Share News

ప్రజల మనిషి శ్రీపాదరావు

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:32 AM

సమాజ హితమే ధ్యేయంగా, ప్రజల సేవలో నిస్వార్థంగా నిరంతరం నిమగ్నమయ్యే నాయకుల తరం దాదాపుగా అంతరించిపోతోంది. వ్యాపార ప్రయోజనాల కోసమే రాజకీయాలలోకి వచ్చి చట్టసభలలో...

ప్రజల మనిషి శ్రీపాదరావు

సమాజ హితమే ధ్యేయంగా, ప్రజల సేవలో నిస్వార్థంగా నిరంతరం నిమగ్నమయ్యే నాయకుల తరం దాదాపుగా అంతరించిపోతోంది. వ్యాపార ప్రయోజనాల కోసమే రాజకీయాలలోకి వచ్చి చట్టసభలలో తిష్టవేసేవారు గణనీయంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో నిన్నటి నాయకోత్తములను స్మరించుకోవడాన్ని సైతం సమాజం విస్మరిస్తోంది. కాల వైపరీత్యం!

అడవులు, నదులు, వాగులు, వంకల మధ్య కాలినడకన లేదా ఎండ్ల బండ్లపై గ్రామ గ్రామానికి వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే నాయకులు ఉండే వారంటే ఇప్పటి తరానికి ఒకింత ఆశ్చర్యం కూడ కలుగవచ్చు. గోదావరి, ప్రాణహిత, మానేరు నదులు పారుతూ అడవులు విస్తారంగా ఉన్న మంథని ఒక విలక్షణ ప్రాంతం.

వేద పండితులకు నెలవుగా, వేద ఘోషల మంత్రపురిగా పేరొందిన మంథనికి తెలంగాణ తొలితరం విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య (1907–85), తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు దాకా పలువురు మహానుభావులను తెలుగు నేలకు, విశాల భారతదేశానికి అందించిన సుప్రసిద్ధ చరిత్ర ఉన్నది. ఆ జన హితుల, నాయక శ్రేష్ఠుల కోవలోనివాడే దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు (1935–99). గ్రామపంచాయితి స్ధాయిలో రాజకీయ ప్రస్ధానానికి శ్రీకారం చుట్టి శాసనసభ స్పీకర్ పదవి నిర్వహించి, ఒక దశలో ముఖ్యమంత్రి పదవికీ పోటిపడిన విలక్షణ నేత ఆయన.

తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక విస్తీర్ణంలో అతి పెద్ద నియోజకవర్గమైన మంథనిలో ల్యాండ్‌లైన్‌తో సహా ఏ విధమైన నవీన సమాచార మార్పిడి వ్యవస్ధ లేని ఆ కాలంలో ఉత్తరాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకుంటూ వాటి పరిష్కారానికై బస్సులో జిల్లా కేంద్రం కరీంనగర్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రాకపోకలు సాగించిన శ్రీపాదరావు తరహా నాయకులను ఈ కాలంలో ఉహించగలమా? సొంత నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి గ్రామాలకు సాగు నీరు అందండం లేదన్న ఫిర్యాదుతో ఆయన నాలుగు గంటల బస్సు ప్రయాణం చేసి జగిత్యాలకు వచ్చి ప్రాజెక్టు అధికారుల వద్దకు వెళ్లేవారు. ఎలాంటి వ్యక్తిగత భద్రత (ఆ కాలంలో శాసనసభ్యులు ఎవరు కూడ గన్‌మాన్లను కోరుకునేవారు కాదు) లేకుండా అటవీ గ్రామాలలో తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండేవారు.

మంథని అడవులలో పని చేయడాన్ని ఒక శిక్షగా ప్రభుత్వ ఉద్యోగులు భావించే వారు. సాధారణంగా సస్పెన్షన్‌కు బదులుగా మంథని, మహాదేవపూర్ తాలుకాలకు ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడం పరిపాటిగా ఉండేది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో తన నియోజకవర్గంలో విధులు నిర్వహించడానికి శ్రీపాదరావు ప్రభుత్వ ఉద్యోగులను ఒప్పించుకుని తీసుకువచ్చేవారు.

మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, లోక్‌సభ స్పీకర్, మాజీ కేంద్ర హోం మంత్రి అయిన శివరాజ్ పాటిల్‌తో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయ హస్టల్‌లో ఒక గదిలో ఉండి చదువుకున్న శ్రీపాదరావు పీవీ నరసింహారావుకూ ఆప్తుడు. అయినా తన దైనందిన ప్రజాజీవితంలో ఆ సాన్నిహిత్యాన్ని ఆయన ఎప్పుడు వాడుకోలేదు.

1983 ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం శ్రీపాదరావు శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎన్నికయినా 1994లో ఓటమి పాలయ్యారు. 1999లో శ్రీపాదరావును నక్సలైట్లు హతమార్చారు. నక్సలైట్ల దుశ్చర్యపై సర్వత్రా నిరసన వ్యక్తమయింది.

డి.జి.పిగా పని చేసి పదవి విరమణ చేసిన యం. మహెందర్ రెడ్డి తన ఉద్యోగ జీవితాన్ని ఏయస్పిగా గోదావరిఖని నుంచి ప్రారంభించారు. అప్పుడు ఆయన పరధిలోకి వచ్చే మంథని నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతంలో ఉండడంతో శ్రీపాదరావు భద్రత ఆయనకు ఒక ఆందోళనకరమైన ఆంశంగా ఉండేది. అయితే శ్రీపాదరావు స్వీయ భద్రత గరించి పట్టించుకునేవారు కాదు. తాను ప్రజల మనిషినని వారి మధ్య ఉంటూ సమయం వచ్చినప్పుడు అదే మట్టిలో కన్ను మూస్తానని ఆయన తరచు అనేవారు.

శ్రీపాదరావు హత్యానంతరం ఆయన వారసుడుగా ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు రాజకీయాలలోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమలు, ఐ.టి మంత్రిగా న్యూ ఢిల్లీలోని అధికార వర్గాలలో గుర్తింపు పొందుతున్నారు. ఆయన ఇటీవల తన తండ్రి జయంతిని అధికారికంగా నిర్వహించారు.

రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు, విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య, కార్యదక్షుడు శ్రీపాదరావు వంటివారితో పాటు పలువురు ఆధ్యాత్మిక, అభ్యుదయ, విప్లవ రచయితలతో పాటు దేశంలోను, విదేశాలలోనూ కీలక ఇంజినీరింగ్ రంగాలలో నిష్ణాతులయిన నిపుణులు కూడా ఎంతో మంది మంథని నుంచి ప్రభవించారు. శ్రీపాదరావు జయంత్యుత్సవాలకు ఏటా విదేశాల నుంచి కూడా కొంత మంది విచ్చేస్తుంటారు.

అవసరం లేకున్నా భద్రత సిబ్బంది, అనుచరగణం హంగామా, డాబు దర్పాలతో కార్లలో తిరిగితే మాత్రమే శాసన సభ్యులుగా గౌరవం పొందే ఈ కాలంలో శ్రీపాదరావు తరహా నాయకుల పేర ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే కాదు, కనీసం కొంత మేరకయినా వారి అడుగుజాడలలో నడిచేందుకు ప్రయత్నించాలి. అదే శ్రీపాదరావుకు నిజమైన నివాళి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Mar 06 , 2024 | 01:33 AM