Share News

హామీల అమలులోనూ అదే నిబద్ధత...

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:25 AM

ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీలు ఇవ్వ‌డం గెలుపొందాక వాటిని ప‌ట్టించుకోక‌ పోవ‌డం చూస్తుంటాం. కానీ నేడు ఇందిర‌మ్మ రాజ్యంలో ప్ర‌జాపాల‌న‌లో ఇచ్చిన హామీల అమ‌లు ఒక్కొక్క‌టిగా ఆచ‌ర‌ణ రూపం దాలుస్తోంది....

హామీల అమలులోనూ అదే నిబద్ధత...

ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీలు ఇవ్వ‌డం గెలుపొందాక వాటిని ప‌ట్టించుకోక‌ పోవ‌డం చూస్తుంటాం. కానీ నేడు ఇందిర‌మ్మ రాజ్యంలో ప్ర‌జాపాల‌న‌లో ఇచ్చిన హామీల అమ‌లు ఒక్కొక్క‌టిగా ఆచ‌ర‌ణ రూపం దాలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన మొద‌టి వారంలోనే రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేశారు. వాటిలో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం అన్నది చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. మ‌రొకటి రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని రూ.5ల‌క్ష‌ల నుంచి రూ.10ల‌క్ష‌ల‌కు పెంచ‌డం. ఇవి రెండు అమ‌ల్లోకి రావ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల్లోనూ వేగంగా దూసుకుపోయాయి. ఇవి కొన‌సాగుతుండ‌గానే మ‌రో రెండు ప‌థ‌కాలు ఈ నెల 27న ప్రారంభం మార్చి 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. అవి రూ.500ల‌కే గ్యాస్ సిలెండ‌ర్‌, మ‌రొక‌టి 200లోపు యూనిట్ల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా. 6 గ్యారంటీల‌ను ఈ ఏడాదిలోనే అమ‌లు చేసే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లోనూ కేటాయింపులు చేసింది.

హామీలు ఇవ్వ‌డమే కాదు, ఇచ్చిన ప్ర‌తి హామీని ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేయ‌డ‌మే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ప‌ని తీరుగా విశదమవుతున్నది. ఇటీవ‌ల ప్ర‌వేశపెట్టిన బడ్జెట్టే దీనికి నిలువెత్తు సాక్ష్యం. బ‌డ్జెట్‌లో రాష్ట్ర మొత్తం రెవెన్యూ రాబ‌డులు రూ.2.05 ల‌క్ష‌ల కోట్లు ఉండ‌గా వాటిలో రూ.53,196 కోట్ల‌ను 6 గ్యారంటీల‌కే కేటాయించారు. అంటే 25 శాతం నిధులు. దీనిని బట్టే ప్ర‌భుత్వం క‌మిట్‌మెంట్‌ స్ప‌ష్టం అవుతుంది. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అంటే మిగ‌తా పార్టీల వాళ్లు న‌వ్వుకున్న సంద‌ర్భాన్ని కూడా మ‌నం చూశాం. చాలా మంది ఇది అమ‌ల‌య్యే ప‌థ‌క‌మేనా అనుకున్నారు. దానికీ బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. బ‌స్సు ఛార్జీలు చెల్లిస్తున్న‌ప్పుడే ఆర్టీసీ సంస్థ న‌ష్టాల్లో ఉంది. మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణంతో అది మ‌రింత న‌ష్టాల్లో కూరుకుపోయి చివ‌ర‌కు రాష్ట్రంలో ఆర్టీసీ అనేది ఉండ‌క‌పోవ‌చ్చు అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఆ పథకం అమ‌లే అలాంటి అనుమానాలన్నింటినీ ప‌టాపంచ‌లు చేసింది. బ‌డ్జెట్ స‌మావేశాల నాటికే 15.21కోట్లమంది మ‌హిళ‌లు ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం చేసినట్టుగా స‌ర్కార్ ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో ఆర్టీసీని మరింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం రూ.535 కోట్ల‌ను చెల్లించ‌డ‌మే కాకుండా 100 కొత్త బస్సులు కొన్నది. ద‌స‌రా, సంక్రాంతి అంటేనే ఆర్టీసికి సంబురం. ఆ స‌మ‌యంలో కూడా ఉచిత ప్ర‌యాణ ప‌థ‌కాన్నే కొన‌సాగించింది. ఇటీవ‌ల జ‌రిగిన మేడారం, కొముర‌వెల్లి, కొండ‌గ‌ట్టు, నాగోబా జాత‌ర‌ల‌కు సైతం ఎలాంటి ఛార్జీలు లేకుండా మ‌హిళ‌ల‌కు ఉచిత ప‌థ‌కాన్నే అమ‌లు చేయ‌డం హ‌ర్షించ‌ద‌గిన విష‌యం.

రాష్ట్ర బ‌డ్జెట్‌లోనూ ఉచిత విద్యుత్ గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ.2,418కోట్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. ఇదే కాకుండా విద్యుత్ సంస్థ‌లు ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ.16,825కోట్లు ముందు జాగ్ర‌త్త‌గానే కేటాయింపు సైతం జ‌రిగాయి. గృహ‌జ్యోతి ప‌థ‌కం కింద నెల‌కు 200యూనిట్ల లోపు ఉన్న‌ విద్యుత్ వినియోగ‌దారుల‌కు ఉచితంగానే విద్యుత్‌ను అందించనున్నారు. ఈ ప‌థ‌కం గృహాల‌కు ప‌రిమిత ఉచిత నెల‌వారీ అర్హ‌త వినియోగాన్ని(ఎంఈసీ) అందిస్తోంది. దీని ప్ర‌కార‌మే ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 34 ల‌క్ష‌ల కుటుంబాలు ఈ ప‌థ‌కానికి అర్హ‌మైన‌వని ప్రాథమికంగా గుర్తించారు. ప్ర‌జా పాల‌న‌లో 6 గ్యారంటీల‌కు క‌లిపి ఒక్క‌టే ద‌ర‌ఖాస్తులోనే పూర్తి చేయాల్సిందిగా సూచించిన స‌ర్కార్ నేడు దాని ప్ర‌కార‌మే గృహాజ్యోతి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతుంది. ఈ ప‌థ‌కానికి సొంత ఇల్లు ఉన్నవారే కాదు, అద్దెకు ఉండే వారు సైతం అర్హులని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. విద్యుత్ శాఖ‌కు కూడా స్ప‌ష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అద్దె ఇళ్ల‌లో ఉండేవారు మొద‌ట ఓ ఇంటి నంబ‌రు మీద ప‌థ‌కం పొందుతూ కొన్ని నెల‌ల త‌ర్వాత వేరే ఇంటికి మారితే కూడా ఈ ప‌థ‌కాన్ని పొందే విధంగా అవ‌కాశం కల్పించారు. ఈ ప‌థ‌కం అమ‌లుతో రైతుల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రాను ఎత్తివేస్తార‌న్న ప్రచారాన్ని కూడా ప్ర‌భుత్వం తిప్పికొట్టింది. రైతుల‌కు 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్‌ను అందించడానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఇటీవ‌ల‌నే రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర ఏ రోజు ఏ విధంగా మారుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. గ‌డిచిన ప‌దేళ్ల‌ల్లో ఎన్నిసార్లు గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయో ఆయా కంపెనీల‌కు త‌ప్ప ఎవ‌రికీ కూడా గుర్తులేని ప‌రిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలెండ‌ర్‌ను ఇస్తామ‌న్న హామీని 6 గ్యారంటీల‌లో భాగంగా అమ‌లు చేయ‌బోతుంది. ప్ర‌స్తుతం ఇప్పుడున్న ధ‌ర ప్ర‌కార‌మైతే స‌గం రేటుకే గ్యాస్ సిలెండ‌ర్ రాబోతుంది. రాష్ట్రంలో మొత్తం 1.20 ల‌క్ష‌ల గ్యాస్ కనెక్ష‌న్ల ఉన్నాయి. వీటిలో ప్ర‌తి నెల 44 శాతం మంది గ్యాస్ బుక్ చేసుకుంటున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీటిలో సుమారు 90ల‌క్ష‌ల మంది కుటుంబాల‌కు రేష‌న్ కార్డులున్నాయి. అంటే ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం కింద సుమారు 90 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మేలు జ‌రుగ‌బోతుంది. దీంతో ప్ర‌భుత్వానికి రూ.4,450కోట్ల వ‌ర‌కు భారం ప‌డే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా గ్యారంటీల అమ‌లే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.

6 గ్యారంటీల‌లో మ‌రో ప్ర‌ధాన‌మైన‌ది పింఛ‌న్లు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాధార‌ణ పింఛ‌ను నెల‌కు రూ.2016, దివ్యాంగుల‌కు 3016 చొప్పున చెల్లిస్తున్నారు. వీటికే ఏడాదికి రూ.12వేల కోట్లు అవుతుంది. ఎన్నిక‌ల హామీ ప్రకారం వీటిని సాధార‌ణ పింఛ‌ను రూ.4వేలు, దివ్యాంగుల‌కు రూ.6వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీటిని సైతం ఈ ఏడాదిలోనే అమ‌లు చేసేందుకు స‌ర్కార్ సిద్ధంగానే ఉంద‌నే విష‌యం బ‌డ్జెట్ కేటాయింపులే స్ప‌ష్టం చేస్తున్నాయి. పింఛ‌న్ల‌కే మ‌రో రూ.10వేల కోట్లు అద‌నంగా కేటాయింపులు జ‌రిగాయి. అంటే ప్ర‌భుత్వం ఈ ఏడాదిలోనే పింఛ‌న్ల పెంపును సైతం చేసేందుకే బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌ను చేసింద‌నే విష‌యం తేలిపోయింది.

కుల వ్య‌వ‌స్థ ఉన్న మ‌న దేశంలో సంక్షేమ ప‌థ‌కాలు అన్ని వ‌ర్గాల‌కు చేరాలంటే కుల గ‌ణ‌న‌నే ఏకైక మార్గ‌మ‌ని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. అందుకే రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలిసారిగా రాష్ట్రంలోనూ స‌మ‌గ్ర కుల గ‌ణ‌న నిర్వ‌హించాల‌ని అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. ఇది చరిత్రాత్మ‌క నిర్ణ‌యం. ఈ సర్వేతో రాష్ట్రంలో కులాల వారీగా జ‌నాభా లెక్క‌లు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ స్థితిగ‌తులు వెలుగులోకి వస్తాయి. సంక్షేమ పథకాలు అమలులోనూ ప్ర‌భుత్వాలు స‌రికొత్త ధోర‌ణిలో ముందుకు సాగే అవ‌కాశం వ‌స్తుంది. కుల గ‌ణ‌న‌తో విద్య‌, ఉద్యోగ రంగాల‌లో అమ‌లు చేస్తున్న‌ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశాలు కూడా శాస్త్రీయంగా వెలుగులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇత‌రుల‌కు అమ‌ల‌వుతున్న రిజ‌ర్వేష‌న్లు, వారున్న జ‌నాభా వంటి విష‌యాలు స్ప‌ష్టంగా తేలే అవ‌కాశం ఉంటుంది. త‌దనుగుణంగా రిజ‌ర్వేష‌న్ల పెంపు లేదా స‌ర్దుబాటు వంటి వాటిని స‌రైన ప‌ద్ధతుల్లో చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది. త్వ‌ర‌లోనే జ‌రుగ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల కంటే ముందే రాష్ట్రంలో కుల గ‌ణ‌న ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఆరు గ్యారంటీలే కాదు, రానున్న కాలంలో ఇంకా అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టుగా కూడా ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డి ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. రానున్న సంక్షేమ ప‌థ‌కాల‌లోనూ మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట వేసే అవ‌కాశం కూడా ఉంది.

డా. ఎన్.యాదగిరిరావు

అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ

Updated Date - Feb 27 , 2024 | 03:25 AM