Share News

‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అంత సులభం కాదు!

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:57 AM

తెలంగాణ సమస్యలు, సవాళ్ల మీద ఫిబ్రవరి 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పౌరసమాజ ప్రతినిధులతో ఒకటిన్నర గంటలు లోతుగా చర్చించారు. పౌరసమాజంలో క్రియాత్మకంగా పనిచేస్తున్న...

‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అంత సులభం కాదు!

తెలంగాణ సమస్యలు, సవాళ్ల మీద ఫిబ్రవరి 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పౌరసమాజ ప్రతినిధులతో ఒకటిన్నర గంటలు లోతుగా చర్చించారు. పౌరసమాజంలో క్రియాత్మకంగా పనిచేస్తున్న ఇతర సంస్థల బాధ్యులను కూడా పిలిస్తే మరింత ప్రజాస్వామికంగా ఉండేది. ప్రభుత్వం ప్రజాసంఘాలను నిరంతరం కలవడం ప్రజాస్వామ్య అవసరమని సూచించడం జరిగింది. ఈ చర్చ తర్వాత ప్రభుత్వం ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు మీడియా చాలా ప్రాధాన్యతనిచ్చింది. ప్రకటన రైతు సమస్యల, అలాగే విద్యారంగం సమస్యల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ రెండు సమస్యల మీద రెండు కమిషన్లు ఒకటి విద్యా కమిషన్‌, రెండు వ్యవసాయ కమిషన్‌ వేసామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ సమస్యల మీద చాలా చర్చ జరిగింది. కాని ఈ ప్రకటనలో రాష్ట్రంలోని నిర్బంధం మీద జరిగిన చర్చకు అంత ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణ ప్రజాసంఘాలు గత పదేళ్లుగా విపరీతంగా పెరిగిన నిర్బంధం పట్ల ఏం చర్యలు తీసుకుంటారనే కాక, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తామని తమ మానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రూపంలో కాక సారంలో పునరుద్ధరిస్తే, విద్యారంగ సమస్యలపై కాని, రైతాంగ సమస్యలపై కాని సమాజంలో విస్తృత చర్చ జరుగుతుంది. ప్రజలు తమ ఉద్యమాల ద్వారా సమస్యల తీవ్రతనూ వ్యక్తపరుస్తారు. తద్వారా ప్రభుత్వానికి ఈ తీవ్రత అవగాహన కావడమే కాక సమాజంలో జరిగే క్రియాత్మకమైన చర్చలో చాలా సలహాలు, పరిష్కారాలు ముందుకు వస్తాయి.

తెలంగాణ ప్రజలు తెలంగాణాను తమ రాజీలేని పోరాటంతో విస్తృత ప్రజల భాగస్వామ్యంతో సాధించుకున్నారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ అంశాన్ని నిండుగా గుర్తించి ఉద్యమం సృష్టించిన ప్రజాస్వామ్య సంస్కృతిని వికసింపచేసి ఉంటే ఇవ్వాళ తెలంగాణ చాలా భిన్నంగా ఉండేది. తెలంగాణ రావడం, రావడమే ఎన్‌కౌంటర్లతో ప్రారంభమయ్యింది. పోలీసు యంత్రాంగానికి గత మూడు నాలుగు దశాబ్దాలుగా అలవాటైన చట్టాతీత బలప్రయోగం మార్చుకోవాలని కాని, దానిని మార్చడానికి కాని రాజకీయ నాయకత్వం ఏ ప్రయత్నం చేయకపోవడం విషాదం. ఇంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ నిర్బంధమేమిటి? మీటింగ్‌లు పెట్టుకోలేకపోవడమేమిటి? మీటింగ్‌ హాల్‌కు తాళాలు వేయడమేమిటి? అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఈ కొనసాగుతున్న వైఖరిని గురించి ఒక సీనియర్‌ పోలీసు అధికారితో అంటే, ‘‘మీరు తెలంగాణలో పోలీసుల సంస్కృతి మారాలని కాని, నిర్బంధ చట్టాలు మార్చాలని కాని పోరాటంలో భాగంగా డిమాండ్‌ చేసారా?’’ అని ఎదురు ప్రశ్న వేసారు. నిజమే తెలంగాణ ఉద్యమంలో ఈ అంశం మీద విస్తృత చర్చ జరగలేదు. తెలంగాణ వస్తే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల గొంతుకు చాలా విలువ ఉంటుందని నిర్బంధాన్ని నియంత్రించవచ్చని భావించారు. ఉద్యమంలో ప్రజాస్వామ్య ఆకాంక్ష అంతర్లీనంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పేరుకుపోయిన నిర్బంధానికి వ్యతిరేకంగానే కదా ఉద్యమం వచ్చింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలని, చట్టబద్ధ పాలనని గౌరవించి ఉంటే, తెలంగాణ పోరాటాలను, ప్రజల ఆకాంక్షలను సరిగ్గా అంచనా వేసి స్పందించి ఉంటే, రాష్ట్ర విభజన దాకా పరిస్థితి వచ్చేది కాదేమో.

రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ. ఈ అంశం మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కాని స్వేచ్ఛ మీద దాడి జరిగితే సహించరు’ అన్న ఒక మంచి సూత్రీకరణ చేసారు. స్వేచ్ఛ ఉంటే ఆకలితో ఉన్నవాళ్లు ఉద్యమించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడి తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న కొన్ని చర్యల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ అవగాహన మేరకు ప్రభుత్వం పనిచేస్తే పాలన స్వభావంలో కొంత మార్పు వస్తుంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే అది అన్నంత సులభం కాదు. ఈ పునరుద్ధరణకు తీసుకోవలసిన కొన్ని చర్యలను చర్చలో భాగంగా ప్రస్తావించడం జరిగింది. శాంతిభద్రతల యంత్రాంగం అవగాహనలో, ప్రవర్తనలో, ఆచరణలో కొన్ని ప్రజాస్వామ్య ప్రమాణాలను గౌరవించడం, బలప్రయోగం చట్ట పరిమితులకు పరిమితం చేయడం ప్రజాస్వామ్యానికి ఇరుసు వంటిది. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉందని, ఈ రాజ్యాంగం పౌరులకు చాలా హక్కులు కల్పించిందని, మాట్లాడే స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, ఎలాంటి భావాలనైనా కలిగి ఉండే స్వేచ్ఛ, తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమించే స్వేచ్ఛ వారికి ఉన్నాయని గుర్తెరగాలి– వాటి మీద కనీస అవగాహన కావాలి.

స్వేచ్ఛతో కూడిన సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి విలువల పునాదిగా సమాజాన్ని నిర్మిస్తామని, అన్ని రకాల అసమానతలను తగ్గిస్తామని, దేశ సంపదను కేంద్రీకృతం కానివ్వబోమని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. తెలంగాణ ప్రజల చైతన్యంలో ఈ విలువలు, అవగాహన మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ పాళ్లలో ఉన్నవి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగ దృక్పథమే ప్రతిపక్షాల ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ కోణంలో ముఖ్యమంత్రి అన్నట్లు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ మీద దాడి జరిగితే సహించరు అన్నది నిజం. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ఈ ‘‘తెలంగాణ ఆత్మను’’ పట్టుకోలేకపోయింది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజలు సదా రుణపడి ఉంటారని ఎక్కడో ఒక అవగాహన లోపం ఆ పార్టీ సంక్షోభానికి ప్రధాన కారణం.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు, మంత్రులకు ఈ అంశం మీద దృష్టి చాలా అవసరం. మంత్రులందరూ ఒక ప్రశ్న తమకు తాము వేసుకోవాలి. అధికారం యొక్క లక్ష్యం ఏమిటి? తాము ప్రజలతో ఎలా ప్రవర్తించాలి? సమస్యలకు ఎలా స్పందించాలి? ఎంత మానవీయంగా ఉండాలి? చరిత్ర తమ గురించి భవిష్యత్తులో ఎలా అంచనా వేస్తుంది? అన్న ఒక చారిత్రక స్పృహ కలిగి ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమంటే ఒక తాత్విక, చారిత్రక అవగాహన ఉంటే తప్ప సాధ్యంకాదు. మంత్రులందరికీ కనీసం ప్రజల మీద నిర్బంధం తగ్గాలని, దాన్ని నియంత్రించాలనే కనీస పట్టింపు ఇప్పుడు అవసరం. ఉదాహరణకు తెలంగాణలో దుర్మార్గమైన ఉపా (UAPA) చట్ట దుర్వినియోగం దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెద్ద ఎత్తున జరిగింది. గత పదేళ్లుగా తెలంగాణ గతంతో పోలిస్తే శాంతియుతంగానే ఉంది. ఐనా పదమూడు కుట్రకేసుల్లో రెండువందల కంటే ఎక్కువ మందిని ఇరికించారు. తాడ్వాయ్‌ ఉపా కేసు ఈ దురుపయోగానికి పరాకాష్ట. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అత్యంత గౌరవప్రదుడైన జస్టిస్‌ సుగేహ్‌ని, అదీ ఆయన అమరుడైన రెండేళ్ల తర్వాత ఇందులో ఇరికించి ఆయనపై కుట్ర కేసు పెట్టడమేమిటో? పోలీసుల ఈ విచ్చలవిడి దురుపయోగానికి తెలంగాణ సమాజం నుండి పెద్ద ఎత్తున నిరసన రావడంతో మొత్తం కేసును ఎత్తివేసే బదులు ఆరు మందిపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేసులు పెట్టే ముందు పై అధికారులకు కనీసం వీళ్లు ఎవ్వరు అనే కనీస విచక్షణైనా ఉండాలి కదా. పోలీసు యంత్రాంగం ఇలా ప్రవర్తించడానికి పోలీసులే పూర్తి కారణం కాదు. దీనికి రాజకీయ వ్యవస్థ ప్రత్యక్ష లేదా పరోక్ష సమ్మతి ఉన్నపుడే ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి దురుపయోగానికి ప్రజలు పోలీసులను కాక అధికార పార్టీని శిక్షిస్తారు. గత ప్రభుత్వం పెట్టిన ఉపా కేసులని సమగ్రంగా సమీక్షించి వాటిని ఈ ప్రభుత్వం ఎత్తివేయాలి. గత వంద రోజులుగా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి మాట్లాడినా, కింది యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు వెళ్లలేదు. ఉదాహరణకు, భువనగిరిలో ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్యకు నిరసనగా చైతన్య మహిళా సంఘం ధర్నా చేస్తే పోలీసులు దాన్ని భగ్నం చేసారు. ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు, న్యూ డెమోక్రసీ పార్టీని, అరుణోదయ విమల నాయకత్వం వహిస్తున్న సంస్థను నిషేధిత సంస్థలుగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. ఆ రెండు సంస్థలు దశాబ్దాలుగా ఓపెన్‌గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్య పనిచేస్తున్నవి. ఈ వైఖరికి మినహాయింపు... కొన్ని దశాబ్దాల తర్వాత వరంగల్‌ పోలీసులు అమరుల బంధుమిత్రుల సంఘం విప్లవ రాజకీయ పార్టీల మీద నిషేధం ఎత్తివేయాలనే సదస్సు నిర్వహిస్తే ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు. పౌరహక్కుల సంఘం తన యాభై సంవత్సరాల ప్రస్థానాన్ని జరుపుకుంటే హైదరాబాద్‌ పోలీసులు జోక్యం చేసుకోలేదు కానీ హరగోపాల్‌ నక్సలైట్‌ కాబట్టి ర్యాలీకి అనుమతి ఇవ్వం అనడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదు. అనుమతి ఇవ్వకపోవడానికి ఏదో తమకు తోచిన కారణం చెప్పడం చాలా కాలం అలవాటుగా మారిన నేపథ్యంలో, ఈ వైఖరి మార్చే దిశగా చర్యలు ఉండాలి.

ప్రొ. జి.హరగోపాల్‌

Updated Date - Mar 27 , 2024 | 12:57 AM