Share News

పలుకు సంస్కారం

ABN , Publish Date - May 12 , 2024 | 02:36 AM

పొలాల్ని పోగొట్టుకున్న భూమి భాష భూముల్ని పోగొట్టుకున్న సేద్యకారుల భాష నెలవులను పోగొట్టుకున్న నిర్వాసితుల భాష ఉపాధి లేక వాలిపోతున్న ఖాళీ చేతుల భాష...

పలుకు సంస్కారం

పొలాల్ని పోగొట్టుకున్న భూమి భాష

భూముల్ని పోగొట్టుకున్న సేద్యకారుల భాష

నెలవులను పోగొట్టుకున్న నిర్వాసితుల భాష

ఉపాధి లేక వాలిపోతున్న ఖాళీ చేతుల భాష

వలసలతో ఖాళీ అవుతున్న గ్రామాల భాష

ఆకలితో మాడిపోతున్న లక్షల నాగళ్ళ భాష

మూతపడ్డ కుటీర శ్రమాలయాల దుఃఖభాష

తెరుచుకున్న పానశాలల్లో కూలిన కాపురాల భాష

మాదక వాణిజ్యకాండలో మత్తిల్లిన పిల్లల భాష

మీకు అక్కర లేదు

బ్యాలెట్ కోసం మీకు అక్కరైన భాష వేరు,

అధికారార్జనే దాని ఏకైక వ్యాకరణ సూత్రం

మీ భాష నిండా

అసత్య ఘీంకారాలు అహంకార హుంకారాలు

అభూత కల్పనలూ అల్లిక కథలూ మాయల ప్రాసలూ

నిందాపూర్తి దండకాలూ స్వోత్కర్షల వమనాలూ

బూతు ప్రేలాపనలూ బట్టలిడిచిన బరిబాత సవాళ్లు

కల్పితావేశాల వ్యంగ్యేంద్రజాల వాచక ప్రదర్శనలు


మీ భాషకు తేటగాలులు మకిలబారుతున్నాయి

సంస్కార పుష్పాలు వడలి తెగి రాలిపోతున్నాయి

మర్యాద గృహాలు నిరసన గడియలేసుకుంటున్నాయి

పూర్వ మహనీయులు వీధి విగ్రహాల్లో ఖిన్నులవుతున్నారు

భాష మీ సొంత ఆస్తి కాదు, జాతి ఉమ్మడి ఆస్తి

బతుక్కి లాగానే భాషనూ కాపాడుకుంటుంది ప్రజ!

బహుళ జనులు శ్రోతల పాత్ర నుంచి జరిగి ఎగిసి

వేదిక లెక్కి తమ బతుకు కలల భాషే, కడగండ్ల భాషే

పనిముట్ల భాషే అసలైన సజీవ భాష అని ప్రకటిస్తారు

మీ భాషను ఓడించి సజీవ భాష వర్ధిల్లుతుంది

దర్భశయనం శ్రీనివాసాచార్య

Updated Date - May 12 , 2024 | 02:36 AM