Share News

రెవిన్యూకోర్టులు: కర్ర ఉన్నవాడిదే బర్రె

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:42 AM

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘టైటిల్ గ్యారంటి చట్టం’ రద్దు చేయాలని కొద్ది వారాలుగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. వారు కోర్టులను బహిష్కరిస్తుండటంతో న్యాయపరిపాలన...

రెవిన్యూకోర్టులు: కర్ర ఉన్నవాడిదే బర్రె

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘టైటిల్ గ్యారంటి చట్టం’ రద్దు చేయాలని కొద్ది వారాలుగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. వారు కోర్టులను బహిష్కరిస్తుండటంతో న్యాయపరిపాలన నిల్చిపోయింది. భూ వివాదాలను సివిల్ కోర్టుల పరిధి నుండి తప్పించి రెవిన్యూ కోర్టులకు అప్పగిస్తున్నారని, కనుక అది తమ జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున వారు ఆందోళన చేస్తున్నారని ప్రచారం. ‘టైటిల్ గ్యారంటి చట్టం’ భూ సంబంధాలలో తేదల్చుకున్న మార్పులను, గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేని ఓసారి పరిశీలిద్దాం.

‘టైటిల్ గ్యారంటి చట్టం’కు రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తరువాతే న్యాయవాదుల సమాజం, వామపక్ష సంఘాలు మేల్కొనడం విచారకరం. భూముల రీ సర్వే అందరి కళ్ళ ముందు జరుగుతూనే వుంది. అయినా ఎవరు బుర్ర పెట్టే శ్రమ తీసుకోలేదు. ఇప్పటికే వెయ్యికోట్లు ఖర్చుచేశామని, కొన్ని గ్రామాలలో మొత్తం సర్వే, హక్కుల నిర్థారణ ప్రక్రియలను పూర్తిచేసి కొత్త పద్ధతిలో ‘టైటిల్ డీడ్స్’ ఇచ్చేశామని రాష్ట్రం ప్రభుత్వం చెప్పుకుంటోంది. వివాదం వేడెక్కిన తరువాత ప్రభుత్వం తరఫున కొందరు అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అప్పటివరకూ ప్రభుత్వానికి బయట సమాజం ఒకటి ఉందని, తమ విధాన చర్యల వలన ప్రభావితం అయ్యే వర్గాలతో కనీస సంప్రదింపులు చేయాలని వారికి గుర్తు రాలేదు. ఇప్పటికైనా వచ్చింది. అదే పదివేలు.

భూమికి యజమాని ఎవరు? ప్రకృతి సిద్ధమైన ఈ భూమి మీద ఎందరో వచ్చారు, పోయారు. మరికొందరు రానున్నారు. ‘టైటిల్’ అనే మాటకు ‘యజమాని / హక్కుదారు’ అని అర్థం చెప్పుకోవచ్చు. ‘హక్కు’ అనేది కేవలం ఒకే ఒక రూపంలో, ‘యజమాని’ అనే ఒకే ఒక అర్థంలో ఉంటుందా? ఇతర హక్కులు లేవా? వుండవా?!. ఒక వ్యక్తికి ‘టైటిల్’ ఉందా లేదా అనే వివాదం వచ్చినప్పుడు, ఇప్పుడున్న ఏర్పాటులో, ప్రభుత్వం తమ వద్ద వున్న రికార్డులో ‘ఇలా నమోదై వుంది’ అని చెప్పి ఊరుకుంటుంది. అయితే ఆ టైటిల్‌ను ప్రశ్నిస్తున్న వ్యక్తి న్యాయస్థానంలో సవాల్ చేస్తాడు. టైటిల్ ఉందనుకుంటున్న ఆసామి సమర్ధించుకుంటాడు. పౌర న్యాయస్థానం విచారించి తీర్పు ఇస్తుంది. కొత్తగా తీసుకువస్తున్న పద్ధతిలో ఫలానా ఆసామిదే ఈ భూమి అని ప్రభుత్వమే నిర్ధారించి చెప్పేస్తుంది. అంతేగాక హక్కుదారని తాను నిర్ధారించిన వ్యక్తికి మద్దతుగా కూడా నిలబడుతుంది. ఇక ఇప్పుడు వివాదం హక్కును క్లయిం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. హక్కు అతనిదేనని చెప్పిన ప్రభుత్వానికి, దానిని ప్రశ్నించిన ఆసామికి మధ్య. ఒకవేళ ఆ వివాదంలో ప్రభుత్వం ఓడిపోతే తమ తప్పిదం వలన (సో కాల్డ్) టైటిల్ యజమానికి నష్టం జరిగింది గనుక నష్టపరిహారం ఇస్తామంటోంది. దీనినే ‘ఎష్యూరెన్స్‌ ప్రిన్సిపల్’ అని చెపుతున్నారు.

సుందర్ రాజన్ అయ్యంగార్ తన ప్రసిద్ధ గ్రంథం ‘లేండ్ టేన్యుర్ సిస్టమ్స్’లో భూమికి–రాజ్యానికి ఉన్న సంబంధం గురించి విపులంగా వివరించారు. మనం సాగు అనుభవానికి ప్రాధాన్యం ఇస్తాం. భూమి రాజు గారిది కాదు దానిని సాగు చేసే సమాజానిది. బ్రిటిష్ వారు తమ అనుభవం నుండి పర్మినెంట్ సెటిల్‌మెంట్‌లో తాము పెట్టిన జమిందార్లను తమవద్ద వున్న ‘లార్డ్స్’గా భావించారు. ఆ తరువాత దానిని దిద్దుకునే ప్రయత్నమూ చేశారు. ఈ దిద్దుబాటు క్రమాన్ని (1802 నుండి 1908 వరకు) ‘జమిందారి రైతు సమస్య’ పేరుతో రాజమండ్రి నుండి మందేశ్వర శర్మ 1933లో ప్రచురించిన పుస్తకంలో వివరించారు. ఈ మార్పుల ద్వారా సాగులో వున్న రైతుల హక్కులను బ్రిటిష్ వారు గుర్తించే ప్రయత్నం చేసారు. చట్టంలో ఉన్నా లేకపోయినా భారతీయ సంప్రదాయం ‘స్వాధీన అనుభవ హక్కును’ గుర్తిస్తుంది. భూమిపై ఏర్పడిన పలు హక్కులలో పట్టా/యజమాని హక్కు ఒకటి మాత్రమే.

హైదరాబాద్ కౌలుదారి– వ్యవసాయ భూమి చట్టం 1950, సెక్షన్ 5(1) ప్రకారం వరసగా రెండు సంవత్సరాలు సాగు చేయకుండా భూమిని ఉంచరాదు. అందుకు సహేతుకమైన కారణాలు చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం అయిన తరువాత ఆ చట్టాన్ని నెమ్మదిగా నీరుగార్చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక ఇలా పలు రాష్ట్రాలలో వ్యవసాయం చేయని వారు వ్యవసాయ భూమి (ఒక ఆస్తిగా/ రియల్ ఎస్టేట్) కొనుగోలు చేయకుండా నిషేధాలు వున్నాయి. ఏ అడ్డంకులు లేనిది మన దగ్గిరే. పట్టాదారు పాసు పుస్తకాల చట్టం (ROR) సెక్షన్‌ 26(6) ప్రకారం పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలంటే ఆ వ్యక్తి సాగులో వుండాలి. మన సాంప్రదాయం సాగు అనుభవాన్ని గుర్తిస్తుంది. స్థిర అనుభవం (Settled cultivation) ద్వారా ‘సహజంగా’ ఏర్పడే ‘టైటిల్’ హక్కును న్యాయవ్యవస్థ గుర్తిస్తుంది. కనుక ‘టైటిల్ గ్యారంటి భావన’ దీనికి విరుద్ధం తాము తెచ్చిన ఈ చట్టం ద్వారా భూమి మీద ఉన్నదానిని రికార్డు ప్రతిఫలిస్తుందని, దానినే ‘అద్దంలో ప్రతిబింబం’ (మిర్రర్ ఇమేజ్) అని అంటున్నారు. ఇందుకు ‘టైటిల్ గ్యారంటి చట్టం’తో సంబంధం లేదు. 1948 జమీందారి చట్టం రద్దు తరువాత జరిగిన సర్వే అండ్‌ సెటిల్మెంట్ ద్వారా రూపొందిన రికార్డులు చాలా కాలంపాటు ఆపని చేసాయి. దూరద్రుష్టి, ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా రెవిన్యూ వ్యవస్థలో చేసిన మార్పులు వలననే అది దెబ్బతిన్నది. భూమి శిస్తు నుండి వాణిజ్య పన్నులు, సారా ఆదాయాలకు ప్రభుత్వాలు మళ్ళడంతో రెవిన్యూ వ్యవస్థపై ఆసక్తి పోయింది. అది అసలు కారణం.

తమ తప్పిదం వలన ‘టైటిల్ దారు’కు నష్టం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందనడం నమ్మడానికి వీలు లేని సంగతి. పార్లమెంట్ చేసిన ఉపాధి హామీ చట్టంలో 15 రోజులలో పని, వేతనం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి, పరిహారం హామీ ఇచ్చారు. మేము హైకోర్టుకు వెళ్లి గెలిచిన కేసులలో కూడా ఒక్క దమ్మిడి కార్మికులకు దక్కలేదు. ఇక, ఇప్పుడో మూడు కేసులు చూద్దాం.

అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కొండలకొత్తూరు గ్రామ ఆదివాసీ వంతంగి పేరయ్య వయస్సు 75 సంవత్సరాలు. పేరయ్య అతని పరివారేమే భూమి సాగులో ఉన్నారు. కాని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంకు చెందిన వారే హక్కుదారులుగా, సాగుదారులుగా మండల రెవిన్యూ కార్యాలయం రికార్డులో కనిపిస్తారు. అదే మండలానికి చెందిన కొత్తవీధి అనే కొందు ఆదివాసీల గ్రామం, ఆ గ్రామం చుట్టూ వున్న భూమిలో గెమ్మెల బాలరాజు ఆయన పరివారం సాగులో వుంది. భూమి శిస్తు కమీషనర్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ స్వాధీన అనుభవాన్ని సర్వే చేయమని (మిర్రర్ ఇమేజ్) గత ఏడాదిలో ఆదేశాలిచ్చినా ఏమీ జరగలేదు.

ఇక, గదబపాలెం అన్న ఊరులో అక్కడ ఉన్నవారంతా ఆదిమతెగకు చెందిన గదబ ఆదివాసీలు. గోరా సూరిబాబు, అతని తెగ వారు 40 ఎకరాల మెట్టు భూమిలో సాగులోవున్నారు. కానీ, క్రియదస్తావేజులు ఉన్నాయంటున్న వారు 50 ఏళ్ల కిందటే అమెరికా వెళ్ళిపోయారు, అక్కడి పౌరులైనారు. కాని భూమి మీద టైటిల్ హక్కులు వాళ్ళవేనట. ఈ కొత్త చట్టం, వంతంగి పేరయ్య, గెమ్మెల బాలరాజు, గోరా సూరిబాబుల హక్కులకు ఎలాంటి రక్షణ ఇవ్వనుంది? ఈ చట్టం అమలులోకి వస్తే రికార్డులో పట్టాదార్లుగా నమోదైన వారి తరుపున వకాల్తా తీసుకొని, ఈ నోరు లేని సాగుదారులకు వ్యతిరేకంగా మహాశక్తివంతమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగుతుందా?

ఏవో మూడు కేసులు చెప్పి ప్రభుత్వ ప్రయత్నాలను తప్పు పట్టడం సరికాదని ఎవరైనా అనవచ్చును. కానీ, ఏదైనా ఒక విధానాన్ని రూపొందించే ముందు కళ్ళముందు మెదలవలసిన, మహాత్మాగాంధీ చెప్పిన ఆఖరి మనుషులు వీళ్ళు. రెవిన్యూలో ఒక్క చిన్న ఉద్యోగి మీద కూడా చర్యలు తీసుకోగలిగే పరిస్థితి లేదు. రాష్ట్ర కేడర్ ఉద్యోగులే కాదు చివరికి కేంద్ర కేడర్ ఉద్యోగులు సైతం రాజకీయ ఒత్తిడికి, ఇతర ప్రలోభాలకు లొంగిపోతున్నారు. రెవిన్యూ కోర్టులంటే అధికారం అనే ‘కర్ర’ వున్న వారి చేతిలోని ‘బర్రె’లని గుర్తించాలి. ‘టైటిల్’ కు కాదు, సాగు అనుభవానికి గ్యారంటీ ఇవ్వడం ఎలాగో ఆలోచించండి.

పిఎస్‌. అజయ్ కుమార్

జాతీయ కార్యదర్శి,

అఖిల భారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం (AIARLA)

Updated Date - Jan 14 , 2024 | 01:42 AM