జలజగడాలు కొనసాగవలసిందేనా?
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:44 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం కావాల్సిన దుస్థితి నేడు నెలకొని ఉంది. ఆశాజనకమైన అంశమేమంటే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం కావాల్సిన దుస్థితి నేడు నెలకొని ఉంది. ఆశాజనకమైన అంశమేమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవడం, అంతకుముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంసిద్ధత వెలిబుచ్చి ఉండడంతో ఇరువురిలోనూ సమస్యల పరిష్కారానికి నిజాయితీ ఉందని భావించవచ్చు. పైగా ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు లేవు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే కాకుండా సోదరులైన ప్రజల మధ్య కూడా స్నేహ సంబంధాలు నెలకొనాలనే ఆకాంక్ష ఉంది. కాబట్టి పట్టువిడుపులతో ఇద్దరూ ప్రయత్నిస్తే ఈ ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలు పరిష్కారం కాకున్నా, మున్ముందు దారి దొరకకపోదు. ఎంతటి జటిల సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొన్న సంఘటనలున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నా ఇవన్నీ ప్రభుత్వాల స్థాయిలో ఉన్నవి మాత్రమే. కాని అంతర్ రాష్ట్ర జల వివాదాలు ప్రభుత్వాల మధ్యనే కాకుండా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చురేగి పతాకస్థాయికి చేరి ఉన్నాయి. ప్రధానంగా ఇరువురు ముఖ్యమంత్రులు జల జగడాలకు ముందుగా తెరదించే యత్నం చేయాలి.
కేసీఆర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉప్పు నిప్పుగా ముగిసింది. తదుపరి అయిదేళ్ల కాలంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇరువురూ అలాయ్ బలాయ్ ఆడుకున్నా దుష్ఫలితాలే మిగిలాయి. కేసీఆర్ బడిపంతులు పాత్ర పోషిస్తే, జగన్మోహన్ రెడ్డి మన్నన గల విద్యార్థిగా వ్యవహరించేవారు. తత్ఫలితంగా మూడవ ట్రిబ్యునల్ నియామకం జరిగింది. పైగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇరువురూ పలుమార్లు సమావేశమైనా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రావణకాష్ఠంగా ఉన్న జల జగడాల గురించి గాని, ఇతర అపరిష్కృత సమస్యలు గాని చర్చకు వచ్చిన సందర్భం లేదు. వాళ్ళ ప్రైవేటు వ్యవహారాలతో పాటు విందులతో సమావేశాలు ముగిసేవి. ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై గొంతెండిపోతున్న దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటు నిత్య క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దక్షిణ తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల్లో బ్రేక్ పడింది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినపుడు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోరారు. నీటి కేటాయింపులు జరిగితే తప్ప ఆ ప్రాజెక్టు ముందుకు పోదు. ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే గాని ఇది సాధ్యం కాదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెసి కెనాల్‌కు నీటి కేటాయింపులు ఉన్నాయి. 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు గల ఈ పథకానికి కేవలం 1.25 టియంసిలు నీటి సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ ఒక్కటే దిక్కు. 20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలంటే తెలంగాణ భూభాగంలో ముంపు వస్తుంది. తెలంగాణ అనుమతి ఇస్తేనే ముందుకు సాగుతుంది. రెండు రాష్ట్రాలకు ఉపకరించే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం జరగాలన్నా తెలంగాణ ఆమోదం తప్పని సరి. ఒక్క మాటలో చెప్పాలంటే కవల పిల్లలు వాణి–వీణ విడివడలేక ఎలా బాధపడుతున్నారో అలా కృష్ణా జలాల అంశంలో దక్షిణ తెలంగాణ, రాయలసీమ వాసుల పరిస్థితి ఉంది. జల జగడాలకు సంబంధించి ఇరువురు ముఖ్యమంత్రులు ముందుగా ఒక అంశం పరిగణనలోకి తీసుకోవాలి. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ, రాయలసీమలోనూ పెండింగ్ ప్రాజెక్టులు గాని కొత్త ప్రాజెక్టులు గాని పట్టాలెక్కాలంటే ట్రిబ్యునల్ తీర్పులతో ఇప్పట్లో సాధ్యం కాదు, ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో రాజీపడి వ్యవహరిస్తేనే సాధ్యమవుతుంది. వాస్తవంలో నీటి లభ్యత ఎంత? అనేది ముందుగా అంచనాకు రావాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నపుడు లేక తక్కువగా ఉన్నపుడు ఆ మేరకు ఇరు రాష్ట్రాలు భరించే సానుకూల విధానం చేపట్టాలి.
గత పదేళ్లుగా కేసీఆర్ అమలు జరిపిన భావోద్వేగ విధానాల ఫలితంగా జరిగిన నష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ చేపట్టిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పదేళ్లు గడచిపోయినా ఇంతవరకు బయటికి రాలేదు. తిరిగి మరో ట్రిబ్యునల్ ఏర్పడింది. ఇది ఎంత కాలం తీసుకొంటుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు సోదరులైన తెలుగు ప్రజలతో ఉన్న రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు కొనసాగవలసిందేనా? ఈ పదేళ్ల కాలంలో అటు దక్షిణ తెలంగాణలోనూ, ఇటు రాయలసీమలోనూ నెర్రెలు బారిన పొలాలకు ఉపయోగపడే ఎంతో విలువైన కృష్ణా జలాలను కేసీఆర్... శ్రీశైలం నుంచి సముద్రం పాలు చేశారు. శ్రీశైలం కింద భాగంలో అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి పేరు చెప్పి వృథా చేశారు. 2023 మే నెలతో ఆఖరైన నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 2040 టియంసిల జలాలు వస్తే, 1330 టియంసిల నీళ్లు సముద్రం పాలయ్యాయి. రెండు రాష్ట్రాలు సఖ్యతగా ఉండివుంటే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు నికర జలాలు 811 టియంసిలు పోగా, క్యారీ ఓవర్ కింద అనుమతించిన 150 టియంసిలు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిల్వ చేసుకొని ఉండవచ్చు. అదే జరిగివుంటే 2024 వేసవిలో హైదరాబాద్ జంటనగరాల తాగునీటి కోసం సాగర్ నుండి ఎత్తిపోతలు తప్పేవి కదా? ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఈ సంక్షోభం కొనసాగకుండా తెరదించవలసిన కర్తవ్యం ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మీద ఉంది. రాజకీయ ప్రయోజనాలు విస్మరించి, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిపితే ఏదో ఒక తాత్కాలిక ఏర్పాటు కనుగొనవచ్చు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదన ఉంది. అయితే ఈ అన్యాయం బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి వాటాలు పంచినపుడు జరిగిందనే అంశం విస్మరించ కూడదు. దక్షిణ తెలంగాణ వాసులులాగే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాయలసీమ వాసులు తమకూ అన్యాయం జరిగిందనే భావనతో ఉన్న విషయం అందరికీ తెలుసు. బచావత్ ట్రిబ్యునల్ కూడా 1969కి నిర్మింపబడిన లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాతిపదికగా తీసుకొని కృష్ణా జలాలను బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. తదుపరి 2004లో వచ్చిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసి, వినియోగంలో ఉన్న నీటి కేటాయింపుల జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎలాంటి తీర్పు ఇస్తుందో పక్కన పెడితే, తాజాగా రెండు రాష్ట్రాలు కలసి 2099 టియంసిలు తమకు కేటాయించాలని ట్రిబ్యునల్ ముందు స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్ దాఖలు చేశాయి. తెలంగాణ 954.9 టియంసిలు కోరితే ఆంధ్రప్రదేశ్ 1,144 టియంసిలకు టెండర్ పెట్టింది. బేసిన్ మొత్తం మీద 2130 టియంసిలు లభ్యమవుతాయని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసి పంపకం చేస్తే, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మరొక 448 టియంసిల నికర మిగులు జలాలు బేసిన్ మొత్తం మీద ఉంటాయని అంచనా వేసింది. మరి రెండు తెలుగు రాష్ట్రాలకే 2099 టియంసిల నీళ్లు ట్రిబ్యునల్ ఎక్కడ నుండి తెచ్చి పంపకం చేస్తుంది? ఇంత కథనం ఎందుకంటే కేసీఆర్ నీళ్ల రాజకీయ వ్యూహం ఏ కడకు దారి తీసిందో, సాగునీటిరంగ నిపుణులు ముందు నవ్వులపాలు చేసిందో తెలియజెప్పడానికి మాత్రమే. నేల విడిచి సాము చేసే ఈ పెడధోరణుల నుండి ఇరువురు ముఖ్యమంత్రులు బయటపడవలసి ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముందు మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ రోజు కాకున్నా రేపైనా సుప్రీంకోర్టు స్టేతో ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుకు రావచ్చు. అదే జరిగితే కృష్ణలో మరొక 285 టియంసిల నీళ్లను ఎగువ రాష్ట్రాలు తన్నుకుపోతాయి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఏకంగా 170 టియంసిలు కేటాయించింది. పైగా ఆల్మట్టి ఎత్తు 525 మీటర్లకు పెంచుకొనే వెసులుబాటు కల్పించింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా దక్కేది కేవలం 38 టియంసిలు మాత్రమే. కాగా విద్యుదుత్పత్తి పేర మహారాష్ట్ర పశ్చిమ కనుమల నుండి ఎంత నీరు సముద్రం పాలు చేస్తోందో గణాంకాలు లేవు. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడూ ఎగువ రాష్ట్రాల జల దోపిడీ గురించి మాట మాత్రంగా ప్రస్తావన తేలేదు. ప్రతి క్షణం ఆంధ్రోళ్ల దోపిడీ అంటూ భావోద్వేగాలు పండించుకొనేందుకు విఫలయత్నాలు చేశారు. ఇప్పటికైనా ఇరువురు ముఖ్యమంత్రులు మున్ముందు రానున్న ప్రమాదం గురించి ఆలోచన చేయాలి. తమ మధ్య ఉన్న సమస్యలు రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగకుండా పరిష్కారం చేసుకొంటూ, ఎగువ రాష్ట్రాల జల దోపిడీకి వ్యతిరేకంగా సంయుక్తంగా పోరాడాలి.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు