ఎస్సీ వర్గీకరణ: ఏం చేయాలి, ఎలా?
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:52 AM
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నవంబరు 11న నిర్వహించిన సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం, ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం దండోరా ఉద్యమ నాయకత్వంలో...
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నవంబరు 11న నిర్వహించిన సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం, ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం దండోరా ఉద్యమ నాయకత్వంలో నూతన ఉత్తేజాన్ని నింపింది. దాదాపు మూడు దశాబ్దాల తమ పోరాటం ఫలించబోతుందన్న సంతోషం దండోరా నేతలలో వ్యక్తం అవుతుండగా, మాల మహానాడు కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది.
ఉమ్మడి రిజర్వేషన్లలో జనాభా దామాషా ప్రకారం తమకు దక్కవలసిన భాగం దక్కటం లేదని, వాటిని మాల ఉపకులాలే కైంకర్యం చేస్తున్నాయని దండోరా ఉద్యమకారుల ఆరోపణ. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించటం ద్వారా తమ వాటా తమకు దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, చదువు, ఉద్యోగాలు పొందినవాళ్లూ ఇరువర్గాలలోను ఉన్నారని, మాల ఉపకులాలే రిజర్వేషన్లను అనుభవించాయన్న ప్రచారం వాస్తవ విరుద్ధమని మాలమహానాడు అంటోంది. దండోరా ఉద్యమ ఆరంభం నాటికే ఒక సామాజిక ఉద్యమ పరిణతిని సాధించిన దళిత సామాజిక నాయకత్వం ఈ వర్గీకరణ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనటంలో ఘోరంగా విఫలమైంది. దళిత నాయకత్వం దీనిని తమ సొంత సమస్యలా భావించి చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఆ కారణంగా ఈ రెండు ఉప కులాల మధ్య పూరించలేనంత అగాధం ఏర్పడింది. ఈ సుదీర్ఘకాలం అనేక ఉమ్మడి సమస్యలను తెచ్చిపెట్టింది. వర్గీకరణకు అనుకూలంగా, దానికి వ్యతిరేకంగా ఈ రెండు వర్గాలు చేస్తున్న వాదనలు, భావనలు అర్ధసత్యాలే. సత్యాసత్యాలను నిగ్గుదేల్చేందుకు ఈనాటికీ మాల మాదిగ నాయకత్వం ప్రయత్నించకపోవడం నష్టదాయకం.
ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందా, మాలల అభివృద్ధి అడుగంటి పోతుందా? రిజర్వేషన్స్‌తోనే దళితుల సకల సమస్యలు సమసిపోతాయా? ప్రభుత్వ రంగం ఉండి, రిజర్వేషన్లను త్రికరణశుద్ధిగా అమలుచేస్తే 16 శాతం మంది మాత్రమే ప్రయోజనం పొందుతారు, మిగతా 84 శాతం అసంఘటిత రంగాలలో జీవనోపాధి పొందవలసి ఉంటుంది. రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ మొత్తం జనాభాలో రెండు నుంచి మూడు శాతమే ఇప్పటికి అభివృద్ధి చెందారని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన సుమారు 97 శాతం ఇంకా అభివృద్ధి చెందాల్సిన స్థితిలోనే ఉంది. ప్రైవేటు రంగం శరవేగంగా విస్తరిస్తున్న వర్తమానంలో కూడా ప్రభుత్వ రంగంలోని రిజర్వేషన్ల చుట్టూనే ఇరువర్గాలు తిరుగుతున్నాయి. రిజర్వేషన్లు కలిగించే ప్రయోజనాలకు పరిమితులున్నాయి.
దళితులలో మాల, మాదిగ ఉపకులాలలోని రెండు వర్గాలలోనూ ఇప్పటికే అభివృద్ధి చెందిన వారున్నారు. ఉమ్మడి రిజర్వేషన్లు అమలయితే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తిరిగి వాళ్ళ వారసులే ముందు వరుసలో ఉండే అవకాశం అధికం. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రిజర్వేషన్లు కొనసాగితే మాదిగలలో వెనుకబడిన వారితోపాటు మాలలలో వెనుకబడిన వారు కూడా రిజర్వేషన్ల ఫలాలను అందుకోవడంలో ఆమడ దూరాన నిలిచి పోతారు. అలాగే, దండోరా కోరుతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ జరిగితే, ఆ వర్గీకరణ తర్వాత కూడా ఆయా గ్రూపులలో అభివృద్ధి చెందినవారే తిరిగి అవకాశాలను చేజిక్కించుకోవటంలో ముందు వరుసలో ఉంటారు. అంటే, ఇప్పటివరకు కొనసాగుతున్న పద్ధతే వర్గీకరణ అనంతరం కూడా కొనసాగి, అంతిమంగా రిజర్వేషన్ల అసలు లక్ష్యం ఇప్పటిలాగే అప్పుడు కూడా దెబ్బతినిపోతుంది. స్వల్ప మార్పులతో పరిష్కార రూపంలో సమస్య యథాతథంగా మిగిలిపోతుంది.
ఇప్పుడు దండోరా చూపుతున్న దారి సమస్య సమసిపోవటానికి సరిపోనపుడు, మాలల ఏకీకరణవాదంతో యథాతథస్థితి కొనసాగితే సమగ్రాభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉందా? అస్సలే లేదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన రెండు మూడు శాతమే తమ ప్రతిభతో మరలా అవకాశాలందుకుంటూ పోతుంటే ఇపుడిపుడే అక్షరాలు దిద్దుతున్న మిగిలిన ఉపకులాల వాళ్ళు సొంత సామాజిక వర్గంలోని వారితోనే పోటీపడలేక చతికిలపడి పోతారు. తమ సమూహంలోని చివరి మనిషికి మొదటి అవకాశం ఇవ్వడమే న్యాయమని, అదే రిజర్వేషన్ల అసలు లక్ష్యం అని నమ్మినపుడు, రిజర్వేషన్ల వర్గీకరణకు మాలలు విధిగా సానుకూలంగా స్పందించవలసి ఉంటుంది. లేదంటే తమ సమూహంలోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన వారి మధ్య వెనుకబడిన వారి మధ్య గల అంతరం అంతకంతకూ పెరిగిపోతూ పెద్ద అగాధమే ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ స్థాయికి మాలలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ ఇరువర్గాల నడుమ ఏర్పడిన అగాధాన్ని పూడ్చుతుంది. ఉద్యోగులకు నిరుద్యోగులకు నడుమ గల వైరుధ్యాన్ని తగ్గిస్తుంది. అందరికీ అవకాశమొస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. పరిమితంగానైనా అందరి అభివృద్ధికి కారణభూతమౌతుంది.
ఏపీ ప్రభుత్వం గతంలో అమలు జరిపిన ఏ బి సి డి పద్ధతి సరైనదేనా? నాలుగు గ్రూపులుగా విభజించి అరవై ఉప కులాలకు దామాషా ప్రకారం ఎలా సమన్యాయం చేయగలుగుతారు?. బీసీ ఉపకులాలలో ఇప్పటికే ఉన్న ఈ ఏ బి సి డి ఫార్ములా వైఫల్యం నుంచే కదా ఎంబిసి (అత్యంత వెనుకబడిన వర్గం) పుట్టింది. ఒక చోట సత్ఫలితాలు ఇవ్వని పద్ధతిని మరొక సామాజిక వర్గానికి అమలు చేయమని కోరటమూ, అందుకు ప్రభుత్వాలు ప్రయత్నించటమూ సహేతుకమేనా? ఏ బి సి డి పద్ధతి అశాస్త్రీయం. పరిష్కారమే మళ్లీ సమస్యగా మారే స్వభావం కలది. ఆయా ఉపకులాలలో అభివృద్ధి చెందినవాళ్ళే మరలా ఆయా ఉపకులాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చే పద్ధతి. మాల ఉపకులాలలో వెనుకబడిన పాలేరు, మాదిగ ఉపకులాలలో చెప్పులు కుట్టేవాడు వర్గీకరణ అనంతరం కూడా యథాతథంగా కొనసాగే పద్ధతి.
మరి, పరిష్కారం ఏమిటి? మొత్తంగా 60 ఉపకులాలు పరిమితంగానే అమలయ్యే రిజర్వేషన్లని తమ వెనుకబాటుతనం ప్రాతిపదికన అవకాశాలు అందిపుచ్చుకోగల పద్ధతిని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందని వారిని మొదటి లబ్ధిదారుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన వారిని ద్వితీయ లబ్ధిదారుగా మార్చటం ద్వారా ఇది సుసాధ్యం అవుతుంది. దీనికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సంబంధిత వ్యక్తులు పొందిన లబ్ధిని, వెనుకబాటు తనాన్నీ లెక్కించి వెయిటేజ్ మార్కులు ఇవ్వటం ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను సమర్థంగా నిర్వహించవచ్చు. జే.ఎన్.యు. వంటి చోట్ల అడ్మిషన్లలో ఇటువంటి పద్ధతి ఎప్పటినుంచో అమలవుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఈ పనిని సులభతరం చేస్తుంది. ఇది ఒకే సామాజికవర్గంలోని సహోదరుల మధ్య అభివృద్ధిలో గల వ్యత్యాసం తగ్గించి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, పార్లమెంట్ తీర్మానమూ అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినా సాంకేతికపరమైన, చట్టపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉండదు (దీనికి ఆద్యుడు ఎస్.ఆర్.వేమన). పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో దళిత నాయకత్వం తమ దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకవలసిన చారిత్రక సందర్భం ఇది. దీనిని అధిగమించి అనేక ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
బడుగు భాస్కర్ జోగేష్
న్యాయవాది