Share News

ఏది యథాతథం? ఏది మార్పు?

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:50 AM

రాజాసింగ్ అట్లా మాట్లాడితే, సరే, అది ఆయన స్థాయి అనుకోవచ్చు. మరి పెద్దాయన కూడా అంతకు మించి మాట్లాడితే ఎవరికి చెప్పుకోగలం, ఏం చేయగలం? అని ఓ కాంగ్రెస్ నాయకుడు నిస్సహాయంగా వ్యాఖ్యానించాడు...

ఏది యథాతథం? ఏది మార్పు?

రాజాసింగ్ అట్లా మాట్లాడితే, సరే, అది ఆయన స్థాయి అనుకోవచ్చు. మరి పెద్దాయన కూడా అంతకు మించి మాట్లాడితే ఎవరికి చెప్పుకోగలం, ఏం చేయగలం? అని ఓ కాంగ్రెస్ నాయకుడు నిస్సహాయంగా వ్యాఖ్యానించాడు. ఉన్నది లాగేసుకుంటారని, అందరిదీ తీసుకుని కొందరికి దోచిపెడతారని మోదీ చేస్తున్న ప్రచారం ఓటింగ్‌పై ఏమి ప్రభావం వేస్తుందో, దానికి విరుగుడు ఏమిటో కాంగ్రెస్ నేతలకు బోధపడడం లేదు. ఇప్పుడు అదనంగా కొత్తగా వారసత్వ పన్ను రగడ. నీతీ న్యాయం లేవా, నియమావళి లేదా, ఇంత అధర్మయుద్ధమా? అని కాంగ్రెస్ ఆక్రోశపడుతోంది. ఎన్నికల సంఘం కల్పించుకుని, నరేంద్రమోదీ మీద అనర్హత వేటు వేస్తుందని దానికేమీ ఆశలు లేవు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మంచీ చెడ్డా చెప్పి, పరిస్థితిని చక్కదిద్దుతాయన్న నమ్మకమూ లేదు. నిరసనలు, ఖండనలు వినిపిస్తున్నా, మోదీ, షాలు రోజుకు రోజు డోసు పెంచుతున్నారే తప్ప తగ్గడం లేదు.

ఈ దాడి వెనుక ఉన్నది భయమే తప్ప, విజయోత్సాహమేమీ కాదని కొందరు చేస్తున్న విశ్లేషణలు కాంగ్రెస్‌కు కొంత ఉపశమనం ఇవ్వవచ్చును కానీ, ప్రతి వ్యూహాన్ని ఇవ్వలేవు. మోదీ, షాలు చేస్తున్న విమర్శలలోని తీవ్రతకు, బేఖాతరుతనానికి దిగ్భ్రాంతి చెందడం ఆపివేసి, ఏమి చేయాలో ఆలోచిస్తే కొంత ప్రయోజనం ఉండవచ్చు. ఇదేదో అనూహ్యమైన విషయమైనట్టు, కనీవినీ ఎరుగని ఉల్లంఘన అయినట్టు బాధపడితే ఉపయోగం లేదు. ఎన్నికలనేవి అన్ని పక్షాలూ న్యాయబద్ధంగా పోరాటం చేసే వేదికలుగా ఉండాలని అనుకోవడం ఆదర్శమే తప్ప, వాస్తవం వేరు అనేది అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్న పక్షాలు అధికారబలం నుంచి అతిక్రమణలు చేస్తాయి. అబద్ధాలు చెబుతాయి. వక్రీకరిస్తాయి. పైగా, కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న పక్షం, గమ్యమూ, దాన్ని సాధించే సాధనాలూ ఏవీ పవిత్రంగా ఉండాలని విశ్వసించే రకం కాదు. ఎన్నికలు న్యాయంగా జరిపించాలని, తానూ న్యాయంగా ఉండాలని అనుకునే పక్షంలో, ఎన్నికల కమిషనర్ల నియామకంలో తటస్థతకు ఉన్న అవకాశాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకు తొలగిస్తుంది? అంపైర్ తమవాడైతేనే కదా, ఆట అనుకూలమయ్యేది? కాబట్టి, నియమావళి భయం లేని, ప్రపంచం ఏమనుకుంటుందో అన్న సంకోచమూ లేని బలశాలి పక్షం ఏమేమి చేయగలదో బీజేపీ అది చేస్తుంది. ప్రతిపక్షం ముందే ఆ విషయం ఊహించగలగాలి.


పదేళ్ల కిందట భారతీయ జనతాపార్టీ ఎన్నికల ప్రచారం, ప్రధానంగా అచ్ఛేదిన్ మీద కేంద్రీకృతమైంది. యూపీఏ పదేళ్ల కాలం చెడ్డరోజులన్న అభిప్రాయం జనంలో అప్పటికే ఏర్పడి ఉంది. 2019లో లాగా, ఇప్పటి లాగా, బీజేపీ ఉద్వేగపూరిత అంశాల మీద, విభజన కారక అంశాల మీద ఆధారపడి ఆనాడు ప్రచారం చేయలేదు. ఆ పార్టీ అమ్ములపొదిలోని అనేక అస్త్రాలు అప్పుడు అవసరమే పడలేదు. కానీ, ఈ పదేళ్ల కాలంలో, బీజేపీ తన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ప్రాతిపదికగా, దేశంలో ఉన్న భావవాతావరణాన్ని మార్చడానికి గట్టి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ దారుణంగా బలహీనపడినా, ప్రాంతీయపార్టీలు దాదాపుగా సాగిలపడినా లేక సర్దుకుపోయినా, బీజేపీ దూకుడు మాత్రం తగ్గలేదు. అభివృద్ధి గురించి, అసమానతల గురించి, రాజ్యాంగ హక్కుల గురించి, పర్యావరణం వంటి అంశాల గురించి, హేతుబద్ధ వైజ్ఞానికత గురించి మాట్లాడే గొంతులను నియంత్రించడానికి, రాజకీయ ప్రత్యర్థులను అదుపు చేయడానికి తీవ్ర చర్యలు తీసుకున్నది, నిర్బంధంతో సరిపెట్టుకోవడం కాదు, తన ప్రచార యంత్రాంగం ద్వారా సమ్మతిని కూడా రూపొందించుకుంది. అన్ని రకాల మీడియాను దారికి తెచ్చుకుని, విద్యాసాంస్కృతిక రంగాల మీద ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలలో చరిత్ర, వర్తమానం గురించిన అభిప్రాయాలలోనే మార్పు తేగలిగింది. 2014 దాకా ఒక ఘట్టం, ఆ తరువాత జరుగుతున్నది మరో ఘట్టం అన్నరీతిలో కొత్త చరిత్ర ఉనికిలోకి వచ్చింది. ఈ మొత్తం క్రమాన్ని ఉదారవాద, వామపక్ష ఆలోచనాపరులు కొంతలో కొంత గుర్తించి, ప్రశ్నించి, ప్రతిఘటించే ప్రయత్నం చేశారు కానీ, పదేళ్ల కాలంలో బాధితులుగా ఉన్న ప్రధాన రాజకీయపక్షాలు మాత్రం నిష్క్రియలోనే కూరుకుపోయి ఉన్నాయి.

కోటి నిఘానేత్రాలతో, లక్షల చేతులతో, వేలగొంతులతో పనిచేసే యంత్రాంగం అండతో, సాంకేతిక నిపుణత జోడించిన మేధలతో పనిచేస్తున్న బీజేపీని, కాంగ్రెస్ కానీ, దానితో వదులు వదులుగా చేతులు కలిపిన ఇతర ఇండియా కూటమి సభ్యపక్షాలు కానీ సాంప్రదాయ పద్ధతులతోనే ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉద్వేగ అంశాల మీద స్వారీ చేస్తున్న అధికారపక్షాన్ని, సామాజికార్థిక సమస్యల ప్రాతిపదికగా ఎదుర్కొనాలన్న ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో ఈ ఎన్నికల ఫలితాలు చెబుతాయి. ప్రజాశిబిరం నుంచి కూడా సృజనాత్మక ఉపాయాలతో అభిప్రాయ సమీకరణ చేసిన, చేస్తున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అయితే, ఎన్నికల ప్రచార పర్వంలో అధికారపక్షం చేసే ఒక్కొక్క వ్యూహాత్మక ప్రకటనా, అనేక మాధ్యమాలలో వందలరెట్ల తీవ్రతతో ప్రతిధ్వనించినప్పుడు, ఎదుర్కొనడం సాధ్యం కాదన్న నిరాశ కలగడం సహజం.

స్థూలంగా చూస్తే, ప్రభుత్వాల తీరు మీద ప్రజల అంచనాలు స్థిర వ్యవస్థలకు, యథాతథస్థితికి వ్యతిరేకంగా, మార్పుకు అనుకూలంగా ఉంటాయి. ఎన్నికలలో ఆ అంచనాల ప్రభావం ఉంటుంది. యోగ్యత కలిగిన ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు, అటువైపు మొగ్గు ఉంటుంది. ఈ క్రమం అంతా అనేక సామాజిక, స్థానిక సమీకరణాలకు, ప్రాబల్యాలకు లోబడి మాత్రమే జరుగుతుంది. యథాతథ స్థితిని కొనసాగిస్తూనే అన్ని పక్షాలూ, అన్ని ప్రభుత్వాలూ యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ధోరణిని అభినయిస్తూ, ఏవో మార్పులు కోరుకుంటున్నట్టు, సాధించినట్టు ప్రజలను మభ్యపెడతాయి కూడా. ఒక పార్టీని దించి మరొకదాన్ని ఎక్కించడమే మార్పు అనుకుని ప్రజలు కూడా మోసపోతూ ఉంటారు. స్వాతంత్ర్యానంతరం ఈ ఏడున్నర దశాబ్దాలూ ఈ రంగులరాట్నం తిరుగుతూనే ఉన్నది. గడచిన దశాబ్దంలో మాత్రం ఈ యథాతథస్థితి, మార్పు అన్న ద్వంద్వంలో ఒక చిత్రమైన విన్యాసం జరుగుతోంది. భారతీయ జనతాపార్టీకి ఓటువేస్తున్న పాత, కొత్త తరం ఓటర్లు, ఆ పార్టీని మార్పుకు ప్రతినిధిగా, ఒక రాడికల్ రాజకీయ శక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్‌తో సహా తక్కిన పార్టీలన్నిటిని యథాతథవాదానికి, కాలంచెల్లిన పాతదనానికి ప్రతినిధులుగా పరిగణిస్తున్నారు.


వాళ్లు అట్లా అనుకోవడమే కాదు, ఎంతో కాలంగా స్థిరపడిన అనేక అభిప్రాయాలను మార్చడంలోను, అనేక ప్రభుత్వ వ్యవస్థలలో మార్పు తేవడంలోను బీజేపీ క్రియాశీలంగా ఉంటోంది. దాని రాజకీయ వాదన ప్రకారం, సమాజంలోని సకల రుగ్మతలకు కారణం, 2014 కంటె ముందున్న పాలన, ముఖ్యంగా కాంగ్రెస్ పాలన. వాళ్లు కుటుంబ రాజకీయాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు, విదేశాలకు భూములు వదులుకున్నారు, పొరుగుదేశాలతో మెతకగా ఉన్నారు, మైనారిటీలకు సంపద దోచిపెట్టారు, చరిత్ర పుస్తకాలలో ఆక్రమణదారులకు ఎక్కువ అధ్యాయాలు కేటాయించారు, విద్యాలయాల్లో హేతువాదం చెప్పారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నెహ్రూ, అతని వారసులు దేశాన్ని ఎంతో భ్రష్ఠుపట్టించారు, బీజేపీ దాన్నంతా చక్కదిద్దుతోంది, గాయపడ్డ హిందూ హృదయానికి మందు పూస్తోంది. రామాలయం కట్టింది. హనుమాన్ చాలీసా పారాయణానికి గ్యారంటీ ఇస్తోంది. అవినీతిని అంతం చేసి, కుటుంబపాలనను రద్దుచేసింది. సంపదను మైనారిటీలు మినహా తక్కిన అణగారిన వర్గాలకు పంచబోతోంది. అల్పసంఖ్యాకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతోంది. కానీ, కాంగ్రెస్ అభిమానులూ ఓటర్లూ మాత్రం ఆ రోజులే బాగున్నాయంటున్నారు, తిరిగి ఆ రోజుల్లోకి తీసుకెళ్తామంటున్నారు. మార్పు ఎవరిది? యథాతథం ఎవరిది?

అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ఇందిరాగాంధీ తాను నల్లధనం మీద, అమెరికా మీద, భూస్వాముల మీద పోరాడుతున్నానని ప్రచారం చేసుకునేవారు. జనం దాన్ని ఎక్కువ కాలం నమ్మలేదనుకోండి. ఉన్నస్థితిలోని చెడు మీద యుద్ధం చేస్తున్న పక్షంగా బీజేపీ తనను తాను నిరంతరం ప్రదర్శించుకుంటున్నది. అనేక ఉద్వేగాలలో సేదతీరుతున్న సాధారణ ప్రజల దృష్టిలో, మార్పు భావన కూడా ఒక ఉద్వేగంగా మారిపోయింది. పాతను నిరాకరించడంలో ఉండే ఆకర్షణ వేరు. జాతీయోద్యమచరిత్రను, స్వాతంత్ర్యానంతర అర్ధశతాబ్ద కాలాన్ని నిరాకరించి, కొత్త ప్రతీకలను వరించడంలో ఉండే మిలిటెంట్ సంతృప్తి వేరు. ఉత్తర తెలంగాణలో ఒకప్పుడు ఉద్యమాలకు నెలవుగా ఉన్న ప్రాంతాలలో యువత ఇప్పుడు మోదీ ఆరాధకులుగా మారడం వెనుక ఈ మార్పు భావన ఉన్నది. అది కేవలం బూటకపు భావన మాత్రమేనని, వాస్తవానికి ఇప్పుడు కనిపిస్తున్నది మార్పే కాదని విమర్శకులు అనవచ్చు. మనోభావాల కాలంలో వాదనలు చెల్లవు.

సంపదను, అవకాశాలను అనర్హులకు దోచిపెట్టే ఆలోచనలున్న పార్టీ అని, కమ్యూనిస్టుల్లాగా ఉన్న ఆస్తులను లాక్కుని పంచిపెట్టే పథకాలు వేస్తున్న పార్టీ అని కాంగ్రెస్ మీద చేస్తున్న విమర్శలు ఆశ్చర్యకరమైనవి. అట్టడుగువర్గాలకు తొలి అవకాశాలు ఇవ్వాలనీ, అదనపు సంపదలు అందరిమధ్యా పంపిణీ కావాలనీ ఎవరైనా మాట్లాడితే, వాటిని ఆదర్శాలుగా గుర్తించేవారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికూడా అందుకు అనుగుణమైనదే. ఆ ఆలోచనలను ప్రతికూలమైనవిగా చిత్రించి, ప్రచారానికి ఉపయోగించుకోగలగడం ఆశ్చర్యకరం. అవును, మేం పంచి పెడతాం, సమానత్వం కోసం పనిచేస్తాం అని ప్రకటించి, రాజకీయ లాభం పొందగలిగే ధైర్యం కానీ, సంసిద్ధత కానీ కాంగ్రెస్ పార్టీకి లేకపోయింది. తానే మార్పును కోరుకుంటున్న శక్తిని అని చెప్పలేకపోతోంది. భారతీయుల భావప్రపంచం మీద బీజేపీ సాధించిన పట్టును ఇది సూచిస్తుంది.

కె. శ్రీనివాస్

Updated Date - Apr 25 , 2024 | 02:50 AM