Share News

ఆమె ఒక మహావృక్షం!

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:38 AM

ఒక మహా వృక్షాన్ని దూరం నుంచి చూస్తే దాని వైశాల్యం, కన్ను పారినంత ప్రాంతంలో అదెలా భాగమైపోయిందనే విషయాలు తెలుస్తాయి. వ్యక్తుల విషయంలోనూ దూరం నుంచి తెలుసుకున్నప్పుడు వారి ప్రతిభాపాఠవాలు, విజయాలు తెలుస్తాయి....

ఆమె ఒక మహావృక్షం!

నివాళి : సాయి పద్మ

ఒక మహా వృక్షాన్ని దూరం నుంచి చూస్తే దాని వైశాల్యం, కన్ను పారినంత ప్రాంతంలో అదెలా భాగమైపోయిందనే విషయాలు తెలుస్తాయి. వ్యక్తుల విషయంలోనూ దూరం నుంచి తెలుసుకున్నప్పుడు వారి ప్రతిభాపాఠవాలు, విజయాలు తెలుస్తాయి.

గత వారం ఆకస్మికంగా మరణించిన సాయి పద్మ గారి గురించి చెప్పుకోవాలంటే ఆవిడ పుట్టిన నలభై ఐదు రోజులకే పోలియో బారిన పడ్డారు. ఎన్నెన్నో సర్జరీలు, మరెన్నో ట్రీట్‌మెంట్స్ జరిగాక శరీరం పై భాగాన్ని కూడదీసుకుని వీల్ చెయిర్‌లో కూర్చోగలిగే అంతగా మాత్రమే కోలుకున్నారు. శారీరిక వైకల్యాన్ని అధిగమించి కామర్స్‌లో డిగ్రీ చేసి, ఆ పైన ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ, సైబర్ చట్టాలపై స్పెషలైజేషన్‌తో ఎల్‌ఎల్‌బిలో పట్టభద్రులయ్యారు. సంగీతం నేర్చుకున్నారు. గ్లోబల్ ఎయిడ్, బ్రేస్ టెక్ వంటి సంస్థలు స్థాపించారు. తెలుగులో కథలు, కవితలు రాశారు. సామాజిక సేవ చేశారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడారు. దేశవిదేశాలలో సభలు, సమావేశాలలో తన ఆలోచనలను వందల వేల మందితో పంచుకున్నారు. బ్రేసెస్ సాయంతో నడవడంతో పాటు ఈత కొట్టడం, డ్రైవింగ్ నేర్చుకున్నారు.

ఒక వ్యక్తి జీవిత కాలంలో ఇన్ని సాధించినప్పుడు ‘గొప్ప వ్యక్తి’గా, ‘ప్రతిభాశాలి’గా గుర్తించబడడంలో వింత లేదు. అయితే సాయి పద్మ మరణ వార్త విన్నాక సంతాప సందేశాల దగ్గర ఆగకుండా, ఎంతో మంది ఆవేదన చెందారు. దుఃఖం వ్యక్తం చేశారు. ఆవిడ లేకపోవడం వల్ల ఏర్పడ్డ శూన్యాన్ని పూరించలేమంటూ వాపోయారు. ఎందుకని?

ఒక మహా వృక్షం కిందకు చేరుకొని తలెత్తి పైకి చూసినప్పుడే దాని ధృడమైన కొమ్మలు, ఆకులతో అల్లిన దట్టమైన పందిరి కనిపిస్తాయి. కాస్తున్న కాయలు, రాలిపోతున్న పూలు కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ వృక్షం ఎన్ని ప్రాణులను తల్లిగా సాకిందో, ఎన్ని పక్షులకు, జంతువులకు ఆవాసమైందో అర్థమవుతుంది.

సాయి పద్మ ఆఫ్‌లైన్ ప్రపంచంలో తన సామాజిక కార్యక్రమాల ద్వారా ఎందరికో విద్య, ఉపాధి కలిపించారు. ఆన్‌లైన్ లోకంలో వేదనాభరితమైన తన రోజూవారీ జీవితాన్ని, దానిలో జయాపజయాలను, ఆశానిరాశలను అలతి పదాలతో, ఏ మాత్రం మెలోడ్రామా లేకుండా డాక్యుమెంట్ చేసుకుంటూ పోయారు. సోషల్ మీడియా అనగానే అనవసరమైన హంగూ ఆర్భాటమే అన్న అభిప్రాయం ఏర్పడిపోయిన ఈ కాలంలో ఆవిడ ఫేస్‌బుక్ పేజ్ ఒక ఒయాసిస్. అక్కడ జీవకాంక్ష, ధైర్యం, ఓదార్పు, హాస్యం, ఊరట, ప్రేరణ అన్నీ దొరికేవి. అన్నింటికన్నా ముఖ్యంగా వైవిధ్యం, బహుళత్వం పట్ల అసహనం, ఏకపక్ష కథనాల (singular narratives) వైపే మోజు ఉన్న ఈ కాలంలో, ఆవిడ సూక్ష్మాన్ని, మరో దృక్పథాన్ని పరిచయం చేయడానికే ప్రయత్నించారు. సంక్లిష్ట ఆలోచనలనూ సరళ భాషలో వ్యక్తీకరించగలిగారు. ఉదాహరణగా ఈ మాటలు చూడండి:

‘అంగవైకల్యం ఉన్న ఆడవాళ్ళను అయితే సూపర్ వుమన్‌గా, లేదంటే సూపర్ నథింగ్‌గా చూస్తారు. వాస్తవానికి రెండూ కారు’. ‘మాతృత్వం అంటే పిల్లల్ని కనడమనే కాదు. మాతృత్వం మనం ప్రకృతికి స్పందించే విధానం లోనూ ఉంటుంది. మన పట్ల మన స్పందించే తీరులోనూ ఉంటుంది. ఒకరిద్దరు పిల్లలకు జన్మనిచ్చి తల్లి అవ్వడం కన్నా నా శక్తిసామర్థ్యాల మేరకు అనేక మంది అనాథలకు ఆసరా అవుదామని నిర్ణయించుకున్నాను’. ‘మనసుతో పని చేయండి, మేధతో పని చేయండి అంటుంటారు. అసలు పని చేసి పెట్టే శరీరాన్ని మర్చిపోతుంటాం. మనలో అలసటను గుర్తించడం ముఖ్యం’.

అచ్చయిన పుస్తకాలు, వరించిన అవార్డులు ఒక రచయిత ప్రతిభకు ప్రధాన కొలమానంగా ఉన్న నేపథ్యంలో కూడా సాయి పద్మ రచనలు ముఖ్యమైనవి. #అమ్మకథలు, #అమ్మమ్మకథలు, #అకవిత్వం, #సాయిమ్యూజింగ్స్ వంటి హాష్ టాగులలో ఆవిడ పంచుకున్న జీవితానుభవాలు ‘కంటెంట్’ అన్న లేబుల్ కన్నా ‘సాహిత్యం’ కిందకే వస్తాయి. రచనలపై కాపీరైట్స్, మహిళా రచయితలపై సైబర్ బుల్లియింగ్ వంటి అంశాలపైన వ్యాసాలు రాయాలని అనుకున్నారు.

సాయి పద్మ అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ తన చుట్టూ ఉన్న జీవితాల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. కంటికి కనిపించే అంగవైకల్యాల గురించే కాక, మానసిక, ఆర్థిక, సామాజిక డిజబిలిటీస్ కూడా గుర్తించారు. స్త్రీలు తమ జీవితాలను డాక్యుమెంట్ చేసినప్పుడు అవి ఎందరికో ప్రేరణగా మారతాయనడానికి ఆవిడ రచనలే ఒక ఉదాహరణ. చేస్తున్న సామాజిక సేవ ద్వారానే కాకుండా, అక్షరాల మాధ్యమంతో కూడా ఎందరికో దగ్గరయ్యారు.

పూర్ణిమ

Updated Date - Apr 23 , 2024 | 03:39 AM