Share News

ఆత్మవిమర్శ మొదలుపెట్టండి!

ABN , Publish Date - Jan 09 , 2024 | 02:08 AM

కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో పునాది లేకుండా నిర్మించిన బంగారు తెలంగాణను, మేడిపండు చందంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను, వారి అభివృద్ధి వెనుక నిజానిజాల్ని ముఖ్యమంత్రి...

ఆత్మవిమర్శ మొదలుపెట్టండి!

కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో పునాది లేకుండా నిర్మించిన బంగారు తెలంగాణను, మేడిపండు చందంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను, వారి అభివృద్ధి వెనుక నిజానిజాల్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెర తీసి తెలంగాణ సమాజం ముందు ఉంచారు. ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించని గత నాయకుల పాలనలో సంక్షేమ పథకాలు అందక, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఎక్కడికక్కడే బందీ అయిపోయారు. అభివృద్ధి అంటే హైదరాబాదు చుట్టూరా గుళ్ళు, సచివాలయం, విగ్రహాలు, ఫ్లై ఓవర్లు, కలెక్టరేట్లూ కట్టడం కాదు. అభివృద్ధి పట్నం నుంచి పల్లె వరకు సమానంగా అందాలి. పేదలకు ఇల్లు, పని చేసుకోవడానికి భూమి, తాగు సాగునీటి సౌకర్యం, రైతుకు గిట్టుబాటు ధర, ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి గ్రామస్థాయిలో గిడ్డంగి నిర్మాణ వ్యవస్థ, విద్యార్థులు చదువుకోడానికి అధునాతనమైన స్కూళ్ళూ కాలేజీలూ యూనివర్సిటీల నిర్మాణం, ప్రజలకు అందుబాటులో ఆసుపత్రులు, రోడ్డు రవాణా వ్యవస్థ, ప్రతి మారుమూల గ్రామానికి కరెంటు సౌకర్యం, నిరుద్యోగులకు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం... ఇలా అన్ని స్థాయిలలోనూ అభివృద్ధి జరిగినప్పుడే ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ముందంజ వేస్తుంది. కానీ కేసీఆర్ పాలనలో వీటన్నిటిని మరిచి కేవలం మందు షాపులను పెంచి ప్రజలను తాగుడికి బానిసలు చేశారు. లక్షల కోట్లతో నాసిరకమైన నీటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రం ఆదాయాన్ని దుబారా ఖర్చు పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు విపరీతమైన ఆదరణ రావడానికి కారణం కేసీఆర్ హయాంలో తొమ్మిదిన్నరేళ్ళపాటు జరిగిన నిర్లక్ష్యపూరిత పాలనే!

నెల రోజులు కూడా పూర్తి కాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వారు పెట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఒక మహిళ నాలుగు సార్లు వస్తే పట్టించుకోలేదంటూ వారి పేపర్‍లో రాసుకున్నారు బాగానే ఉంది. కానీ ఈ తొమ్మిదిన్నరేళ్ళలో మీ ప్రభుత్వం చుట్టూ ఆ మహిళ ఎన్నిసార్లు తిరిగి ఉంటుందో, అలాంటి ఇంకెందరో ప్రజలు లెక్కకు మించిన ఆర్థిక సమస్యలతో మీ ఎమ్మెల్యేల చుట్టూ, అధికారుల చుట్టూ ఇంకెన్నిసార్లు తిరిగి ఉంటారో కూడా ఆలోచించి ఉండాల్సింది. అలాంటివారిని ఏ రోజైనా పట్టించుకున్న, కలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ఉన్నారా? కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురికి మాత్రమే మాట్లాడే, పరిపాలించే అధికారం ఉన్నట్లు నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అధికారం, అధికారులు ప్రజల చెంతకు చేరడంతో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇది మీ పాలనా లోపమేనని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి.

బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని, నియంతృత్వ పాలనను ఎండగడితే ప్రతీకారం ఎట్లా అవుతుంది? మీరు రెండు పర్యాయాలు పరిపాలన చేసినప్పుడు ప్రతి పనిలో గత పాలకుల పాలనను పనిగట్టుకొని అహంకారపూరితంగా విమర్శించలేదా? ‘గతంలో తెలంగాణ మొత్తం ఎడారిగా ఉండే మేము వచ్చినాకనే జనసంచారం జరిగింది, సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది’ అన్న స్థాయిలో గొప్పలు చెప్పుకోలేదా? ‘32 మెడికల్ కాలేజీలు కాదు, 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టివుంటే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి గెలిచేవారు’ అంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టును ప్రచారం చేస్తున్న కేటీఆర్‍.. మరి పేపర్ లీకేజీలను, నిరుద్యోగుల సమస్యలను, అక్రమ అరెస్టులను, రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలను దృష్టికి తెచ్చేందుకు అప్పట్లో నెటిజెన్లు చేసిన ట్వీట్లను ఎలా నిర్లక్ష్యం చేశారో కూడా గుర్తు తెచ్చుకోవాలి. ట్వీట్లు పెట్టడం మాని వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి గ్రామాల్లోని ప్రజల దగ్గరకు వెళ్లివుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుండే! ఈ పదేళ్ళ కాలంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మీ గుప్పిట్లోనే కదా ఉన్నది, మీ చుట్టునే కదా ఈ ఛానల్స్ తిరిగింది, మరి అప్పుడు జరిగింది తప్పుడు ప్రచారం కాదా?

కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులు పాలించిందే పాలన అన్నవిధంగా గత తొమ్మిదిన్నరేళ్ళూ గడిచాయన్నది నగ్నసత్యం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా, సామాజిక న్యాయమే లక్ష్యంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకే ఈ కొత్త సంవత్సరం ‘రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా’ తొలి అడుగులు వేస్తుంది.

మండ్ల రవి,

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - Jan 09 , 2024 | 02:08 AM