులు భూమి పొందే అవకాశమే లేదు. ఉదాహరణకు, రాయలసీమ ప్రాంతంలో అప్పటి కలెక్టర్ థామస్ మన్రో అమలు చేసిన రైత్వారీ రెవిన్యూ వ్యవస్థను గమనిస్తే, పంట పండించే వనరులున్న ఎవరైనా భూమిని వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. అయితే దళితులకు వాళ్ళ లేబర్ పవర్ తప్ప ఎలాంటి వనరులు లేవు. అంటే ఈ రైత్వారీ వ్యవస్థ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది వనరులున్న అగ్ర కులాలే. ఈ విధంగా అప్పటి ఏ రెవిన్యూ వ్యవస్థ కూడా కింది కులాలకు మేలు చేయలేదు.


స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వాలు భూ సంబంధిత చట్టాలు తెచ్చి దళిత, ఆదివాసి, వెనకబడిన వర్గాలకు భూ పంపిణి చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో అవలేదు. ల్యాండ్ సీలింగ్‌లో కొంత మిగులు భూమి వచ్చినప్పటికీ అది కాలక్రమేణా మళ్ళీ అగ్రకులాల చేతుల్లోకి వెళ్లిపోయింది. దళితులలో ఉన్న కొద్దిపాటి రైతులను గమనిస్తే ఎక్కువ భాగం చిన్న సన్నకారు రైతులే.

అందుచేత, ఇక్కడ సామాజిక ఉద్యమాల ప్రధాన ఎజెండా రాజ్యాధికారం కంటే భూమిగానే ఉండాలి. ఇది తదుపరి సామాజిక చైతన్యం వైపు, రాజ్యాధికారంవైపు పయనించేందుకు దోహదం చేస్తాయి. సంక్షేమ పథకాలు దళితులకు ఎంత ముఖ్యమో అందులో భాగంగా భూమి, దాని అనుబంధ వనరులు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరిట దళితులకు భూపంపిణీ చేయడాన్ని పూర్తిగా విస్మరించాయి. భూ పంపిణీ జరిగేలా పౌర హక్కుల సంఘాలు, మేధావులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి.

చిన్నరంగయ్య దండు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

Updated Date - May 10 , 2024 | 12:39 AM