Share News

అటు ఆ రాముడూ ఇటు ఆత్మారాముడూ

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:46 AM

శ్రీరామచంద్రుడి ఆహారంలో ఏ ఏ పదార్థాలుండేవి అన్న చర్చ ఆ మధ్య జరిగింది. అదే విషయం మీద అదేదో సినిమాను ఒక ఓటీటీ వేదిక వెనక్కి తీసుకుంది కూడా. ఆ కాలంలో రాముడు తాను పుట్టిన దేశంలో వంశంలో కులంలో ఏమి ఆహారం....

అటు ఆ రాముడూ ఇటు ఆత్మారాముడూ

శ్రీరామచంద్రుడి ఆహారంలో ఏ ఏ పదార్థాలుండేవి అన్న చర్చ ఆ మధ్య జరిగింది. అదే విషయం మీద అదేదో సినిమాను ఒక ఓటీటీ వేదిక వెనక్కి తీసుకుంది కూడా. ఆ కాలంలో రాముడు తాను పుట్టిన దేశంలో వంశంలో కులంలో ఏమి ఆహారం తినే ఆనవాయితీ ఉండేదో అదే తిని ఉంటాడు. కావాలంటే, వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో చదువుకుని లేదా పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి విద్వాంసుడి అనువాదాలు చదువుకుని తెలుసుకుంటే సరిపోతుంది. శ్రీరాముడు దేవుని అవతారమే తప్ప తానే దేవుడు కాదు కదా? ధర్మానికి ఏదో గ్లాని కలిగిందని మానవజన్మ ఎత్తి భూలోకం మీదికి వచ్చాడు. మనిషి పుట్టుక ఎత్తినందుకు, ఆహారనిద్రలు కష్టసుఖాలు వివాహసంతానాలు అన్నీ తప్పవు. మనలాగే జీవించి, మనలాగే బాధలూ బాదరబందీలూ అనుభవించాడు కాబట్టి, రాముడు మనసుకు దగ్గరగా అనిపిస్తాడేమో? కించిత్ కష్టానికి కూడా రామా అనుకుంటాం, అపచారం జరిగితే హేరామ్ అంటాం. తెగదెంపులు చేసుకోవాలంటే రాంరాం అనేస్తాం. రాముడెంతగా మన సంస్కృతిలో భాగమయ్యాడంటే, ఎంత రంగనాయకమ్మ అయితే మాత్రం రామరామ అనుకోరా? అని శ్రీరమణ గారు చమత్కరించారు!

ఆకలేసినప్పుడు ఆత్మారాముడు అల్లాడిపోతున్నాడంటాము. అంటే మనలోపల ఉన్నది రాముడేనని అర్థం. ఆయనను పస్తు పెట్టకూడదు కదా? త్యాగరాజులూ రామదాసులు కూడా రాముడిని పాడుకుంటూ అన్నంలో కూడా రాముడిని చూసుకున్నారు కానీ, ఉపవాసాలు ఉండలేదు. తనకు మాలిన ధర్మం ఉండదన్నట్టే, దైవం కూడా ఉండదు. అన్నానికీ రాముడికీ మధ్య పోటీ రాకూడదు! ఆత్మారాముడికీ రాముడికీ పంతం వస్తే, రెండువైపులా రాములే కదా? ఎవరు గెలవాలి?

రాముడిని అడ్డం పెట్టుకుని ఈ ఏడాది ఎన్నికలను అమోఘంగా, అమేయంగా గెలిచేయాలని నరేంద్రమోదీ ఆయన పరివారం అనుకుంటున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కలిగించిన భక్తిపారవశ్యాలు దేశప్రజలలో సజీవంగా ఉన్నాయని, పోలింగ్ దాకా పదిలంగా ఉంటాయని నమ్ముతున్నారు. శతాబ్దాల ఆరాటం ఫలించిన శుభతరుణం అనీ, కూలిన ఆత్మాభిమాన కేతనం తిరిగి రెపరెపలాడుతోందని చెప్పుకుంటున్న మాటలు రాజకీయ ఎంపికను తిరుగులేకుండా ప్రభావితం చేస్తాయని ఆశిస్తున్నారు. వాళ్లు అనుకోవడమే కాదు, మీడియా కూడా అదే వాస్తవాన్ని మోదీ ఇంటి కోడై కూస్తోంది. జట్టు కట్టలేని బలహీనతతో తమంతట తామే ఓటమిభావనలోకి కుంగిపోతున్న ప్రతిపక్షం కూడా మూడోసారి మోదీ విజయాన్ని ముందస్తుగానే అంగీకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. మోదీ బృందానికి ఇప్పుడు కావలసినది కేవల విజయం కాదు, ఘనాతి ఘన విజయం! దేన్నైనా తిరగరాయగల, దేన్నైనా నిర్వచించగల, వెయ్యేళ్ల భవితవ్యాన్ని శాసించగల తిరుగులేని విజయం!

మరి రాముడు అందుకు సహకరిస్తాడా? అంతగా సహకరిస్తాడా? తనకొక ఆలయం నిర్మించినందుకు కొంత ప్రసన్నత కలిగి ఉండవచ్చును కానీ, అంతకు మించిన విచక్షణ ఆ రామచంద్రప్రభువుకు ఉంటుంది కదా? ఎదుటి పక్షంలో రావణాసురుడు నిలబడి సవాల్ విసురుతుంటే, బహుశా, బాలరాముని కరుణాకటాక్షం మోదీ పైనే ప్రసరించే అవకాశం ఉండవచ్చు. కానీ, అవతలి పక్షంలో అశేషప్రజానీకంలోని ‘ఆత్మా రాముడు’ నిలబడితే, శ్రీరాముడికి పెద్ద సంకటమే వచ్చి పడుతుంది. ఇప్పుడటువంటి క్లిష్టపరిస్థితి ఏదో వచ్చిపడుతున్నట్టుంది. అసలుకే మోసం రాకపోయినా, 400 సంఖ్యచుట్టూ పెట్టుకున్న ఆశలకు గండి పడే ప్రమాదం కనిపిస్తోంది.

కొంతమంది కేంద్రమంత్రులు ఆ మాట అననే అన్నారు. దేశప్రజలు రామభక్తి తాదాత్మ్యంలో ఓలలాడుతుంటే, వారి దృష్టి మళ్లించడానికి ప్రతిపక్షం ఏవేవో వివాదాలు తెస్తోందని. ఉత్తరం--–దక్షిణం తగాదా గురించి ఆ మాట వచ్చింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రాలు ఇచ్చే పన్ను ఆదాయం, రాష్ట్రాలకు దక్కే కేంద్ర కేటాయింపుల గురించిన ప్రస్తావన వచ్చింది. ‘ఇట్లాగైతే కష్టం మరి, దక్షిణాది వాళ్లం ఆలోచించుకోవలసి వస్తుంది’ అని కర్ణాటక కు చెందిన ఒక నాయకుడు అన్నాడు. తరువాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆయనకు కేరళ నుంచి, తమిళనాడు నుంచి మద్దతు వచ్చింది. ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులందరూ ఢిల్లీకి వెళ్లడమో, మద్దతు చెప్పడమో చేశారు. 400 గమ్యం చేరాలంటే దక్షిణ దిక్కున కూడా కొన్ని విజయాలు కావాలి. ఈ వివాదం వాతావరణాన్ని దారి మళ్లిస్తోందని బీజేపీకి అనిపించింది. అనిపిస్తే, దాన్ని విస్మరించి అప్రధానం చేయాలి కదా, లేదు, ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి దీనికి జవాబు ఇచ్చే క్రమంలో మరింత ప్రాధాన్యం సమకూర్చారు!

ఈ ఉత్తర, దక్షిణ చర్చ ఏదో సాధిస్తుందని కాదు కానీ, రామాలయ వాతావరణంలో కూడా దక్షిణాది ఎడంగా, పెడగా ఉండడమే మోదీ ప్రభుత్వానికి జీర్ణం కావడం లేదు. దేశంలో ఈ వైవిధ్యం ఏమిటి? ఇంకా ప్రశ్నలు మిగిలి ఉండడమేమిటి? కేంద్రాన్ని పట్టుకుని లెక్కలూ పత్రాలూ అడగడమేమిటి? ఈ పరిస్థితి కొనసాగకూడదని ఉన్నది కానీ, 400 లక్ష్యం చేరితే తప్పితే ఇటువంటి ‘అరాచకాలు’ సరిదిద్దడం కూడా సాధ్యం కాదు మరి!

బడ్జెట్ సమావేశాలు కాగానే, అవసరమైన రాచకార్యాలూ తీసుకోవలసిన కీలకనిర్ణయాలూ తీసుకుని ఎన్నికల షెడ్యూలు ప్రకటించవచ్చుననుకుంటే, ఇప్పుడీ ఢిల్లీ ముట్టడి ముప్పు వచ్చి పడింది. ఈ వారం పదిరోజుల్లో ఎన్నికల తేదీల ప్రకటన వచ్చాక, రాజకీయ ప్రచార కార్యక్రమాల షెడ్యూలు ఒకటి, ఆధ్యాత్మిక కార్యక్రమాల షెడ్యూలు ఒకటి, విడివిడిగా రంగంలోకి దిగుతాయి. శోభాయాత్రల సందడి ఎన్నికల హడావిడికి సమీపంగా ఉంటే బాగుంటుందన్న ఆకాంక్షలూ ఉంటాయి. భక్తి వాతావరణం నుంచి రాజకీయ లాభం పిండుకోవాలని ఆశిస్తుంటే, ఏమిటి ఈ పంజాబ్ హర్యానా రైతులు మద్దతు ధర అంటూ వార్తావరణాన్ని అంతటినీ ఆక్రమిస్తున్నారు?

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చడమే అంటూ మార్కెట్ వాదులు సిద్ధాంతాలు చేస్తున్నారు. ఆ డిమాండ్ ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది. కానీ, వ్యవసాయోత్పత్తుల ధరలు ఏ ప్రాతిపదికన నిర్ణయించాలో సిఫారసు చేసిన స్వామినాథన్‌కు, మద్దతు ధర కోసం ఉద్యమించి స్వయంగా రైతు నాయకుడైన చరణ్ సింగ్‌కు ఈ ప్రభుత్వమే భారతరత్న ప్రకటించింది! ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడమెలాగో తెలియడమే కాదు, దీర్ఘకాలం నిర్బంధాన్ని సహించగలిగిన సత్తా కూడా కలిగిన రైతాంగం ఇప్పుడు దేశరాజధానిలో మోహరించింది. వారు ఎంతవరకు విజయం సాధిస్తారో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం మోదీ పరివారం కోరుకున్న ఉద్వేగాల వ్యాప్తిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు.

పరిస్థితి చేతిలో లేకుండా పోయిందని, జనహృదయాలను ఆవరించడంలో మోదీ విజయవంతమయ్యారని బాధపడడం మానేసి, ప్రతిపక్షాలు ప్రజల వాస్తవ సమస్యలను మళ్లీ రంగం మీదికి తేవడానికి తమవంతు ప్రయత్నం చేయడం మంచిది. మహాబలశాలి అయిన ప్రత్యర్థిని నిలువరించడానికి చిన్నదో పెద్దదో ఏదో చేయలేకపోతే, పిల్లిలో ఎలుక ఐక్యం అయిపోయినట్టు, అధికారస్రవంతిలో కలిసిపోవడం మంచిది. ప్రజల ధ్యాసను తమవైపే నిలుపుకోవడానికి వివిధ పక్షాలు ప్రయత్నించడం సహజం. అన్నిరకాల శక్తియుక్తులూ హంగులూ కలిగిన పక్షం, ఆ ప్రయత్నం విజయవంతంగాను, విస్తృతంగానూ చేయగలదు. అలాగని, ప్రజలు ఎప్పుడూ తమ ఆలోచనల మీద, మనోభావాల మీద అదుపు లేకుండా ఉంటారని అనుకోవడం కూడా పొరపాటు. అతి పెద్ద కృత్రిమ సంరంభం నుంచి కూడా ఆకులు అల్లాడిన సవ్వడి వైపు వారు దృష్టి మళ్లించుకోగలరు. కాకపోతే, అందుకు మానవప్రయత్నం కావాలి. దేవుడిని తమ పార్టీలో చేర్చుకున్నామని గర్విస్తున్నవాళ్లు కూడా, చేసింది మానవప్రయత్నమే.

రాముడు ఆలయాల్లోనే కాదు, అందరిలోనూ ఉన్నాడని ఆధ్యాత్మికవాదులే చెబుతుంటారు. చరాచర ప్రకృతిలో, సమస్త జీవరాశిలో దైవం ఉనికిని గుర్తించడమే గొప్ప తాత్వికత అని నమ్ముతారు. మనుగడ పోరాటం చేస్తూనే, దైవాన్ని ధ్యానించుకోవాలని తుకారాం, కబీర్ వంటి వారు బోధించారు. ప్రజలు తమ జీవనపోరాటం చేయవలసిందే, అధిక ధరల మీద, అవినీతి మీద, విద్వేష వాతావరణం మీద, నిరుద్యోగం మీద, ఆర్థిక అంతరాల మీద పోరాడవలసిందే. మరో మార్గం లేదు. తన నామాన్ని జపించుకుంటూ కర్తవ్యాన్ని విస్మరిస్తే రాముడు సంతోషించడని భక్తులకు తెలుసు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే లాభం లేదని పెద్దలే చెబుతారు. ఆత్మారాముడి ఆకలి తీర్చకపోతే, రాముడి ఆకలి మాత్రం ఎట్లా తీరుతుంది?

కె. శ్రీనివాస్

Updated Date - Feb 15 , 2024 | 05:46 AM